లాలాజీ - బాబూజీల కలయిక
జూన్ 3, 1922
ఆత్మ ఈ ప్రపంచంలోకి వచ్చిన తరువాత ఆగమ్యగోచరంగా దిశ లేకుండా, ఎందుకొచ్చామో, ఏం చేయాలో, ఎక్కడికి ప్రయాణిస్తున్నామో, ఎక్కడికి ప్రయాణించాలో, గమ్యం ఏమిటో, ఎందుకు జన్మించామో, ఎందుకు మరణించాలో, మన అస్తిత్వానికి కారణం ఏమిటి, మన జీవిత ప్రయోజనం ఏమిటో, కష్టాలు ఎందుకు పడాలో, ఇలా అనేక మన అస్తిత్వానికే సంబంధించిన ప్రశ్నలతో పైకి మనం ఏమి చేస్తున్నా కూడా, అంతరంగం అల్లకల్లోలంగా ఉండే స్థితిలో మనుగడ కొనసాగిస్తూ ఉంటుంది ఆత్మ.
వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ప్రతి యొక్క ఆత్మకు తనకు ప్రకృతిచే నిర్ధారించిన గురువు యొక్క సాన్నిధ్యం లభించటం, అటువంటి సమర్థ గురువును కలవగలగడం. కచ్చితంగా అది సత్యాన్వేషకుడు చేసుకునే ఎంపిక కాదు. శిష్యుడు తయారుగా ఉన్నప్పుడు గురు దర్శనం జరుగుతుంది. " గురువే సాధకుడిని ఎంపిక చేసుకుంటాడు" అంటారు చారీజీ. అటువంటి అద్భుతమైన కలయిక సరైన సమయం వచ్చినప్పుడు, ఈ అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలతో, సమాధానాల కోసం పరితపిస్తున్న ప్రతీ ఆత్మకు సంభవిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. కొందరికి ఈ తపన అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఈ తపన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత త్వరగా గురువు లభిస్తాడు.
ఆదిశంకరులు తన గురువైన గోవింద భగవత్పాదుల వారిని కలిసిన క్షణం, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణులవారిని కలిసిన క్షణం, పార్థసారథి రాజగోపాలాచారీజీ బాబూజీని కలిసిన క్షణం, పూజ్య కమలేష్ పటేల్ జీ పూజ్య బాబూజీని కలిసిన క్షణం, ఇలా ఎంతో మంది మహానుభావుల తమ తమ గురువులను ఆత్మస్థాయిలో సంపర్కం జరిగిన క్షణాలను, కలిసిన ఘట్టాలను మనం పరికించి చూసినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అటువంటి క్షణాలు గురువును పొందిన క్షణంలో మనం కూడా అనుభూతి చెందడం జరుగుతుంది.
ఆ అద్భుత క్షణం అత్యంత నిగూఢమైనది. మహాత్ముల జీవితాన్ని పరిశీలిస్తే, వారి జీవిత చరిత్రలను గమనిస్తే అనిపించిందేమిటంటే - ఆ క్షణంలోనే బీజస్థాయిలో ఆధ్యాత్మికంగా జరుగవలసిన మహత్తర కార్యం అంతా జరిగిపోతుంది. ఆ తరువాతి జీవితంలో ఈ ఆధ్యాత్మిక బీజం వికసించడమే మనం వీక్షించడం జరుగుతుంది అంతే. సాధన ద్వారా ఈ బీజరూపంలో ఉన్నది నెమ్మది నెమ్మదిగా మొలకెత్తి, ఆ తరువాత వృక్షమవుతుంది.
అటువంటి అద్భుత క్షణమే బాబూజీ 22 సంవత్సరాల వయసులో ఫతేగఢ్ లో పూజ్య లాలాజీని కలిసిన క్షణం. అందులో బాబూజీ-లాలాజీల కలయిక చాలా ప్రత్యేకమైనది. తన గురువును గురించి విని బాబూజీ ఫతేగఢ్ లో ఉన్న లాలాజీని దర్శించాలని, ఆయన నిర్వహించే సత్సంగంలో పాల్గొనాలని రావడం జరుగుతుంది. సత్సంగంలో చివ్వరిలో కూర్చుంటారు బాబూజీ. లాలాజీ ధ్యానం ప్రారంభిస్తారు. ఆ క్షణమే బాబూజీ, లాలాజీ సంపూర్ణ రూపంపై ధ్యానించడం ప్రారంభించారట. అప్పటి నుండి జీవితం అంతా బాబూజీకి జగమంతా లాలాజీ మయమే. లాలాజీ గాక ఈ ప్రపంచంలో ఇక ఏముంది అని అంటూండేవారు. లాలాజీ మహాసమాధి తరువాత కూడా బాబూజీ ప్రతి నిత్యం ప్రతి క్షణం, లాలాజీ నుండి మార్గదర్శనం పొందుతూండేవారు. దాని ఫలితమే శ్రీరామ చంద్ర మిషన్ అనే ఆధ్యాత్మిక సంస్థ. దాని ఫలితమే సహాజమార్గ ధ్యాన పద్ధతి ఉనికిలోకి వచ్చినది. లాలాజీ కృప వల్లనే ప్రాణాహుతి శక్తి భువిపైకి వచ్చింది. ప్రతీ ఆత్మలో ఉన్న ఆధ్యాత్మిక తృష్ణను సంతృప్తి పరచేది ఈ ప్రాణాహుతి శక్తి మాత్రమే. దాని ఫలితమే ఈ రోజున ఈ సంస్థ ఇంతగా వ్యాపిస్తూ ఉంది, ఒక రోజు ఈ భూగ్రహం అంతా వ్యాపించి తీరుతుంది కూడా.
ఆ కలయిక ఎలా ఉంటుంది?
ఆ కలయిక అంటూ జరిగితే, ఆ సంపర్కం ఎప్పటికీ విడిపోని విధంగా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది. ఒక్కసారి అటువంటి గురువు లభించిన తరువాత సాధకుడు తనను తాను ఆ గురువును ఇనుప సంకెళ్ళతో బంధించేసుకోవాలంటారు బాబూజీ. ఆ తరువాత చేసే సాధన ఈ ఆత్మీయ బంధాన్ని పటిష్ఠం చేస్తుంది. జీవిత ప్రయోజనం సిద్ధిస్తుంది, మనుగడ అర్థవంతంగా ఉంటుంది, జన్మ సార్థకమవుతుంది.
🙏🏻
రిప్లయితొలగించండిఅద్భుతం కృష్ణారావు గారు ... తన సమర్థులైన సద్గురువు గారితో పరిచయం చక్కగా మా కళ్ళకు కట్టి, సాధకుడు అన్న ప్రతిఒక్కరికీ జరిగిన ఈ సమాగమం గురించి ఒక్కసారి చూసుకునే విధంగా తట్టి లేపారు. ఈ విధమైన గంభీరమైన విషయాలను తేట తెల్లం తప్పక చేయగలరు.
రిప్లయితొలగించండి