1, ఫిబ్రవరి 2024, గురువారం

బాబూజీ - లాలాజీ గురించి - 1


బాబూజీ - లాలాజీ గురించి - 1 

"Lives of great men all remind us, we can make our lives sublime."

"మహాత్ముల జీవితాలన్నీ మనం మన జీవితాలను ఉదాత్తమైనవిగా మార్చుకోవచ్చునని మనకు గుర్తు చేస్తాయి."

అవతరణ 
ఫిబ్రవరి 2, 1873 బసంత పంచమి శుభసందర్భాన  ఒక దివ్య వెలుగు ఈ భూమ్మీదకు దిగివచ్చింది. ప్రకృతి ఒక నిశ్శబ్ద వాగ్దానం చేయడం జరిగింది;  మనలను ఆదుకోవడం కోసం ఒక కనిపించని చేయి ముందుకు చాపడం జరిగింది. మానవాళి తెలియకుండానే తనపై తాను వేసుకున్న ఉక్కు శృంఖలాల నుండి, తాను ఏర్పరచుకున్న భారం నుండి తనను తాను వదిలించుకోవడం ప్రారంభించింది. 

కుటుంబ నేపథ్యం 
లాలాజీ (శ్రీరామచంద్రజీ, ఫతేగఢ్, ఉత్తర ప్రదేశ్) ఒక గొప్ప పేరున్న జమీందారీ కుటుంబానికి చెందినవారు. వాళ్ళను జాగీర్దార్లనేవారు. వారి తాతగారైన బృందావన్ బాబు గారికి, వారి అద్భుతమైన లక్షణాలను, సాధించిన ఉదాత్తమైన సిద్ధులను చూసి, అక్బర్ చక్రవర్తి 555 గ్రామాలను ఇవ్వడం జరిగింది. వారి తండ్రిగారు శ్రీ హరబక్స్ రాయ్ గారు ఫరూక్కాబాద్ జిల్లాలో టాక్స్ సూపరింటిండెంట్ గా పని చేసేవారు. తల్లి సాధు స్వభావురాలు. ఆమెకు చక్కటి గళం ఉండేది, పాడితే మధురంగా ఉండేది. ఆమె రామచరిత మానస్ పాటతో అందరి మనసులు తేలికగా గెలుచుకునేవారు.

విద్యాభ్యాసం  
వారి తల్లిగారి వద్ద రామచరితమానస్ నేర్చుకున్నారు. చాలా శ్రావ్యంగా పాడేవారు. విన్నవారు మంత్రముగ్ధులయిపోయేవారు. సంగీతం పట్ల మంచి అభిరుచిని కనబరచేవారు. విన్న పాటలను ఉన్నదున్నట్లుగా సూక్ష్మాలతో సహా సరిగ్గా పాడేసేవారు. లాలాజీ ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిందీ, ఇంగ్లీషు  భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. ఇంకా స్కూలు విద్యార్థిగా ఉండగానే భగవంతుని తెలుసుకోవాలన్న తీవ్ర తపన వారిలో కలిగింది. 

వివాహం, గృహస్థ జీవనం 
సాధుస్వభావం గల ఒక  స్త్రీతో, మంచి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన  స్త్రీతో లాలాజీ వివాహం జరిగింది. అప్పటికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు బాగానే ఉండేవి. కాని లాలాజీ ఒక ధనికుడిలా జీవించలేదు. విధివశాన వారి పూర్వీకులు సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోవడం జరిగింది. ఎన్నో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో, ఎప్పటికప్పుడు అన్నీ రకాల పరిస్థితులకు తగినట్లుగా తనను తాను సర్దుకుంటూ ఎన్నో భరించలేని కష్టాలను ఎదుర్కున్నారు.  వీరి కష్టాలు విన్న ఫరూక్కాబాద్ కలెక్టర్ నెలకు 10 రూపాయల ఉద్యోగంలో వారిని నియమించడం జరిగింది. 

లాలాజీ విగ్రహం 
సగటు మనిషి ఎత్తు కలిగి ఉండేవారు. చక్కని ముఖవర్ఛస్సు. ఆయన వ్యక్తిత్వం ఎంత తేజోమయంగా ఉండేదంటే, ఆయన ఆహార్యం ఆత్మలో ఉన్న అపూర్వ సామరస్యం ఆయన ముఖంలో కనిపించేది. ఉదారతతో నిండిన వ్యక్తిత్వం. గోధుమ రంగు ఛాయ, ఆకర్షణీయమైన ముఖభాగాలు. విశాలమైన మేధస్సును సూచిస్తూ విశాలమైన ఎత్తైన నుదురు. కానీ దాన్ని తన కోసం ఉపయోగించలేదెప్పుడూ; ఇతరుల కోసం ఒక దీపస్తంభంలా దారి చూపించడానికి వినియోగించేవారు. ఆయన కళ్ళు రెండు నక్షత్రాల్లా మెరుస్తూండేవి. ఆ కళ్ళు దేనినైనా, దేనిలోకైనా ఆశాంతమూ లోలోతుల్లోకి చూసే విధంగా ఉండేవి. ఆ కళ్ళ లోతులు కొలవలేని విధంగా ప్రశాంతమైన సరస్సుల్లా ఉండేవి. నిద్ర, వేకువగా ఉండటం కలగలసి ఉన్నట్లుగా ఉండేవి ఆ కళ్ళు; ఒక్క కనురెప్పపాటులో అవతల వ్యక్తిలో భగవత్సాక్షాత్కార అనుభూతి కలిగించే విధంగా ఉండేవి ఆ కళ్ళు; వారి జుట్టు ముట్టుకుంటే పట్టులా ఉండేది. ముందు పన్ను ఒకటి మిగిలినవాటితో పోలిస్తే పెద్దదిగా ఉండేది. ఒక చిన్న అందమైన గడ్డం, మీసం ఉండేవి. ఆయన చెవులు మధ్యస్థంగా ఉండేవి. ఆయన చేతులు, పాదాలు చాలా నాజూకుగా సున్నితంగా ఉండేవి. 

(సశేషం ..) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...