బాబూజీ - లాలాజీ గురించి - 6
లాలాజీ ఆధ్యాత్మిక శిక్షణ
లాలాజీ ఆధ్యాత్మిక పరిపూర్ణత మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడేవారు:
1) మాస్టర్ పట్ల ప్రేమ
2) మాస్టర్ తో సత్సంగం
3) మాస్టర్ పట్ల విధేయత.
మంచి సుపాత్రులైన శిష్యులకు ఆయన శాస్త్రజ్ఞానాన్ని ఇచ్చేవారు కాదు. నేరుగా సత్సంగంలో (సామూహిక ధ్యానంలో) కూర్చోమనేవారు. శిష్యుల సామర్థ్యాలను బట్టి వారు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చేవారు. కొంతమందికి సూరత్ శబ్ద యోగాన్ని చెయ్యమనే వారు; కొంతమందిని హృదయంపై ధ్యానించమనేవారు. మరికొంతమందికి మంత్రజపం ఉపదేశించేవారు. మిగిలినవారికి కేవలం కొన్ని కర్మలనాచరించమనేవారు. అయితే హృదయంపై ధ్యానించినా, మంత్రజపం చేసినా, సత్సంగంలో కూర్చున్నా, గురువు అనుగ్రహం పొందడం చాలా ముఖ్యమని నొక్కి చెబుతూండేవారు. ఒక్కోసారి హృదయంలో ఓంకార శబ్ద జపాన్ని కూడా చేయమని ఆదేశించేవారు. ఈ అన్నిటి ప్రక్రియల వల్ల గాని లేక యే ప్రక్రియ వల్లనైనా గాని సాధకుడిలో శబ్దం కదలికలోకి తీసుకువచ్చేవారు. ఈ శబ్దం వినిపించినప్పుడు లాలాజీ సాధకులను దాన్ని నిరంతరం వింటూండటానికి ప్రయత్నంచమనేవారు.
యే కులానికి గాని యే జాతికి సంబంధించినవారినైనా, యే మత నేపథ్యం నుండి వచ్చినా సరే, యాదార్థతత్త్వం ఏమిటో తెలుసుకోవాలని తపిస్తున్నవారికి, ఆధ్యాత్మిక తృష్ణ గలవారు ఎవరైనా వారి వద్ద ఆధ్యాత్మిక శిక్షణ పొందడానికి అర్హులేననేవారు. రకరకాల వ్యక్తులకు రకరకాల పద్ధతులు ఉపదేశించేవారు. ఒక్కోసారి వాళ్ళకి బాగా ఇష్టమైన వస్తువుపైన గాని, ఇష్టమైన వ్యక్తిపైన గాని ధ్యానించమనేవారు. సర్వమతధర్మాలకు సంబంధించిన గ్రంథాలను నమ్మేవారు; మహాత్ములందరినీ గౌరవించేవారు. యే ధర్మంలో జన్మించారో, అదే ధర్మాన్ని అనుసరించడం మంచిదని వారి విశ్వాసం. (స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్న భగవద్గీతలో చెప్పిన విధంగా).
వారు విగ్రహారాధనను వ్యతిరేకించేవారు. తన శిష్యులను తన ఫోటోను పెట్టుకోనిచ్చినా, దానిని ఆరాధించనిచ్చేవారు కాదు. ఆయనకు ఆత్మస్తుతి ఇష్టం ఉండేది కాదు; ఎవరినీ తన పాదాలను స్పృశించనిచ్చేవారు కాదు; కేవలం హిందువులకు మాత్రమే ఆ అనుమతి ఉండేది, ఎందుకంటే అది వాళ్ళ ఆచారం కావడం చేత.
అతిగా జపతపాలు చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయన మధ్యస్థ మార్గాన్ని ఎంచుకున్నారు; హృదయంపై ధ్యానించడమే నిజమైన సాధన అనేవారు. ప్రార్థనకు గొప్ప ప్రాధాన్యతనిచ్చేవారు, కానీ భౌతిక ప్రయోజనాల కోసం కాదు. ఈ లోకం యొక్క ఆత్మను గురించి ఆయన స్వయంగా నిరంతరమూ ప్రార్థిస్తూ ఉండేవారు.
ఆయన దృష్టిలో ప్రతీ ఆధ్యాత్మిక అన్వేషకుడికీ ఒక గురువు ఉండి తీరాలి. కానీ ఆయనను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి సాధకుడు గురువును కనుగొన్న తరువాత, ఆ గురువుకు సంపూర్ణంగా సమర్పించేసుకోవాలి; ఒక మృతుడు తనను తాను, శవాన్ని అలంకరించేవానికి సమర్పించుకున్నట్లుగా.
హృదయంలో ఉన్న వివిధ జటిల తత్త్వాలను తొలగించడానికి, తన అనుచరులకు, శత్రువులను, స్నేహితులుగా మార్చుకోమని, అస్సలు పడని వ్యక్తులను స్నేహితులుగా మార్చుకోమని, ఇతరులు తమకు యేది చేయాలనుకుంటారో, అదే ఇతరులకు చేయమని ఆదేశీస్తూండేవారు. అన్నిటికంటే అతిగొప్ప తపస్సు ప్రేమే అనేవారు.
లాలాజీ ప్రవర్తన విషయంలో చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు; ప్రామాణికమైన నైతిక సూత్రాలను, సత్ప్రవర్తనా నియమావళిని అనుసరించకపోయినట్లయితే, సాక్షాత్కారం అసంభవమని నిర్ద్వంద్వంగా చెప్పేవారు. అనైతిక వ్యక్తులతో కూడి ఉండటం గాని, సత్సంగంలో పాల్గొనడం గాని చేయొద్దనేవారు. ఎప్పుడూ భగవంతుని కోసం పరితపించే ప్రేమతో నిండిన హృదయాలున్నవారి సాంగత్యంలో ఉండమని, అలాగే ఇతరులను ప్రభావితం జేసే విధంగా ఉండేవారి సాంగత్యంలో ఉండమని నిర్ద్వంద్వంగా సూచించేవారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి