23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

గురువు లేక మాస్టర్ - 2

 


గురువు లేక మాస్టర్ - 2

ఈ సృష్టిలోని జీవరాసుల జన్మలన్నిటి కంటే ఉత్కృష్టమైన జన్మ, మానవ జన్మ. మానవ జన్మ ఉత్కృష్టమైనది ఎందుకంటే, మానవ జన్మలోనే మోక్షప్రాప్తి సాధ్యపడుతుంది గనుక. అత్యున్నత ఆత్మవికాసం జరిగే అవకాశం ఉంది గనుక. అమీబా లాంటి ఏకకణ జీవి నుండి మనుష్య జన్మ వరకూ వికాసం లేక పరిణామం అనేది తనంతట అదే జరిగిపోతుందిట; మనుష్య జన్మ తరువాత కూడా ఈ పరిణతి దివ్యలోకాల్లో మళ్ళీ తనంతట అదే జరుగుతుంది; కానీ మానవ జన్మ వచ్చిన తరువాత మాత్రం, వికాస పథంలో ఇంకా ముందుకు సాగాలంటే, ప్రకృతికి ఈ ప్రక్రియలో ఇష్టపూర్వకంగా పాల్గొనేవారే కావాలట. కాబట్టి సాధకుడి ఇష్టం లేనిదే గురువు ప్రయత్నం ఫలించదు. అందుకే సహజ మార్గ సాధన ప్రారంభించాలంటే అర్హత సంసిద్ధత మాత్రమేనంటారు బాబూజీ. 

ఆధ్యాత్మిక యాత్రలో సాధకుడు ఎన్నో 'చక్రాల' గుండా ప్రయాణించవలసి ఉంటుంది. చక్రాలంటే ఒకే చోట కేంద్రీకృతమైన అసలైన దివ్య శక్తులు. ఒక్కొక్క చక్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన పరిణతి రావడం జరుగుతుంది సాధకుడిలో. చిట్టచివరి చక్రం యొక్క యాత్ర పూర్తయ్యే సరికి మానవుడికి అందుబాటులో ఉండే అతి ఉత్కృష్ట పరిణామ స్థాయిని చేరుకోవడం జరుగుతుంది. మనిషి తన ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఈ యాత్ర లేనిదే సాధ్యపడదు. గురువు ఉండటం వల్ల యాత్ర సుగమవడమే గాక ఎంతో అమూల్యమైన సమయం ఆదా అవుతుంది కూడా. ఈ చక్రాలు మనిషి వారసత్వంగా అందుకున్నవి. ఇవన్నీ ఈ శరీర వ్యవవస్థలోనే ఉన్నాయి. ఈ చక్రాల మధ్య చిక్కు దారాల వంటివెన్నో అల్లుకుని ఉంటాయి. ఈ అల్లుకుపోయిన చిక్కులతో కూడిన పొరల్లో అభ్యాసి ప్రయాణించవలసి ఉంటుంది. వీటిల్లో నుండి బయట పడటం సమర్థుడైన గురువు లేనిదే అసాధ్యం.

అభ్యాసి ఒక్క అడుగు ముందుకు వేస్తే, గురువు నాలుగు అడుగులు వేసి  ముందుకు తీసుకు వెళ్ళడం జరుగుతుంది. అభ్యాసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోయినట్లయితే, గురువు అభ్యాసి వైపు వేసే నాలుగు అడుగుల ప్రయత్నం వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది. 

సహజ మార్గ పద్ధతిలో గురువు బోధించకుండా బోధిస్తాడు. గురువు ప్రతీ అభ్యాసికి అందుబాటులో ఉండగలిగేది ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారానే. గురువు తన అభ్యాసికి అందజేయవలసినదంతా ప్రాణాహుతి ద్వారా అందజేయడం జరుగుతుంది. 

సహజ మార్గ గురువులు లేక మాస్టర్లు తమ ప్రాణానికే ప్రాణమైన ప్రాణాహుతి ప్రసరణతో సాధకుల్లో అంతరంగ పరివర్తన సంభవింపజేస్తారు. 

2 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా వివరించారు. Particularly the intricacy of the journey & the need for total help of the Master!

    రిప్లయితొలగించండి
  2. అవును. పరమ పూజ్య బాబూజీ గారి ఫోటోలు ఎంపిక, సంక్షిప్తంగా ఒక్కొక్క బ్లాగులో అమర్చిన విధం సాధకునిగా నేను ఏం చేయాలో చెప్పకుండా చెబుతుంది. సమర్పణ ! మిగతాది అంతా ఆయన చేతిలోనే !!

    రిప్లయితొలగించండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...