స్పిరిచ్యువల్ అనాటమీ - నిర్ధారణ
(ఆఖరి అధ్యాయం)
***
ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటాం, హృదయాలు తెరుస్తాం. తెరచిన హృదయం కానుక అందుకుంటుంది. కానుకను గుర్తించడం కృతజ్ఞత. కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక స్థితిని మన హృదయాలలో కలుగజేస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించినప్పుడు అది ప్రేమ దిశగా పైకి ఎగుస్తుంది. అంతరంగంలో ఉన్న ప్రేమ, పరమాత్మ పట్ల పూజ్య భావం సృష్టిస్తుంది. పూజ్యభావం మనలో పెరుగుతున్నకొద్దీ, మన హృదయం దైవకృపను ఆకర్షిస్తుంది. కృపా తరంగాలపై పయనిస్తున్న కొద్దీ, సమర్పణ భావం ప్రారంభమవుతుంది. సమర్పణభావం నిర్మలత్వాన్ని సృష్టిస్తుంది. నిర్మలత్వం వల్ల శరణాగతి ప్రారంభమవుతుంది. శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది.
ప్రతీ ధ్యానం ఒక ప్రేమకలాపమే. ఆత్మ, పరమాత్మల కలయికే ధ్యానం. ఒక నీటి చుక్క మహాసముద్రంలో ఏకమయ్యే ప్రయాణమే ధ్యానం.
మీ హృదయంలో పెల్లుబుకుతున్న ప్రేమతో మీ ప్రయాణం కొనసాగనివ్వండి. మిమ్మల్ని ముంచేసే ప్రేమ అయి ఉండాలి, ముంచే ప్రేమ గాకపోయినట్లయితే, ఉద్ధానం ఉండదు కాబట్టి. హృదయపూర్వకంగా మీరు అటువంటి ప్రేమకిరణాలకు లోనవ్వాలని, మీ హృదయ నిగూఢమైన లోలోతుల్లో ప్రారంభమై, అక్కడే ముగించే ప్రయాణంలో కలిగే ఏకత్వభావన వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. మార్గం ఇరుకుగానూ, అంధకారంగానూ ఉండవచ్చు. ఒక్కోసారి ఒంటరితనం విపరీతంగా ప్రబలంగా ఉండవచ్చు. మార్గం నిటారుగా, జారుడుగా ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు అన్వేషిస్తున్నది మీలోనే ఉంది. నాకు దారి తెలుసు, నేమిక్కడున్నది మీకు అడుగడుగునా సహాయం చేయడం కోసమే. మీరు అనంతం వైపుకు ఎత్తులకు ఎగుస్తూ, దానితో ఒక్కటవుతారని ఆశిస్తున్నాను. ఈ సృష్టికి మీరివ్వగలిగే శ్రేష్ఠమైన కానుక, మీ పరివర్తిత ఆత్మ మాత్రమే.
***
(ఈ చివరి అధ్యాయంలో ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యేలా సరళంగా, కర్తవ్య బోధను, ఆయన అడుగడుగునా మనకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నానన్న భరోసాను, అద్భుతమైన సందేశాన్ని వెల్లడి చేశారు. ఈ ఒక్క అధ్యాయం అందరి మనసుల్లోకి స్పాంజ్ లో నీరు ఇంకినట్లుగా, మన సాధకుల శరీరవ్యవస్థలోని అణువణువునా ఈ సందేశం పూర్తిగా ఇంకిపోవాలని, జీవిత గమ్యాన్ని సాధించాలని ఆ గురుదేవులను ప్రార్థిస్తున్నాను.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి