హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిని సహజమార్గ ధ్యాన పద్ధతి అని కూడా
అంటారు. ఇది రాజయోగ ధ్యాన పద్ధతి అంటే ఆలోచనా శక్తిని వినియోగిస్తూ ధ్యానించే పద్ధతి.
హార్ట్ఫుల్నెస్
ధ్యాన పద్ధతి యొక్క 4
ప్రధాన యౌగిక ప్రక్రియలు
1) ధ్యానానికి ముందు రిలాక్సేషన్
2) ఉదయం ధ్యానం
3) సాయంకాల శుద్ధీకరణ
4) రాత్రి పడుకొనే ముందు ప్రార్థనా-ధ్యానం
హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్
ఈ యోగ ప్రక్రియ శరీరంలోనూ, మనసులోనూ
పేరుకుపోయిన ఒత్తిడిని చాలా వరకూ తొలగించి, ధ్యానానికి సిద్ధం చేస్తుంది.
ట్రైనర్లు ఇచ్చే ఆదేశాలతో/సూచనలతో కూడిన ఈ ప్రక్రియ చాలా సరళమైనది, ఎవరైనా
దీన్ని అభ్యాసం చేయవచ్చును. వయసుతో నిమిత్తం లేదు. ఒక 7-8 నిముషాల ప్రక్రియ. శరీర
వివిధ భాగాలను పలుకరించే ప్రక్రియ. తద్వారా శరీరంలోని, మనసులోని ఒత్తిడి చాలా వరకూ
తొలగిపోయి, బరువు తగ్గినట్లు, చాలా తాజాదానం యొక్క అనుభూతిని కలిగిస్తుంది. ఆ
విధంగా ఈ ప్రక్రియ అసలు ధ్యానానికి సంసిద్ధులను జేస్తుంది.
ఉదయం ధ్యానం
ధ్యానం యొక్క ముఖ్య ప్రయోజనాలు రెండు –
1) చంచలంగా ఉండే మనసును క్రమశిక్షణలో పెట్టడం, మనసును క్రమబద్ధీకరించడం,
2) మనసుకు అతీతంగా, మనసును దాటి ఆవలనున్న ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను అనుభూతి చెందడం.
హార్ట్ఫుల్నెస్ ధ్యానం హృదయాన్ని
కేంద్రంగా తీసుకుని ధ్యానించే ప్రక్రియ. స్థిరమైన, సుఖమైన ఆసనంలో కూర్చొని,
సున్నితంగా కళ్ళు మూసుకొని, దృష్టిని
హృదయంపై ఉంచి, హృదయాంతరాళంలో ఒక దివ్య వెలుగు ఉందన్న ఆలోచనతో ఉంటూ, హృదయప్రాంతంలో,
అంటే గుండె కొట్టుకునే ప్రాంతంలో ఏమి జరుగుతున్నదీ, గమనించే ప్రయత్నం చేయడం. ధ్యానిస్తున్నప్పుడు
వచ్చే ఆలోచనలను పట్టించుకోకుండా, ధ్యాన వస్తువైన, లోపల వెలుగు ఉందన్న ఆలోచనపై దృష్టిని సారించే
ప్రయత్నం చేయాలి. ఇలా చేయగా, చేయగా కొన్ని రోజులకే మనసు క్రమబద్ధమై, మానసిక
ప్రశాంతతను, తేలికదనాన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఈ ధ్యానం యొక్క మొదటి
ప్రత్యేకత, ప్రాణాహుతితో కూడిన ధ్యానం కావడం. సూర్యోదయానికి పూర్వం ఒక అరగంట సేపు చేసుకునే ప్రక్రియ.
ప్రాణాహుతి
ప్రసరణ
ప్రాణాహుతి అనేది
మూలం నుండి వచ్చే సూక్ష్మాతిసూక్ష్మమైన
శక్తి. ప్రాణాహుతి అనే దివ్య ప్రసరణతో కూడిన
ధ్యానం అవడం వల్ల, ధ్యానించడం తేలికైపోతుంది; చంచలంగా ఉండే మనసు త్వరితంగా నియంత్రణలోకి
వచ్చే అవకాశం ఉంది. సాధకుడికి ఈ శక్తి సహాయకారిగా ఉంటుంది. అంతేకాదు, ఆధ్యాత్మిక
యాత్రలో అనేక జటిల పరిస్థితులను అధిగమించడంలో సహాయపడటమే గాక, యాత్రలో చాలా సమయాన్ని
ఆదా చేస్తుంది. ఈ ఒక్క జన్మలోనే, ఇంకా
చెప్పాలంటే అందులో కొంత భాగంలోనే యాత్ర
పూర్తయ్యే అవకాశం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి