5, ఫిబ్రవరి 2024, సోమవారం

బాబూజీ - లాలాజీ గురించి - 5

 


బాబూజీ - లాలాజీ గురించి - 5 

లాలాజీ బోధలు (కొనసాగింపు... )
మహాత్ముడికి మూడు విషయాలు అవసరమని చెప్పేవారు:
1) శాశ్వతమైన శారీరక రుగ్మత (ఇల్లత్)
2) ఆర్థిక ఇబ్బంది (కిల్లత్) 
3) విమర్శకు గురికావడం (జిల్లత్) 

మనసును సమత్వంలో ఉంచడమే నిజమైన సాధన. 

తక్కువగా తినండి, నిజాయితీగా సంపాదించండి. నిజాయితీగా సంపాదించని ఆహారం గాకపోతే, సాధారణంగా ఆధ్యాత్మిక అనుభూతులు సక్రమంగా ఉండవు. 

"చింతలకు గురవడం మంచిదే. సహనానికి, సమర్పణ భావం ఇత్యాది వాటికి శిక్షణా స్థలి, గృహస్థ ఆశ్రమం; ఇదే అత్యున్నత త్యాగము, తపస్సు కూడా." అని వ్రాసుకున్నారు ఒక చోట. 

"ఇక క్లేశాల విషయానికి, చింతల విషయానికి వస్తే, నా వంతుకు ఉండవలసినవి, నాక్కూడా ఉండేవి, బహుశా ఇతరులను చకితులను చేస్తాయేమో కూడా. ఒక్కోసారి నాకు తినడానికి ఏమీ ఉండేది కాదు. నా సంతానమే గాక నామీద ఆధారపడినవాళ్ళు ఎక్కువగానే ఉండేవారు. ఇది గాక, నేను సహాయం చేయవలసినవాళ్ళు కూడా ఉండేవారు, అది అనివార్యంగా ఉండేది.  వాళ్ళందరి బాధ్యత నా ఒక్కడిపైనే ఉండేది, వాళ్ళ అవసరాలన్నీ తీర్చి, వీళ్ళందరినీ చూసుకోవలసిన బాధ్యత నాపైనే ఉండేది. మొత్తం కుటుంబం అంతా ఒకే దుప్పటి, అది కూడా చిరుగులతో కూడిన దుప్పటినే కప్పుకునేవాళ్ళం. కానీ ఆ పరిస్థితిని కేవలం దురదృష్టంగా భావించాను; కాలక్రమేణా దానంతటదే పోయింది. ఇదంతా కూడా సత్యతత్త్వంతో పోలిస్తే తృణప్రాయంగా అనిపించేది, పెద్ద ప్రాముఖ్యత ఉండేది కాదు; భగవత్  తత్త్వంతోనే   నా ఆస్తిత్వమంతా ప్రబలంగా నిండి ఉండేది. కాబట్టి వాటిని చూసి ఒక చిరునవ్వు నవ్వుకునేవాడిని, ఇవన్నీ మోక్షానికి మార్గాలుగా భావించేవాడిని" అని మరొక చోట వ్రాసుకున్నారు.  

 కొన్ని సూత్రాలు 

భగవంతుడిని అన్వేషించేది ఆత్మ; ఆత్మచే యేది అన్వేషించబడుతున్నాడో అది పరమాత్మ

ఆత్మకున్న విచక్షణా శక్తి మేరకు మనిషి యొక్క ఆత్మ శుద్ధంగా ఉంటుంది. 
మనిషి పరిపూర్ణుడు గాకుండగా భగవత్సాక్షాత్కారం అనేది సాధ్యం కాదు. 

అభ్యాసం ద్వారా మీ మనసును శుద్ధి చేసుకోండి, అప్పుడు సాహిత్యాన్ని చదవండి; లేకపోతే సత్యపదార్థం మీకు గోచరించదు. 

ఎవ్వరికీ భగవంతుని సాక్షాత్కారం ఇంత సమయంలో జరిగిపోతుందని మాటివ్వకండి. 

భగవంతుడు ఉన్నాడా, లేదా లేక ఆత్మ ఉన్నదా లేదా, అన్న సంశయాన్ని తొలగించేసుకోవాడమే ముఖ్యం. ఈ సంశయం విముక్తులయ్యారంటే, ఇక మీకు గురువు అవసరం ఉండదు. 

భగవంతుడి కోసం, ఆత్మ కోసం అన్వేషించడం అన్నది సహజం, ఇదొక రకమైన మానసిక దౌర్బల్యం. ఈ స్వైరకల్పనను నయం చేయగలది, గురువు అనే మరో స్వైరకల్పన. 

భగవంతుని నమ్మనివాడు నాస్తికుడు కాదు. శారీరకంగానూ, మానసికంగానూ, మేధాపరంగానూ, ఆధ్యాత్మికంగానూ ఇతరులకు హాని కలిగించేవారే నాస్తికులు. 

భగవంతుడు తనను తాను మీ హృదయాలలో దాగి, మిమ్మల్ని బయట ఉంచాడు; ఇప్పుడు మిమ్మలని మీరు దాచుకొని భగవంతుడిని బయట పెట్టండి; ఇదే సాధన అంటే. 

క్లేశాలన్నీ భగవంతుడు ఇచ్చిన వరాలే. వాటిల్లో బోలెడు రహస్యాలున్నాయి; అలాగే అనేక ఆధ్యాత్మిక అనుభూతులు ఆ కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కలుగుతాయి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...