17, ఫిబ్రవరి 2024, శనివారం

శ్రీరామచంద్ర మిషన్ - సహజ మార్గ చిహ్నం

 


శ్రీరామచంద్ర మిషన్ - సహజ మార్గ చిహ్నం (ఎంబ్లెమ్)

శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థలో పైన కనిపిస్తున్న చిహ్నాన్ని అభ్యాసులందరూ ధరిస్తూ ఉంటారు. ఇది బాబూజీ ప్రవేశపెట్టిన క్రమశిక్షణ. కనీసం  మూడు ధ్యాన తరగతుల ద్వారా సహజ మార్గ సాధనలో ప్రవేశించిన వ్యక్తిని అభ్యాసి అని పిలుస్తారు. 

ఈ చిహ్నాన్ని గురించి బాబూజీ స్వయంగా తన "రియాలిటీ ఎట్ డాన్" (సత్యోదయం) అనే పుస్తకంలో వివరంగా వ్రాయడం జరిగింది. 

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేగఢ్ కు చెందిన మహా మహితాత్ముడైన  సమర్థ గురు, మహాత్మా శ్రీరామ చంద్ర జీ మహారాజ్ స్మృతిలో స్థాపింపబడిన ఈ సంస్థలో అనుసరించే ధ్యాన పద్ధతిని గురించి సంపూర్ణంగా పైన చిహ్నంలో పొందుపరచబడింది. దివ్యలోకాల నుండి పూజ్య లాలాజీ మహారాజ్, స్వామి వివేకానందలు అందించిన మార్గదర్శనంలో ఈ ఎంబ్లెం రూపొందించబడింది. ఈ సంస్థలో అనుసరించే ధ్యాన పద్ధతి పేరు సహజ మార్గం లేక సహజ పథం.

అడుగున స్వస్తిక చిహ్నం మన ఆధ్యాత్మిక యాత్ర యొక్క ప్రారంభస్థానాన్ని సూచిస్తుంది. ఇది, మనం మార్గంలో అనుసరించే  వివిధ రూపాలు, క్రతువులు, వివిధ ఆచారవ్యవహారాల దశను ఈ స్వస్తిక్ సూచిస్తుంది. హిందీలో 'సహజ మార్గ్ 'అనే అక్షరాలు, దారిలో ప్రకృతే స్వయంగా ఏర్పరచే కష్టాలు, అవరోధాలనే  పర్వతాలను  చీల్చుకుంటూ వెళ్ళే దారిని, ప్రకృతే స్వయంగా ఏర్పరచిన దారిని  సూచిస్తాయి. ఇలా వివిధ సాంద్రతలు గల వెలుగు-నీడల గుండా, పయనిస్తూ, చంద్రుడిని, సూర్యుడిని దాటుకుంటూ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మరింత సూక్ష్మ స్థితులను దాటుతూ అత్యున్నత శిఖరస్థితికి చేరుకుంటాం. ఉదయిస్తున్న సూర్యుడు వెదజల్లే వెలుగున్న ప్రదేశం సమర్థ గురు మహాత్మా శ్రీరామ చంద్రజీ ప్రారంభించిన నూతన ఆధ్యాత్మిక శకాన్ని సూచిస్తున్నది. ఈ వెలుతురు మనం సహజ మార్గంలో మన యాత్ర ప్రారంభమైనప్పటి నుండి అన్ని దశల్లోనూ అంతటా, ఆయా క్షేత్రాలపై ఆధిపత్యం వహిస్తూ ఈ వెలుగు వ్యాపించి ఉంటుంది. 

సృష్టి ఉనికిలోనికి రాక పూర్వం ఉన్నది చీకటేనని చెప్పాలి. చీకటి అంటే వెలుతురు లేదు; వెలుతురు అంటే చీకటి ఉండదు. వెలుతురు లేకపోతే ఉండేది ఏమిటి అని అంటే, చీకటి అనే చెప్తాం. మొత్తం సృష్టి అంతా మహాప్రళయంలో ముగిసిన తరువాత ఏముంటుంది? శూన్యత్వం అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ 'చీకటి', 'శూన్యత్వం' అనే పదాలు ఇంకా అందులో యేదో ఉన్నట్లుగానే తోచేలా చేస్తున్నాయి. కాబట్టి యదార్థం నుండి ఇంకా దూరంగా ఉన్నట్లే. పైన చెప్పినదాన్ని, వెలుగు లేని, చీకటి కూడా లేని స్థితి అని చెప్పడం సమంజసంగా ఉంటుందేమో. అది మార్పులేనిది, సనాతనమైనది. మన ప్రస్తుత అస్తిత్వం, అదిగో అంత పరిపూర్ణమైన, అంత స్వఛ్ఛమైన స్థితి నుండి వికాసం చెందింది. చిహ్నంలో అన్నిటికంటే పైభాగంలో ఉంది ఈ శాశ్వత శాంతి ప్రదేశం. ఇక్కడ వెలుగు కానీ చీకటి కానీ ఉండదు. ఈ స్థితిని ఓమ్ తత్ సత్ అని సూచించబడింది దాని క్రింద 'సత్య పద్' అనే ప్రదేశం ఉంది; అక్కడ సత్య పదార్థం ప్రబలంగా ఉంటుంది; కాబట్టి చాలా సూక్ష్మ స్థితిలో ఉన్నా, ఇది వెలుతురుతో నిండిన ప్రదేశం. 

బాబూజీ స్వయంగా ఈ చిహ్నాన్ని తన హృదయభాగంలో ధరించేవారు; పూజ్య చారీజీ కూడా ఈ చిహ్నాన్ని ధరించేవారు;  ప్రస్తుతం పూజ్య దాజీ కూడా అదే హృదయ స్థానంలో బ్యాడ్జీ ధరించడం గమనించవచ్చు. ఈ చిహ్నం ప్రతి అభ్యాసి ధరించడం వల్ల, అభ్యాసికి తన జీవిత గమ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, సహజ మార్గ  ఫిలాసఫీని గుర్తు చేస్తూ ఉంటుంది; నిరంతరం ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అభ్యాసి దీన్ని ఆత్మవిశ్వాసంతో, సగర్వంగా ధరించగలిగేది ఎప్పుడూ అంటే, తాను అవలంబిస్తున్న ధ్యాన పద్ధతిపైన, మార్గదర్శనం చేసే మాస్టరుపైన, ఈ ఆధ్యాత్మిక సేవలందిస్తున్న సంస్థపైన గట్టి నమ్మకం ఏర్పడినప్పుడు ఈ విధంగా ధరించగలుగుతాడు. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...