బాబూజీ సహజ మార్గ సాహిత్యం - 5 ప్రధాన గ్రంథాలు
బాబూజీ మహారాజ్ 1945 లో గురుపరంపర యొక్క దివ్య మార్గదర్శనంలో, తన గురుదేవుల పేరున, గురుదక్షిణగా, శ్రీ రామ చంద్ర మిషన్ అనే ఒక లాభాపేక్ష లేనటువంటి ఆధ్యాత్మిక సంస్థను స్థాపించటం జరిగింది. తద్వారా ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక విప్లవాత్మక సహజ మార్గ రాజయోగధ్యాన పద్ధతిని పరిచయం చేయడం జరిగింది. ఆ తరువాత ఈ పద్ధతికి సంబంధించిన అయిదు మూల గ్రంథాలను ఆవిష్కరించడం కూడా జరిగింది. క్లుప్తంగా వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనిషి భూమ్మీదకు వచ్చిన జన్మ ప్రయోజనాన్ని సాధించడం కోసం, సరైన జీవన విధానం అవలంబించగలగడం కోసం, ముఖ్యంగా ఆధునిక మానవుడి అవసరాలకు అనుగుణంగా ఉండేటువంటి జీవన విధానాన్ని, మనం జటిలంగా భావించే ఆధ్యాత్మిక మోక్షయాత్రను ఒక్క జన్మలోనే, ఇంకా చెప్పాలంటే జీవితంలోని కొంత భాగంలోనే పూర్తి చేయగలిగే విధంగా, మార్గదర్శనం చేసే క్రమంలో ఈ మూల గ్రంథాలు మానవాళికి అందించారు బాబూజీ.
అప్పటి వరకూ ఉన్న పద్ధతులకు భిన్నంగా, అనవసరమైన అంశాలన్నీ తొలగించేసి, కేవలం సారాన్ని మాత్రమే మిగల్చడం జరిగింది. వ్యర్థంగా శ్రమించకుండా, ఎంతో సమయాన్ని చేసేటువంటి సహజ మార్గ పద్ధతిని, ఈ మూల గ్రంథాల ద్వారా వెల్లడించారు.
ఈ గ్రంథాలు ఆంగ్లంలో ఈ విధంగా ఉన్నాయి:
1) రియాలిటీ ఎట్ డాన్ (సత్యోదయం) -1954
ఈ గ్రంథంలో 23 వృత్తాల ద్వారా ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వర్ణించారు బాబూజీ. అంతే కాదు, సగటు మనిషి ప్రయాణం, మతంతో ప్రారంభమై, సాక్షాత్కారం వరకూ ప్రయాణించడంలో దోహదపడే ప్రముఖమైన మజిలీలను గురించి అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. చివరి అధ్యాయంలో వారు దర్శించిన కొన్ని భవిష్యత్తులోని అనూహ్య అంశాలను వెల్లడించడం జరిగింది. వాటిల్లో కొన్ని అంశాలు ఇప్పటికే కార్యరూపం దాలచ్చాయి కూడా.
2) ఎఫికసీ ఆఫ్ రాజా యోగా ఇన్ ది లైట్ ఆఫ్ సహజ్ మార్గ్ (సహజ మార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం) -1981
ఈ పుస్తకాన్ని అధిచేతనాస్థితిలో వ్రాయడం జరిగింది. ఇందులో ఉల్లేఖించబడిన వాస్తవాలు ప్రకృతిని అధ్యయనం చేయడం ద్వారా, అంటే అనుభవ శక్తి ద్వారా తెలుసుకున్నవి. ఈ గ్రంథంలో సహజ మార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావాన్ని వెల్లడించడం జరిగింది.
హృదయ, మనో, కేంద్ర క్షేత్రాలనే వివిధ క్షేత్రాల గుండా ఆత్మ యే విధంగా ప్రయాణిస్తున్నదీ ఇందులో తెలియజేయడం జరిగింది.
3) టువార్డ్స్ ఇన్ఫినిటీ (ఆనంతుని వైపు) - 1963
ఈ గ్రంథంలో, ముందుమాటలోనే, గ్రంథకర్త ఈ గ్రంథం యొక్క ముఖ్యోద్దేశ్యము, నొక్కి చెప్పదలచుకున్నది - నిజమైన జ్ఞానం అంటే ఏమిటో స్పష్టంగా తెలియజేయడమేనని చెప్పడం జరిగింది. ప్రపంచం పరివర్తన చెండాలన్నది ప్రకృతి యొక్క సంకల్పమని, అదేమిటో అర్థం కావాలంటే నిజమైన జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోకపోతే అసాధ్యమని చెప్పారు గ్రంథకర్త.
ఈ గ్రంథ ద్వారా తెలియజేసిన 13 గ్రంథుల్లో ప్రతీ గ్రంథిలోనూ సాధకులు ప్రత్యక్షానుభవంతో లయావస్థ పొందుతూ, పుస్తకజ్ఞానం గాకుండగా నిజమైన జ్ఞానాన్ని పొందాలని కోరుతున్నారు.
బాబూజీ ఒకరకమైన ఆగత్యంతో మానవాళికి శుద్ధమైన ఆధ్యాత్మికతను అందించాలని, మానవుడు అతి త్వరితంగా సాక్షాత్కారాన్ని సాధించాలని, తద్వారా తన జన్మను సార్థకం చేసుకోవాలని కోరుతున్నారు.
4) కామెంటరీ ఆన్ టెన్ మ్యాక్సిమ్స్ (దశనియమాలపై వ్యాఖ్య ) - 1959
ఇప్పటివరకూ కేవలం మనసు నుండి మనసు ద్వారా మాత్రమే అందుకున్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను ఈ గ్రంథంలో వెల్లడి చేసే ప్రయత్నం చేశారు బాబూజీ. కానీ వీటిని నేరుగా గ్రహించడం ద్వారా, ప్రకృతిని అధ్యయనం చేయడం ద్వారా ప్రకంపనాల వల్ల తెలుసుకోగలమే తప్ప, వాటిని మాటల్లో వ్యక్తం చేయడం అస్సలు సాధ్యంకానిది.
"నిజమైన ప్రేమను మాటల్లో చెప్పలేము. ఈ పరమసత్యాన్ని ఎప్పటికీ మాటల్లో వ్యక్తం చెయ్యలేము."
5) సహజ్ మార్గ్ ఫిలాసఫీ (సహజ మార్గ దర్శనం) - 1969
ఈ గ్రంథం ఫిలాసఫీ గురించి, సహాజమార్గ చరిత్రను గురించి, సహజమార్గ ముఖ్య రూపురేఖలను గురించి, ప్రస్తావిస్తుంది. సత్యతత్త్వం యొక్క స్థిర, క్రియాశీలక అంశాలను వివరిస్తుంది. మనిషిని గురించి, అతనికి దైవంతో ఉన్న సంబంధాన్ని గురించి, ఇందులో చర్చ ఉంటుంది. సాక్షాత్కారపథాన్ని వర్ణిస్తుంది. సాక్షాత్కారపథంలోని వివిధ దశలను కూడా వర్ణిస్తుంది.
పైన ఉల్లేఖించిన గ్రంథాలన్నీ కూడా భవిష్యత్తు కోసం వ్రాశానని అంటూండేవారు బాబూజీ. 100 సంవత్సరాల తరువాత వచ్చే తరాలకు, ఈ గ్రంథాలు అర్థమవుతాయని చెబుతూండేవారు. అంతేకాదు వారి పుస్తకాలకు పునఃసమీక్షలు అవసరం లేదనేవారు. ఎందుకంటే అన్నీ పై నుండి వచ్చినవే గనుక; అధిచేతన స్థితిలో వ్రాసినవే గనుక. ఈ పుస్తకాలు పదే పదే, కనీసం సంవత్సరానికి ఒకసారైనా చదువుకోవలసిన గ్రంథాలు. ఈ గ్రంథాలను మన ఆధ్యాత్మిక ప్రగతిని ప్రతిబింబింపజేస్తాయి. వివిధ దశలలో వివిధ అర్థాలు స్ఫురింపజేస్తూ ఉంటాయి. సహజ మార్గ అభ్యాసం చేస్తూ ఈ గ్రంథాలు చదవమని చెప్తూండేవారు చారీజీ మహారాజ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి