9, ఆగస్టు 2025, శనివారం

ఆధ్యాత్మిక సాధనలో ప్రశ్నల పాత్ర, ప్రాముఖ్యత

 


ఆధ్యాత్మిక సాధనలో ప్రశ్నల పాత్ర, ప్రాముఖ్యత
 
జీవుడు భూమ్మీద పడిన తరువాత, ఊహందుకున్నప్పటి నుండి మనసులో ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉంటాడు. అందులోనూ మాటలు వచ్చినప్పటినుండి, ముఖ్యంగా పసితనంలో చుట్టూ ఉన్న పెద్దవాళ్ళను ప్రశ్నలతో ముంచెత్తి తాను ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు జీవుడు. స్పష్టమైన ప్రశ్నలు, ఆసక్తికరమైన ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఆ ప్రశ్నల్లో. దీన్నే మనం జిజ్ఞాస అంటాం. జీవుడు ఎదిగేది ఈ జిజ్ఞాసతోనే.  కొన్ని ప్రశ్నలకు సమాధానాలొస్తాయి, కొన్నిటికి రావు, కొన్ని ప్రశ్నల వల్ల అవతలి వాళ్ళు సమాధానాలు చెప్పలేక, వాళ్ళ కోపానికి గురవ్వాల్సి వస్తూ ఉంటుంది.  అప్పుడు ఆ ప్రశ్నలకు అణచివేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ సాంసారిక సమస్యలతో సతమవుతూ , వాటిల్లో చిక్కుకుపోయి సంసార సంబంధమైన ప్రశ్నలకే పరిమితమైపోతూ ఉంటాం. అసలు జిజ్ఞాస తగ్గిపోతూ ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ జిజ్ఞాస పూర్తిగా తగ్గిపోదు. ఈ జిజ్ఞాస మనిషి ప్రాణాలకు ప్రయాణం పోస్తున్నట్లనిపిస్తుంది.
 
ఇక ఆధ్యాత్మిక జిజ్ఞాసను యేదో విధంగా కాపాడుకోగలిగినవాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ జిజ్ఞాస ఈ జన్మ యొక్క సమస్యే కాదు, అన్ని జన్మల సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి దారి తీసే అవకాశం ఉంది. 

అయితే ఈ సంసారంలో ఈదుతూనే మనసులో కలిగే ఆస్తిత్వపరమైన ప్రశ్నలకు జీవుడు సమాధానాలు/పరిష్కారాలు  తనదైన రీతిలో అన్వేషిస్తూ ఉంటాడు. ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఈ అన్వేషణ, ఆధ్యాత్మిక సాధనకు దారి తీయవచ్చు. చిన్నప్పటి నుండి మనకు అలవడిన, ఈ ప్రశ్నించుకునే తత్త్వం ఇప్పుడు ఊపందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధ్యానలోలోతుల్లోకి వేడుతున్న కొద్దీ ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి, వాటికి తిరుగులేని సమాధానాలు కూడా అంతరాత్మ నుండి అందుతూ ఉంటాయి. దానితో ఆత్మ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, ధ్యానం నిగూఢ స్థితులకు చేరుకుంటూ ఉంటుంది; దీనికి అంతం ఉండదు.
 
అంతరంగంలో నుండి గాక ఈ ప్రశ్నలకు సమాధానాలు మరే మార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉంది? 
శాస్త్రాల నుండి, ఉద్గ్రంథాల నుండి, మహాత్ముల ప్రసంగాల నుండి, గురువులతో ప్రశ్నోత్తరాల నుండి మన హృదయం ప్రతిస్పందించినప్పుడు జరుగుతుంది. 

నిజమైన గురువు అసలైన ప్రశ్నలు ఎవరైనా శిష్యుడు అడుగుతాడేమోనని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడట? అటువంటి ప్రశ్నలు అడిగేవారికే గాక ఇతరులకు కూడా పరిష్కారమే ఆడు, ముక్తికి దారి తీసే ఉంటాయట. 

మరి అడిగే ప్రశ్నలు ఎలా ఉండాలి? సాధారణ నియమాలు: 
1) ప్రశ్నలు ఇతరులను బాధపెట్టేవిగా ఉండకూడదు. 
2) ప్రశ్నలు జిజ్ఞాసతో కూడినవై ఉండాలి.  
3) ఊహాజనితమైన ప్రశ్నలు వేయరాదు.  
4) అడిగే ప్రశ్నలు మన ఆధ్యాత్మిక అన్వేషణకు సంబంధించి, మన ప్రగతికి ఉపయోగపడే విధంగా ఉండేలా చూసుకోవాలి. 
5) సాధ్యమైనంత క్లుప్తంగా, సూత్రప్రాయంగా ఉండాలి. 

ప్రశ్నలు ఇతరుల ద్వారా తెలుసుకున్నా, గ్రంథాలయ ద్వారా తెలుసుకున్నా, తనం అంతఃకరణను అడిగి తెలుసుకున్నా అవి మన ధ్యాన లోతులను పెంచుతాయి. మరొక ముఖ్య విషయం ఆధ్యాత్మికతలో సమాధానాల కంటే కూడా ప్రశ్నలే చాలా ముఖ్యం, సమాధానం లేకపోయినా సరే. ఇవే మన శోధన శక్తిని పెంపొందిస్తాయి, ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళడానికి ఎంతో తోడ్పడతాయి. 

ఇక సమాధానాల విషయానికొస్తే, కొన్ని సమాధానాలు వెంటనే వస్తాయి కొన్ని శ్రమించగా శ్రమించగా వస్తాయి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వేచి ఉండవలసి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టే ప్రశ్నలున్నాయి. ఆధ్యాత్మికతలో ప్రశ్నలకు సమాధానాలు కోరేవారు తొందరపడకూడదు, అపరిమితమైన సహనాన్ని అలవరచుకోవాలి. సమాధానం కోసం వేచి ఉండటం వల్ల తపన తీవ్రమవుతుంది. 

మన శాస్త్రాలను గమనించినా కూడా మనం కనుగొనేది, భగవద్గీత, వశిష్ఠ గీత, అష్టావక్ర గీత, ఉపనిషత్తులు, వంటి శాస్త్రాలననిటిల్లోనూ కూడా గురుశిష్యుల మధ్య ప్రశ్నోత్తరాలే కనిపిస్తాయి. వీటిల్లో మనకొచ్చే ప్రశ్నలకు, మనకు రాబోయే ప్రశ్నలకు, కూడా సమాధానాలున్నాయి. "నా పుస్తకాలు ఎవరూ చదవడం లేదు, అందులో మీకు వస్తున్న ప్రశ్నలకు, రాబోయే ప్రశ్నలకు కూడా సమాధానాలున్నాయి" అని పూజ్య చారీజీ అంటూండేవారు. ప్రస్తుతం పూజ్య దాజీ అభ్యాసీలు అడిగే ప్రశ్నలకు ప్రాధాన్యతనిస్తూ దిల్ సే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

కాబట్టి ప్రశ్నల్లేకుండా ఆధ్యాత్మిక శోధన అసంభవం. శ్రేష్ఠమైన సమాధానాలు లోపలి నుండి అంతరాత్మ నుండి వచ్చేవే. వాటినే అంతర్ప్రబోధాలంటారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆధ్యాత్మిక సాధనలో ప్రశ్నల పాత్ర, ప్రాముఖ్యత

  ఆధ్యాత్మిక సాధనలో ప్రశ్నల పాత్ర, ప్రాముఖ్యత   జీవుడు భూమ్మీద పడిన తరువాత, ఊహందుకున్నప్పటి నుండి మనసులో ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉంటాడు. ...