20, ఆగస్టు 2025, బుధవారం

కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పదాలు - వాటి అర్థాలు

 


కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పదాలు - వాటి అర్థాలు 

అనంత ఆధ్యాత్మిక సాహిత్యంలో మనం తరచూ కొన్ని పదాలు చదువుతూ ఉంటాం. కొన్నిటికి అర్థాలు తెలిసినట్లనిపిస్తుంది; కొన్నిటికి అస్పష్టంగా అర్థం తెలుస్తూ ఉంటుంది; కొన్నిటికీ అర్థం తెలియక ఓయినా చదవడం కొనసాగిస్తూ ఉంటాం. ఫలితంగా మన అవగాహణలో కొరతలు ఉన్నాయని మనకే అర్థమవుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని సాధ్యమైనంత వరకూ తగ్గించుకునే ప్రయత్నంలో ప్రతీ సాధకుడూ ఉండాలి. అటువంటి కొన్ని పదాలను ఇక్కడ పరిశీలిద్దాం. 
శరీరాలు 3
స్థూల శరీరం: భౌతికంగా కనిపించే శరీరం; ఇందులో ఉన్న వివిధ అవయవాలు, ఎముకలు, మాంసము, రక్తము, నరాలు, నాడులు, చర్మము ఇత్యాదివన్నీ స్థూల శరీరంలోకి వస్తాయి.   
సూక్ష్మ శరీరం: 19 సూక్ష్మ శరీరాలు - 5 కర్మేంద్రియాలు (పాద, పాణి, పాయు (మల ద్వారం), వాక్, ఉపాస్థ(మర్మేంద్రియాలు) ) , 5 జ్ఞానేంద్రియాలు (కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం), 5 వాయువులు(ప్రాణ, అపాన, వ్యాన ఉదాన, సమాన వాయువులు), మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. వీటిల్లో ప్రధానమైనవి మనసు, బుద్ధి, అహంకార్యము, చిత్తము.  వీటన్నిటినీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు. 
కారణ శరీరం: పై మూడు శరీరాలు ఒకదానికొకటి సంబంధం గలవి. పై రెండు శరీరాలకు బీజం వంటిది కారణ శరీరం. అందుకే దీన్ని కారణ శరీరం అంటారు. స్థూల శరీరం పడిపోయిన తరువాత కొనసాగేది ఈ శరీరమే. ఇందులోనే అన్ని జన్మల సంస్కారాలు బీజరూపంలో ఉంటాయంటారు. దీన్నే కొందరు ఆత్మ అని కూడా అంటారు; మరికొందరు ఆత్మ వేరు, కారణ శరీరం వేరు అంటారు. కారణ శరీరానికి ఆవల ఆత్మ విడిగా ఉందని కొందరు నమ్ముతారు. యేది ఏమైనప్పటికీ మానవ లోకాన్ని, ఉన్నత లోకాలను అనుసంధానం చేసేది ఈ కారణ శరీరం. 
హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ కు సంబంధించినంత వరకూ సూక్ష్మ శరీరాలు ప్రధానంగా 4 - మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము (లేక చైతన్యము). 
మనసు - హృదయము 
మనసు పనే ఆలోచించడం; మనసు ఆలోచనల పుట్ట. మరి హృదయం అంటే ఏమిటి? తెలుగు భాషలో వాడుక భాషలో మనసున్న మనిషి అంటే మంచి హృదయం ఉన్న మనిషి అని అర్థం; మంచి మైండ్  ఉన్న మనిషి అని కాదు. సంస్కృతంలో మనస్ అంటే ఆలోచించే శక్తి. ఆధ్యాత్మిక సాహిత్యం చదివేటప్పుడు మనస్సు అన్నప్పుడు మనస్ (మైండ్) అనే అర్థం చేసుకోవాలి. 
మనస్ కి హృదయానికి తేడా ఏమిటి అని పూజ్య దాజీని అడిగినప్పుడు, ఆయన, మనస్, హృదయము  ఒకే వస్తువుకున్న  రెండు కొనలు వంటివి అని చెప్పడం జరిగింది. 
మనసు - బుద్ధి 
మనసు ఆలోచిస్తుంది; ఆలోచించే శక్తి. బుద్ధి ఆలోచనల్లోని మంచి-చెడు విచక్షణ చేసి నిర్ణయాలు తీసుకునే శక్తి. 
బుద్ధి - అహం 
బుద్ధి నిర్ణయం తీసుకుంటే, అమలు చేసేది అహం. కాబట్టి అహం మనిషికి అవసరం. 
అహం -అస్మిత 
అహం తగినంత మోతాదులో ఉంటే దాన్ని అస్మిత అంటారు. అంటే మనిషికి ఉన్నతికి ఉపయోగకరమైన శక్తి. మనిషి మనుగడకు అవసరమైనది.  మోతాదు మించినప్పుడు అది అహంకారంగా మారుతుంది. మనిషికి అవరోధమవుతుంది. మోతాదుకు మించి మరీ ఎక్కువైనప్పుడు దురహంకారం అవుతుంది. దురహంకారం ఆత్మవినాశనానికి దారి తీస్తుంది. 
చిత్తము, చిత్ లేక చైతన్యము 
చిత్తము లేక చిత్ సరోవరం ఆజ్ఞా చక్రానికి వెనుక ఒక అంగుళం లోతులో ఉందని పూజ్య దాజీ చెప్పడం జరిగింది. ఇక్కడే నుండే ఆలోచనల ప్రవాహం హృదయం వైపు ప్రవహిస్తాయి. ఇక్కడే సంస్కారాల బీజాలు కూడా ఉండేది. చిత్ అంటే చైతన్యం కూడా. ఇందులోనే మనస్, బుద్ధి, అహం అనే సూక్ష్మ శరీరాలు ఇమిడి ఉన్నాయి. అందుకే మనస్, బుద్ధి, అహంకారాలు శుద్ధి జరిగినప్పుడు చైతన్య శుద్ధి కూడా జరిగి, మనిషిలో సమూల మార్పులు రావడం ప్రారంభిస్తాయి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...