సంపూర్ణ శరణాగతి
*
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ||
*
ఆ పరమాత్మలో సంపూర్ణ లయం కావాలనుకునే ఆధ్యాత్మిక సాధకులకు, భక్తులకు వర్తించే పదం, ఈ శరణాగతి అనే పదం. ఎందుకంటే భాగ్యవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందాలంటే ఇదే అతి దగ్గర మార్గం. కానీ నిజానికి ఇది ప్రతి ఒక్కరికీ అవసరమైన పదం.
శరణాగతి అనగానే యేదో ఒక ఓడిపోయిన సన్నివేశంగా, అదొక బలహీనత అన్నట్లుగా, మనలో ఉన్న అహంకారానికి దెబ్బలా మొదట్లో అందరికీ తోస్తుంది. కానీ యదార్థం అది కాదు.
భగవంతుని మహత్తును యదార్థంగా గుర్తించడం, ఆయన సమక్షంలో మన యదార్థ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఆ స్పృహతో జీవితం కొనసాగించడం శరణాగతి అంటే.
అయితే శరణాగతి అనే ఆధ్యాత్మిక స్థితి సముచిత సమయంలో సంభవిస్తుంది తప్ప, ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఎందుకంటే ఇడి అహం లేని స్థితి కాబట్టి.
అయితే కొన్ని సాధనలు శరణాగతి దిశగా జీవితం కొనసాగేలా చేయవచ్చు. కానీ నిజమైన శరణాగతి ఆ భగవంతుని లేక ఆ గురువు అనుగ్రహం వల్లనే సంభవిస్తుందంటారు. వాటిల్లో కొన్ని - 1) భగవంతుడు ఆమోదించినవి (అనుకూలించేవి) స్వీకరించడం, అనుకూలించనివాటిని నిరాకరించడం 2) ఆయన సంరక్షణను నమ్మడం, ఆయన కాపాడుతున్నాడన్న నమ్మకం కలిగి ఉండటం, 3) వినమ్రంగా ఉండటం, ఆత్మ సపర్మాణ కలిగి ఉండటం.
పైన చెప్పినవి కొంత వరకూ జటిలంగా ఆచరణకు దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. పూజ్య బాబూజీ దీన్ని మనకు సులభం చేసేశారు. శరణాగతి భగవంతునిపై అన్నిటికీ ఆధారపడటంతో ప్రారంభమవుతుందన్నారు. ఇది ఆచరణకు చాలా తేలిక.
పూజ్య లాలాజీ మనం అదృశ్యమయితేనే మనలో ఉన్న భగవంతుడు విరాట రూపం ధరిస్తాడు, అంటే బహిర్గతమవుతాడంటారు. ఇలా ధ్యానం ద్వారా అదృశ్యమవడమే శరణాగతి అంటే.
శరణాగతి వల్ల సిద్ధించే ఫలాలు - భయం నుండి సంపూర్ణ విముక్తి, సంస్కార భారం తొలగిపోవడం, అహం కరిగిపోవడం వల్ల అంతరంగ ప్రశాంతత, వినమ్రత, భక్తిరస ప్రాప్తి, భగవంతుని సాయుజ్యం లేక సంపూర్ణ లయం.
*
పైన చిత్రం: పూజ్య బాబూజీ, సంపూర్ణ శరణాగతి భావంతో ధ్యాన భంగిమలో ఉన్నట్లుగా తోస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి