జిజ్ఞాస - తపన
*
जिज्ञासा ज्ञानहेतुः स्यात् मोक्षमार्गप्रवर्तिका ।
జిజ్ఞాస జ్ఞానహేతు: స్యాత్ మోక్షమార్గప్రవర్తికా |
(అర్థం: జ్ఞానానికి కారణం జిజ్ఞాస. సాధకుడిని మోక్షమార్గంలో స్థిరపరచేది ఈ జిజ్ఞాస.)
*
జిజ్ఞాస అంటే తెలుసుకోవడం కోసం తపించడం; జ్ఞానం కోసం పరితపించడం. ఈ జిజ్ఞాస దేనికోసమైనా కావచ్చు. జిజ్ఞాస ప్రధానంగా రెండు రకాలు - లౌకిక జిజ్ఞాస, ఆధ్యాత్మిక జిజ్ఞాస.
లౌకిక విషయాల కోసం తపించడం లౌకిక జిజ్ఞాస అవుతుంది. పరమసత్యాన్ని తెలుసుకోవాలన్న తపనను ఆధ్యాత్మిక జిజ్ఞాస అంటారు. దీన్నే బ్రహ్మ జిజ్ఞాస అని కూడా అంటారు, నామరూపగుణరహితమైన పరమసత్యాన్ని తెలుసుకోవడం కోసం పరితపించడం.
మనం ప్రస్తుతం చర్చించుకుంటున్నది ఆధ్యాత్మిక జిజ్ఞాసను గురించి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అనికూడా అంటాం. మనిషి తనను గురించి, తన చుట్టూ ఉన్న సృష్టిని గురించి, సృష్టికి మూల కారణమైనదాన్ని గురించి, స్వతః సిద్ధంగా తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటాడు. మనిషి మనుగడకు, తన ఆధ్యాత్మిక పరిణతికి ఈ తపనే ఇంధనంలా పని చేస్తూ ఉంటుంది. ఇది ఆత్మలో స్వతఃసిద్ధంగా ఉంది. తప్పించుకోలేనిది. ఈ తపన యొక్క గమ్యం ఆ పరమసత్యాన్ని కనుగొనడమే, ఆ జ్ఞానానుభూతి కలగడమే; అప్పుడే ఆత్మకు సంతుష్టి కలిగేది. ఈ ఆధ్యాత్మిక ఆకలి ఎంత తీవ్రంగా ఉంటే, గమ్యం అంత చేరువవుతుంది.
బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన లక్షణాలు - 1)వివేకం, 2)వైరాగ్యం, 3)షట్ సంపత్తి (శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధాన) అనే 6 లక్షణాలు, ముముక్షుత్వం (మోక్షం కోసం తీవ్ర తపన). ఇవేవీ లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక యాత్ర, నిజమైన జిజ్ఞాస గాకుండగా, కేవలం కృత్రిమమైన పైపైకి మాత్రమే ఉన్న కుతూహలంగా మిగిలిపోతుంది. కుతూహలం అంటే తేలికగా ఉండేది, దృష్టి తేలికగా మరలే తత్త్వం. జిజ్ఞాస అంటే లోతైనది, అస్తిత్వానికి సంబంధించినది, పరివార్తనతో కూడినది.
జిజ్ఞాస అభివ్యక్తమయ్యే విధానాలు:
శ్రవణం, మననం, నిధిధ్యాసనం, గురువును సరైన ప్రశ్నలను అడగటం, అత్యున్నత సాక్షాత్కారం కోసం సరళమైన, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని కొనసాగించడం.
ఆవిద్యకు, విద్యకు వారధి జిజ్ఞాస. కాబట్టి దీన్ని పెంపొందించుకునే పనిలో ప్రతి సాధకుడు, నిరంతరం నిమగ్నమై ఉండాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి