8, మే 2024, బుధవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు - పంచ కోశాలు

 


స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు - పంచ కోశాలు 

యోగశాస్త్రం ప్రకారం, మానవ శరీర వ్యవస్థలో మూడు శరీరాలున్నాయి - స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము.
 
పంచ కోశాలున్నాయి: అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని అయిదు కోశాలున్నాయి. 

స్థూల శరీరము అంటే ఈ కనిపించే శరీరము, చర్మము, మాంసము, రక్తము, ఎముకలు, వివిధ అవయవాలతో కూడుకున్నది. పంచ కోశాలలో అన్నమయ కోశం ఈ స్థూల శరీరానికి సంబంధించినది. ఆకలిదప్పికల వల్ల లోపలికి తీసుకునే ఆహారం వల్ల ఏర్పడిన శరీరం, ఈ కోశము. 

సూక్ష్మ శరీరం అంటే కనిపించని శరీరం. ఇందులో పంచ కర్మేంద్రియాలు(కాళ్ళు, చేతులు, ముక్కు, వాక్కు, ఉపస్థ), పంచ జ్ఞానేంద్రియాలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ), పంచ ప్రాణ వాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానస)  మనస్, బుద్ధి, అహం, చిత్తం  అని 19 సూక్ష్మ శరీరాలున్నాయి. ఈ సూక్ష్మ శరీరంలో మూడు కోశాలున్నాయి - ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన చక్రాలు కూడా ఇక్కడే ఉంటాయి. 

కారణ శరీరం అంటే ఇంకా సూక్ష్మంగా ఉండే శరీరం. దీనికి సంబంధించిన కోశం ఆనందమయ కోశం. కారణ శరీరాన్నే ఆత్మ అని కూడా అంటారు. కారణ శరీరం లేనిదే తక్కిన రెండు శరీరాలకు అస్తిత్వం లేదు. సంస్కారాలు ఇక్కడే బీజరూపంలో ఉంటాయి. చేతనకు లేక మానవ చైతన్యం యొక్క నివాస స్థానం కూడా ఇదే. సుషుప్తిలో (గాఢ నిద్రావస్థలో) దీని అనుభూతి కలుగుతూ ఉంటుంది మనిషికి. అహంలేని స్థితి; అందుకే దీన్ని ఆనందమయ కోశం అని కూడా అంటారు. 

ఆత్మ అభివ్యక్తమయ్యేది స్థూల సూక్ష్మ శరీరాల మాధ్యమం ద్వారానే. ఈ మూడింటినీ శరీరాలే అంటారు కాబట్టి వీటికి అతీతంగా, వీటిని దాటి ఉండేదే పరమాత్మ లేక భగవంతుడు. 

ధ్యానం ద్వారా ఈ మూడు శరీరాల మధ్య గణనీయమైన దూరాన్ని అనుభూతి చెందుతామని పూజ్య దాజీ సూచించారు. ఈ మూడు శరీరాలూ సామరస్యంలో ఉండటం చాలా అవసరం. దానికి హార్ట్ఫుల్నెస్ ధ్యాన యోగపద్ధతి చాలా దోహదం చేస్తుంది. కారణ శరీరంలో ఉన్న సంస్కారాలన్నీ తొలిగే వరకూ, అహం పూర్తిగా కనుమరుగయ్యే వరకూ, కోరికలు లేని స్థితి ఏర్పడే వరకూ జీవుడు భగవంతునితో సంపూర్ణ ఐక్యం పొందడం జరుగదు. 

అన్ని యోగ పద్ధతుల పరమ లక్ష్యం ఇదే. 


1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...