21, మే 2024, మంగళవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 20 - సహజమార్గ యాత్ర - యోగము

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 20 
సహజమార్గ యాత్ర - యోగము 

యోగానికి అనేక నిర్వచనాలు మన శాస్త్రాలలో కనిపిస్తాయి. యోగ అంటే సరళమైన అర్థం కలయిక. ఆత్మ పరమాత్మలో   ఐక్యమవడం; వ్యక్తిగత చైతన్యం విశ్వ చైతన్యంలో లయమవడం ఇలా. కొన్ని నిర్వచనాలను పరికిద్దాం:
యుజ్యతే ఇతి యోగః 
యోగః చిత్త వృత్తి నిరోధః 
యోగః కర్మసు కౌశలం 
యోగ్యస్థః కురు కర్మాణి 

1)     యోగం అంటే ఏమిటి?

    యుజ్యతే ఇతి యోగః – కలయికే యోగం అంటే. రెండుగా ఉన్నవి ఒక్కటిగా మారిపోవడం; నీటి చుక్క సముద్రంలో కలిసినప్పుడు సముద్రంగా మారిపోవడం. ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడు పరమాత్మగా మారిపోవడం.

2)    ఈ యోగాన్ని సాధించడం ఎలా?

    యోగః చిత్తవృత్తి నిరోధః – చిత్తంలోని అనేక రకాల వృత్తులను, అనేక రకాల తత్త్వాలను నిరోధించడమే యోగం. చిత్తం అంటే చైతన్యం; చైతన్యం అనేది ప్రధాన నాలుగు సూక్ష్మశరీరాల్లో ఒకటి; కాని ఇందులోనే మనసు, బుద్ధి, అహంకారం అనే మూడు ఇతర సూక్ష్మశరీరాలుంటాయి. వీటన్నిటినీ శుద్ధి చేస్తే చిత్తశుద్ధి తనంతతానుగా జరుగుతుంది.

3)    యోగం సాధిస్తే ఏమిటి ప్రయోజనం?

    యోగః కర్మసు కౌశలం – యోగసాధన వల్ల మనం చేసే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది, కుశలత పెరుగుతుంది, పనితనం పెరుగుతుంది. పనితనం పెరగడం వల్ల అమోఘమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది; చేసిన పని సార్థకమవుతుంది; జీవితమే సార్థకమవుతుంది.

4)    మనం చేసే పనులు ఏ విధంగా చెయ్యాలి?

    యోగస్థః కురు కర్మాణి – యోగసాధన వల్ల కలిగిన యోగస్థితిలో ఉంటూ కర్మలు చేసినప్పుడు సంస్కారాలు/వాసనలు అంటవు. ఏ పనీ మోహంతో చేయడం ఉండదు. యోగస్థితి మనిషికి కనిపించని కవచంలా  పని చేస్తుంది; ఈ విధంగా జీవితం కొనసాగినప్పుడు, జన్మరాహిత్యం లేక మోక్షం అనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితి, ఆ తరువాత ఆత్మసాక్షాత్కారం అనే అత్యున్నత ఆద్యాత్మిక స్థితి అనుభవంలోకి వస్తాయి.

కాబట్టి యోగసాధన ప్రతి ఒక్కరికీ అనివార్యము. భూమిపై శ్రేష్ఠమైన విధంగా జీవించే జీవన విధానం ఈ యోగవిద్య మనకు నేర్పిస్తుంది. మనిషి మరింత మరింత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదిగే ఏకైక మార్గం యోగం. హార్ట్ ఫుల్ నెస్ యోగ విధానం అనేది ఇటువంటి యోగవిద్యను ఆధునిక మానవుని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యోగవిద్యనందించే రాజయోగ విధానం. అందరూ ప్రయత్నింతురుగాక!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...