బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 24
సహజమార్గ యాత్ర - సాంప్రదాయపరంగా వివరించే యాత్ర
సనాతన ఆధ్యాత్మిక వాజ్ఞ్మయం ప్రకారం మనిషి యాత్రలో 'షట్' చక్రాలు దాటవలసి ఉంటుంది. సంస్కృతంలో నిజానికి షట్ అంటే 6 చక్రాలు. కొన్ని సాంప్రదాయాలు ఏడవదైన సహస్రారం అనేది చక్రం కాదంటారు. మరికొన్ని సాంప్రదాయాలు 7 చక్రాలని చెప్తారు. సహస్రారం అనేది యాత్ర యొక్క గమ్యస్థానంగా చేపట్టారు. ఇక్కడికి చేరుకున్న తరువాత సాధకుడు భగవంతుని తత్త్వమైన సత్-చిత-ఆనంద్ స్థితిని అనుభూతి చెందుతాడని, అక్కడితో మన యాత్ర ముగుస్తుందని చెప్తూంటారు.
పైన చిత్రంలో చూపించిన విధంగా 7 చక్రాలు, వాటి స్థానాలు గమనించవచ్చు. మొదటి 3 చక్రాలు - మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర చక్రాలు జంతువుల్లోనూ, మనుషుల్లోనూ సమానంగా ఉంటాయట. ఈ మూడు చక్రాల్లో స్థితమై ఉన్నవారు మౌలిక అవసరాలే పరమావధిగా భావిస్తూ జీవితం వెచ్చిస్తూ ఉంటారు. అనాహత చక్రం లేక హృదయ చక్రం నుండి సాధకుడి అసలు యాత్ర ప్రారంభమవుతుంది.
ఒక్కొక్క చక్రంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక్కొక్క రకమైన చేతనం ఉంటుంది; ఆయా చక్రాలకు సంబంధించిన సిద్ధులు కూడా కలుగుతూ ఉంటాయి. గురువు లేకుండా యాత్ర కొనసాగించినప్పుడు ఈ సిద్ధుల్లో ఇరుక్కుపోయి, అదే పరమ లక్ష్యం అని భావించి యాత్ర ముందుకు సాగకపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గురువు లేకుండా ఈ యాత్ర అసాధ్యం.
సహజ మార్గ పథంలో ఆ ప్రమాదం లేదు, ఎందుకంటే ఇక్కడ సాధకుడిని సిద్ధుల్లో ఇరుక్కుపోకుండా అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. అందుకే దాజీ సిద్ధులు కావాలనుకుంటే సహజ మార్గం మీకు కాదని స్పష్టంగా చెప్పారు. సహజ మార్గ పథంలో యాత్ర హృదయ చక్రం లేక అనాహత చక్రం నుండి ప్రారంభమవుతుంది. అంటే అనాహత చక్రం వరకూ ప్రయాణించినవారు సహజ మార్గానికి ఆకర్షితులవుతారు. ఈ పథంలో అనాహత చక్రాన్ని నాలుగు చక్రాలుగా చెప్తారు - 1, 2, 3, 4 బిందువులు ఇందులో ఉంటాయి. 5 వది విశుద్ధ చక్రం. ఈ 5 బిందువులు కలిపి హృదయ క్షేత్రం అంటారు. ఇది ద్వంద్వాల ప్రపంచం; సాధకుడు ద్వంద్వాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, ఈ క్షేత్రాన్ని దాటే వరకూ మోక్షం సిద్ధించదు. అన్నిటి కంటే కష్టతరమైన యాత్ర ఈ క్షేత్రంలోనే జరుగుతుంది; ఇక్కడ గురువుపై ఆధారపడటం చాలా అవసరం. ఇక్కడే కాదు, ప్రారంభించినప్పటి నుండి చిట్టచివరి గమ్యస్థానం వరకూ గురువుపై ఆధారపడటం తప్పదు. సూక్ష్మ స్థితుల్లోకి వెళ్ళినకొద్దీ గురువు సహాయం పెరుగుతూ ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి