16, మే 2024, గురువారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 13 - సంస్కారాలు

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 13 
సంస్కారాలు 

సాక్షాత్తు భగవంతుడు హృదయంలో నివాసం ఉంటూ కూడా మనిషి ఆయన ఉనికితో సంబంధం లేకుండా బ్రతకడం చాలా విడ్డూరం, చాలా విషాదాకారం. దాజీ చెప్పినట్లు, ఒక నూనె చుక్క సముద్రంలో పడినా, సముద్రంతో యే సమబంధమూ లేకుండా ఉన్నట్లు, మనం కూడా అంతర్యామితో యే సంబంధమూ లేనట్లుగా జీవిస్తున్నాం. 

అంతర్యామిగా ఉన్న దైవానికి మన అహానికి మధ్య అవరోధాలుగా నిలిచేవి అంటే భగవత్సాక్షాత్కారానికి, అడ్డుగా ఉండేవి మూడు -  కోరికలు, సంస్కారాలు, అహం. 

ప్రస్తుతం మనం సంస్కారాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  సంస్కారాలను భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో వాసనలని, కర్మలని కూడా అంటారు. సహజ మార్గ సాహిత్యంలో జటిల తత్వాలు/మలినాలు అని అంటారు. 

మామూలుగా వాడుక భాషలో "సంస్కారం లేదా?" అని అంటూంటారు. ఇక్కడ సంస్కారం అంటే అర్థం మంచి అలవాట్లు, మంచి సంస్కృతి అని అర్థం. కానీ ఆధ్యాత్మిక సాహిత్యంలో, ముఖ్యంగా సహజ మార్గ సాహిత్యంలో సంస్కారాలంటే కర్మలు, వాసనలు, జటిల తత్త్వాలు/మలినాలు. 

అసలు ఈ సంస్కారాలంటే ఏమిటి? 
మనిషి ప్రతి నిత్యం ప్రపంచంతో వ్యవహరించేప్పుడు, చేసే పనుల వల్ల, ఆలోచనల వల్ల మనసులో ముద్రలు ఏర్పడతాయి. పదే పదే అవే ముద్రలు నిత్యం ఏర్పడటంతో, అవి గాఢమైన ముద్రలుగా ప్రవృత్తులుగా లేక సంస్కారాలుగా  మారి అవి మనిషి జీవితాలను శాసించడం ప్రారంభిస్తాయి. 
అందుకే సహజ మార్గ శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ముద్రల స్థాయిలోనే, ఇవి సంస్కారాలుగా ఏర్పడకుండానే యే రోజుకారోజు శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా హృదయ భారం తగ్గుతూ ఉండి తేలికదనాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. గాఢ ముద్రలను లేక సంస్కారాలు ప్రశిక్షకుల ద్వారా గాని, మాస్టర్ ద్వారా గాని తీసుకునే ధ్యాన సిట్టింగుల్లో శుభ్రం చేయడం జరుగుతుంది. అందుకే ప్రతీ అభ్యాసి, వారానికి కనీసం ఒక సిట్టింగ్ ప్రశిక్షకునితో చాలా ముఖ్యం. జీవన లక్ష్యం ఇంచుమించు సంస్కార రహితంగా తయారవడం. 

అసలు ముద్రలు ఎందుకు ఏర్పడతాయి?
ప్రతీ పని, ప్రతీ ఆలోచన, 'నేను చేస్తున్నాను' లేక 'నాది' అనే స్పృహతో చేయడం వల్ల ముద్రలేర్పడతాయి. 'ఆయన చేస్తున్నారు' అనే స్పృహతో పనులు నిర్వర్తించినప్పుడు ఈ ముద్రలేర్పడటం ఆగిపోతాయి. ఇది నిరంతర స్మరణలో ఉండటం వల్ల సాధ్యపడుతుంది. నిరంతర స్మరణ సహజంగా ఏర్పడే వరకూ అభ్యాసం కొనసాగించవలసి ఉంటుంది.
 
మనం ఏర్పరచుకునే సంస్కారాలు ప్రధానంగా నాలుగు రకాలు 
ప్రపంచంతో నిత్య వ్యవహారాలలో మనం ఏర్పరచుకునే సంస్కారాలు నాలుగు రకాలు - రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), ఇంద్రియపరమైన వాంఛలు, ప్రాపంచిక చింతలు, అపరాధ భావాలు. 
శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా, ధ్యాన సిట్టింగుల ద్వారా, సామూహిక ధ్యానాల ద్వారా, అపరాధ భావాలకు సంబంధించిన ముద్రలు తప్ప అన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. అపరాధ భావాలు మాత్రం యేరోజుకారోజు రాత్రి ప్రార్థనా-ధ్యానం ద్వారా, పశ్చాత్తాపం చెంది, తిరిగి చేసిన పొరపాట్లు చేయబోనని తీర్మానం చేసుకోవడం ద్వారా వీటి ప్రక్షాళనం జరుగుతుంది. 

1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...