బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 1
బాబూజీ, తన గురుదేవులైన, శ్రీ రామ చంద్ర మిషన్ ఆదిగురువులైన సమర్థగురు పూజ్య లాలాజీ మహారాజ్ ఆధ్యాత్మిక మార్గదర్శనంలో మానవాళి ఉద్ధరణకు ఆవిష్కరించి, అందించిన, సరళమైన, ఆధునిక మానవుడి అవసరాలకు తగ్గట్టుగా రూపొందించినటువంటి సహజమార్గ రాజయోగ ధ్యాన పద్ధతిని, సహజమార్గ జీవన విధానాన్ని, క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇది ఒక విప్లవాత్మకమైన ఆధ్యాత్మిక ఆధునిక అవసరాలకు మలచినటువంటి విశిష్ఠ రాజయోగ ధ్యాన పద్ధతి.
రాజయోగ పద్ధతి అంటే ఏమిటి?
మానవ శరీర వ్యవస్థలో రాజు లాంటిది ఆలోచన లేక మనసు. ఆలోచన లేకపోతే మనిషికి ఆస్తిత్వమే లేదు. మనిషి వికాసానికైనా, పతనానికైనా కారణం మనసే. ఆ రాజులాంటి మనసుతో యోగాన్ని సాధించే విధానమే రాజయోగవిధానం.
అసలు యోగం అంటే ఏమిటి?
యోగం అంటే కలయిక. అపరిపూర్ణమైన ఆత్మ, పరిపూర్ణ తత్త్వమైన పరమాత్మలో కలవడమే యోగం. ప్రతీ ఆత్మ పరితపిస్తున్నది దీని కోసమే. అప్పటి వరకూ ఆత్మకు నిజమైన శాంతి లభించదు.
వివిధ రకాల యోగాలు
ఆత్మ పరమాత్మలో లయమయ్యే యోగ విధానాలు ప్రముఖంగా మనిషిలో స్వాభావికంగా ఉండే మనస్తత్త్వాన్ని బట్టి ఉన్నాయి - కర్మ యోగము (కర్మ ద్వారా సాధించేది), జ్ఞాన యోగము (ఆత్మ-అనాత్మ విచక్షణతో జ్ఞానం ద్వారా సాధించేది), భక్తి యోగము (భక్తి ప్రపత్తులతో, ప్రేమతో, శరణాగతితో సాధించేది), రాజయోగము (రాజులాంటి మనసు ద్వారా సాధించేది), ఇలా నాలుగున్నాయి.
సహజ మార్గ పద్ధతి యొక్క విశిష్టత
యే వ్యక్తీ కూడా కేవలం ఒక్క యోగ పద్ధతిని అనుసరించడమే జరగదు. ఎక్కువ పాళ్ళు యే యోగాన్ని అనుసరిస్తే, ఆ వ్యక్తిని ఆ యోగి అని పిలుస్తారు. ఉదాహరణకు, వ్యక్తి కర్మ ద్వారా సాధించాలనుకున్నప్పుడు కర్మ యొక్క పాళ్ళు ఎక్కువ ఉంటాయన్నమాట. మిగిలిన రాజా, భక్తి, జ్ఞాన యోగాలు ఉండవని కాదు.
కాని సహజ మార్గ రాజయోగ ధ్యాన పద్ధతి, కర్మ, భక్తి, జ్ఞాన యోగముల చక్కటి మిశ్రమం. ఇదే సహజ మార్గ విశిష్ఠత.
అభ్యాసి అంటే ఎవరు?
ఈ సాధన ప్రారంభించిన వ్యక్తిని అభ్యాసి అంటారు. అభ్యాసం చేసేవాడు అభ్యాసి.
ఆహా !
రిప్లయితొలగించండి