10, మే 2024, శుక్రవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 3 - ధ్యానం

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము  - 3

ధ్యానం 
యే ధ్యానానికైనా 3 ప్రధాన ప్రయోజనాలుండాలి :
1) చంచలంగా ఉండే మనసును క్రమశిక్షణలో పెట్టడం లేక మనసును క్రమబద్ధీకరించడం. 
2) మనసును దాటి అతీతంగా ముందుకు సాగడం.  
3) మనసు ధ్యానస్థితిలో రోజంతా కొనసాగగలగడం. 
ధ్యాన అభ్యాసం చేయగా చేయగా మనసు యొక్క లక్షణం, నాణ్యత ధ్యానస్థితిలో ఉండటం మూలాన సమూలంగా మారుతుంది.   
ధ్యానం వల్ల చేతన యొక్క 360 డిగ్రీల విస్తరణ జరుగుతుంది. చేతనలోని అసంఖ్యాక పొరల్లో, ఒక పొర నుండి మరొక పొరకు ప్రయాణం కొనసాగుతుంది. అందుకే మనిషిలో కొంచెం-కొంచెంగా అంతరంగంలో సూక్ష్మస్థాయిలో మార్పులు సంభవిస్తాయి. ధ్యానం తరువాత చేసిన ప్రతీసారి మానసిక ప్రశాంతత కలుగుతుంది, మనసు తేలికదనాన్ని, ఒక విధమైన తాజాదనాన్నిఅనుభూతి చెందుతుంది. 

ధ్యానం అంటే ఏమిటి?
ధ్యానం అంటే ధ్యాన వస్తువుపై దృష్టిని తదేకంగా సారించడం.  
సహజ మార్గంలో ధ్యాన వస్తువు, హృదయాంతరాళంలో, దివ్య వెలుగుకే మూలమైనది ఉందన్న భావన. ఇక్కడ వెలుగు అంటే వెలుతురు లేని వెలుగు. కేవలం ఒక భావన మాత్రమే. ఈ భావనపై కొంత సేపు దృష్టిని సారించే ప్రయత్నమే ధ్యానం. 
ఇలా దృష్టిని సారిస్తూ హృదయ ప్రాంతంలో, అంటే గుండె కొట్టుకుంటూ ఉండే ప్రదేశంలో ఏం జరుగుతోందో ఒక సాక్షి భావంతో గమనించే ప్రయత్నం చేయాలి. 

ధ్యానానికి, ఏకాగ్రతకూ తేడా ఏమిటి?
ఏకాగ్రత వల్ల తెలుసుకోవాలన్న వస్తువు యొక్క స్వభావం వెల్లడవుతుంది. ఏకాగ్రత ఒక జడమైన వస్తువుపై దృష్టిని కేంద్రీకరించడం. దివ్యవెలుగు అనేది ఒక జడమైన వస్తువు కాదు కాబట్టి, సూక్ష్మాతి సూక్ష్మమైనది కాబట్టి, దానిపై ఏకాగ్రత సాధ్యపడదు; దృష్టిని సారించడం తప్ప. పిల్లి ఎలుకను పట్టుకోడానికి పూర్వం ఏకాగ్ర చిత్తంతో ఉంటుందో అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ధ్యానిస్తే ఏకాగ్రత వస్తుంది. ధ్యానిస్తే కలిగే అనేక ప్రయోజనాల్లో ఏకాగ్రత ఒకటి. 

ధ్యానిస్తూండగా ఆలోచనలు వస్తే ఏం చేయాలి?
పూజ్య బాబూజీ ధ్యానిస్తూండగా ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పిలవకుండా వచ్చిన అతిథులతో వ్యవహరించినట్లు వ్యవహరించమంటారు. అప్పుడు వాటంతట అవే ఎండుటాకుల్లా రాలిపోతాయంటారు. ఆలోచనలకు స్వతహాగా యే బలమూ ఉండదనీ, వాటిపై మన దృష్టి పెట్టడం వల్లే వాటికి బలం వస్తుందని, వాటిని పట్టించుకోకుండా ఉంటే అవే రాలిపోతాయంటారు బాబూజీ. ఆలోచనలతో పోరాడరాడు, ఆపే ప్రయత్నం కూడా చేయకూడదు. కేవలం పట్టించుకోకుండా ఉంటే చాలు. ఆలోచనలు వచ్చేది బయటకు వెళ్ళిపోవడానికే. మనలో ఉండే సంస్కారాలే ఆలోచనల రూపంలో బయటకు వస్తూంటాయంటారు బాబూజీ. ధ్యానం వల్ల అవి బయటకి వెళ్లిపోవడానికి ఒక గొప్ప అవకాశం. అవి ఎన్ని బయటకు వెళ్లిపోతే, హృదయం అంత తేలికగా ఉంటుంది. ఇది అభ్యాసం చేయగా చేయగా తెలుస్తుంది. సక్రమంగా అభ్యాసం చేసినట్లయితే కేవలం మూడు నెలలలోనే ఇంచుమించు ఆలోచనల్లేని స్థితిని అనుభూతి చెందడం జరుగుతుందంటారు బాబూజీ. 
సహజ మార్గ ధ్యానం ఎప్పుడు చేయాలి?
ధ్యానం సాధ్యమైనంత వరకూ ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో, ఒకే ఆశనంలో కూర్చొని చేసుకోవడం మంచది. నేల మీద కూర్చోగాలిగేవారు సుఖాసనంలో కూర్చొని చేసుకోవచ్చు. మిగిలినవారు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకూ సూర్యోదయానికి పూర్వమే ధ్యానం పూర్తి చేసుకోవడం మంచిది. సమయం ఉంటే రోజులో ఎన్ని మారలైనా ధ్యానం చేసుకోవచ్చును. గంటసేపూకు మించకుండా చేసుకోవాలి. సమయం ఎక్కువగా ఉంటే ఒక 10 నిముషాలు విరామం ఇచ్చి మరో గంట సేపు చేసుకోవచ్చు. కనీసం 15 నిముషాలతో ప్రారంభిస్టే మంచది. అది కూడా చేయలేనివారు, పూజ్య దాజీ 5 నిముషాలతోనైనా ప్రారంభించమంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...