అవసరాలు - కోరికలు
మనిషి జీవితంలో అవసరాలు, కోరికలు అని రెండుంటాయి. అవసరాలు మనిషి ఉనికికి, బ్రతకడానికి అవసరమైనవి. అంటే కూడు, గుడ్డ, నీడ అని అంటాం మనం. ఇవి భూమ్మీద బ్రతకడానికి చాలా మౌలికమైనవి. అవసరాల కోసం తగిన కృషి చేయడం తప్పకుండా అవసరం.
అవసరానికి మించినవన్నీకోరికలే. వీటికి అంతు అంటూ యేమీ ఉండదు. కోరికలు నెరవేర్చుకుంటున్న కొద్దీ కొత్త-కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అందుకే మనిషికి ఎప్పుడు చూసినా అశాంతి; ఎందుకంటే తీరవలసిన కోరికల సంఖ్య ఎప్పుడూ అమితంగా ఉంటుంది గనుక. అంటే ఎన్ని కోరికలు తీరితే అంత అశాంతి పెరుగుతూనే ఉంటుంది. పైగా, కోరికలు తీరకపోవడం వల్ల, ఆశాంతే గాక, కోపం, నిరాశ-నిస్పృహలు వంటి నకారాత్మక విషయాలన్నీ మనిషిని ఆవరించి జీవితాన్ని జటిలం చేసేస్తాయి.
మరి కోరికల్లేకుండా జీవించగలమా? యే కోరికా లేకుండా భూమ్మీద ఏం చేయాలి? అసలు కోరికలు లేకుండా జీవించాలనుకోవడం కూడా ఒక కోరికే కదా? మనిషి జీవితాన్ని ఇంకా పరికించి చూస్తే, ఒకప్పుడు కోరికలుగా ఉన్నవి, ఇప్పుడు అవసరాలైపోయాయి. మన ఐ. టీ. వాళ్ళు ఇప్పుడు అవసరాలు కూడు, గుడ్డ, నీడే కాదు, నాల్గవది కూడా ఉందంటున్నారు - బ్యాండ్ విడ్త్ (ఇంటర్నెట్) ; ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా జీవించడం దుర్లభం అయిపోయింది. మరేమిటి పరిష్కారం?
హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం
జీవిత ప్రయోజనాన్ని సాధించాలనుకుంటే, పరమ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే, జీవితం అర్థవంతంగా ఉండాలనుకుంటే హార్ట్ఫుల్నెస్ ఒక చక్కటి యౌగిక పరిష్కారం సూచిస్తున్నది: ముందు కోరికలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉండాలి. ఆ తరువాత ఇక అవసరాలు మాత్రమే మిగులుతాయి. ఆ తరువాత అవసరాలు కూడా తగ్గించుకునే ప్రయత్నంలో ఉండాలి. దీనికి హార్ట్ఫుల్నెస్ సాధన చాలా ఉపకరిస్తుంది.
బాబూజీ సూచించిన పరిష్కారం
భగవంతుని పొందాలన్న ఏకైక కోరికపై మనసంతా నిలిపి జీవించినప్పుడు, అనవసరమైనవన్నీ వాటంతట అవే ఎండుటాకుల్లా రాలిపోతాయన్నారు. అదే నిరంతర స్మరణ. హార్ట్ఫుల్నెస్ సాధన చేయగా, చేయగా కలిగే పరిణామం; ఫలితంగా అకస్మాత్తుగా బోలెడంత సమయం మనకు అందుబాటులో ఉండటం, ఒత్తిడి లేకుండా జీవించగలగడం, ఆ సమయాన్ని ఇతరుల సేవలో వెచ్చించగలిగే పరిస్థితి ఏర్పడటం, మనలను మనం మరచిపోయి జీవించే విధానం అలవడటం జరుగుతుంది. అనుభవం మాత్రమే సమగ్రమైన అవగాహనను కల్పిస్తుంది.
భగవంతుని చేరాలన్న ఒక్క కోరిక తక్కిన అన్ని కోరికలనూ తొలగించగలదు. కాబట్టి, కోరికలు తగ్గించుకొని, కనీస అవసరాలతో జీవించడమే సరళమైన, స్వచ్ఛమైన జీవనం అవుతుంది. సరళమైన, స్వచ్ఛమైన జీవనం ద్వారా మాత్రమే మనిషి పరిపూర్ణతను సాధించగలుగుతాడు.
అవసరాలు కోరికలు విశ్లేషణ బాగుంది. ఈసారి దాజి గారు
రిప్లయితొలగించండిఇచ్చిన happiness ఫార్ములా గురించి కూడా వివరిస్తే happiness verses desires గురించి కూడా బాగా అర్ధమవుతుంది
ధన్యవాదములు
అద్భుతం ! అవసరాల విషయమే పట్టించుకుందాం. కోరికల జోలికి పోవద్దు.
రిప్లయితొలగించండి