అపరాధ భావం (guilt )
మనిషి ఆధ్యాత్మిక వికాసానికి అడ్డుపడే గొప్ప అవరోధం - అపరాధ భావం (guilt). హృదయ భారాన్ని అత్యధికంగా పెంచేటువంటిది. దీనివల్ల అనేక ఆధ్యాత్మిక సమస్యలు, మానసిక రుగ్మతలే గాక శారీరక వ్యాధులు కూడా కలుగుతాయి. అంటే కాదు, దీన్ని తొలగించడం అసాధ్యం; ఎంతటి గురువైనా తొలగించలేడు; భగవంతుడు కూడా తొలగించలేడట. కేవలం అపరాధభావం పెంచుకున్న వ్యక్తి మాత్రమే తన ఆశ్రులతో కూడిన ప్రార్థనాపూర్వకమైన పశ్చాత్తాపంతోనూ, తిరిగి అవే తప్పులు చేయనన్న తీర్మానంతోనూ మాత్రమే తొలగించుకోగలిగేది.
అపరాధ భావం ఎలా ఏర్పడుతుంది?
మనం చెయ్యవలసిన పనులు చేయకపోయినా, చేయకూడని పనులు చేసినా, మనలో అపరాధభావం ఏర్పడుతుంది. ఆత్మవిరుద్ధమైన, మనస్సాక్షికి విరుద్ధంగా ఆలోచనలు చేసినా, పనులు చేసినా ఏర్పడుతుంది. హృదయం అతి భారంగా తయారవుతుంది.
హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం
పైన చెప్పినట్లుగా గురువు ఎంత సమర్థుడైనా తొలగించలేడు; కానీ సహాయపడగలాడు, సాధకుడు ప్రయత్నిస్తే, త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాపం చెందితే.
పూజ్య దాజీ సూచన: సక్రమమైన ఆలోచన, సరైన అవగాహన, జీవితాన్ని నిజాయితీయైన దృక్పథంతో జీవించడం చేస్తే అపరాధ భావం ఏర్పడే అవకాశం ఉండదు. తెలిసి చేసిన తప్పుల పర్యవసానాలు అనుభవించవలసినదే అంటారు దాజీ. తెలియక, పొరపాటున జరిగిన తప్పులకు పశ్చాత్తాపం ద్వారా కడిగేసుకునే అవకాశం ఉందంటారు దాజీ.
హార్ట్ఫుల్నెస్ సహజమార్గ పద్ధతిలో రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానంలో మనం మిషన్ ప్రార్థనను మనసులో రెండు-మూడు సార్లు అనుకుని, భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నామన్న భావనతో, ఏ రోజుకారోజు చేసిన పొరపాట్లను తలచుకుని త్రికరణ శుద్ధితో కన్నీటితో పశ్చాత్తాపం చెందుతూ, మరలా ఆ తప్పులు చేయబోమన్న తీర్మానం చేసుకుని వినమ్ర ప్రార్థనా ధోరణిలో ప్రార్థన భావాన్ని ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోమని సూచించడం జరిగింది. దీని వల్ల అపరాధ భావం భారం కరిగిపోయి, గుండె తేలికగా తయారై ప్రశాంతంగా నిద్రలోకి జారుకోగలుగుతాడు సాధకుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి