బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 7
24 గంటల సాధన
ఉదయం అరగంట ధ్యానం, సాయంకాలం ఇరవై నిముషాల శుద్ధీకరణ, రాత్రి పడుకునే ముందు పది నిముషాల ప్రార్థనా-ధ్యానం, ఇలా రోజులో ఉండే 24 గంటల్లో కేవలం ఒక గంట మాత్రమే మనం సాధన కోసం వెచ్చించినట్లనిపించినా, నిజానికి దీన్ని సరిగ్గా చేసినట్లయితే 24 గంటల సాధన అవుతుందంటారు సహజ మార్గ మాస్టర్లు. ఏ యోగసాధనైనా 24 గంటలూ చేసే సాధనే.
ఉదయం ప్రతి రోజూ ధ్యానం పూర్తయిన తరువాత, 2-3 నిముషాలు ధ్యానంలో కలిగిన స్థితిని గుర్తించే ప్రయత్నం చేయాలి; ఆ స్థితిని కొంతసేపు ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. ఆ స్థితిపై దృష్టిని సారించాలి; ఆ స్థితి మన శరీర వ్యవస్థలోని ప్రతీ కణంలో జీర్ణమయ్యే విధంగా ఆస్వాదించాలి. ఆ తరువాత రోజంతా మన నిత్యం చేసుకునే పనులు చేసుకుంటూ కూడా ఆ స్థితిపై ఒక కన్నేసి ఉంచాలి; దృష్టి పెట్టి ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఉదయం ధ్యానంలో కలిగిన స్థితి రోజంతా కొనసాగే పరిస్థితి ఏర్పడుతుంది. అభ్యాసం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియనే పూజ్య దాజీ ఆంగ్లంలో aeiou పద్ధతిగా తెలియజేయడం జరిగింది.
ఇంటికి చేరుకోగానే శుద్ధీకరణ ప్రక్రియ చేసుకుంటాం. ఈ ధ్యాన స్థితిని కొనసాగిస్తూనే రాత్రి భోజనం చేయడం, కుటుంబ సభ్యులతో గడపటం అన్నీ జరుగుతూ ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ప్రార్థనా-ధ్యానంతో రోజును ముగిస్తూ నిద్రలోకి జారుకోవడం వల్ల, ఈ ధ్యాన స్థితి రాత్రి నిద్రావస్థలో కూడా కొనసాగుతుంది. మరలా ఉదయం నిద్రలేవగానే ధ్యానంతో మన దినచర్య ప్రారంభమవుతుంది. ఇలా మన సాధన ఒక గంట సేపే అనిపించినా నిజానికి 24 గంటల సాధన అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి