10, మే 2024, శుక్రవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 2 - పద్ధతిలోని ప్రత్యేకతలు

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము  - 2

సహజ మార్గ ధ్యాన పద్ధతిలోని ప్రత్యేకతలు  
సహజ మార్గ ధ్యాన పద్ధతిలోని ప్రత్యేకతలు రెండు - 
ప్రాణాహుతితో కూడిన ధ్యానం, 
శుద్ధీకరణ ప్రక్రియ.  

ప్రాణాహుతి అంటే ఏమిటి?
మనిషిలో పరివర్తన తీసుకురావడానికి దివ్యశక్తిని వినియోగించడమే ప్రాణాహుతి అని ప్రాణాహుతి యొక్క నిర్వచనం. 
గురువు వద్ద నుండి, ప్రశిక్షకుని ద్వారా, ప్రాణాహుతి ప్రసరణ అనే దివ్య శక్తి సాధకుడికి ధ్యానించడంలో సహకరిస్తుంది. ప్రాణాహుతి మనలను చేయి పట్టుకు లోపలికి తీసుకువెళ్ళినట్లుగా సహకరిస్తుంది. 
గణనీయమైన అభ్యాసం తరువాత ఇది స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. 
దీన్ని కేనోపనిషత్తులో కూడా ప్రాణస్య ప్రాణః అని కూడా ఉల్లేఖించడం జరిగింది. 
ప్రాణాహుతి సహజ మార్గ ధ్యానంలో గురువు ఉపయోగించే సూక్ష్మాతి సూక్ష్మ స్థితి. ఇంతకంటే సూక్ష్మ శక్తి ఆస్తిత్వంలో లేదంటారు బాబూజీ. మనిషిలో సమూల మార్పు తీసుకురాగలిగే శక్తి. 
ప్రాణాహుతి వల్ల చేతన యొక్క అసంఖ్యాకమైన పొరల్లో ఒక పొర నుండి మరొక పొరకు ప్రయాణించడం తేలికయిపోతుంది. ఆధ్యాత్మిక యాత్రలో ఈ అసంఖ్యాకమైన పొరలన్నీ దాటుకుని అంతర్యామిగా ఉన్న ఆ మూలాన్ని చేరవలసి ఉంటుంది. ఒక పొర నుండి మరొక పొరకు యాత్ర కొనసాగుతున్న కొద్దీ మనిషిలో సమూల మార్పులు చోటు చేసుకోవడం ప్రతీ అభ్యాసి అనుభవంలో తెలుసుకోగలుగుతాడు. 
ప్రాణాహుతి ఇంద్రియాతీతమైనది, కాలాతీతమైనది, యే విధంగా అయితే మనం కాంతిని నేరుగా చెందలేమో, కాబట్టి దీన్ని నేరుగా అనుభూతి చెందలేము కానీ, దీని ప్రభావాన్ని అనేక రకాలుగా అనుభూతి చెందవచ్చును. 
ప్రాణాహుతి దివ్యత్వం యొక్క స్పర్శను అనుభవంలోకి తీసుకు వస్తుంది. కొన్ని అనుభూతులు ఇలా ఉంటాయి: ప్రాణానికే కొత్త ప్రయాణం వచ్చినట్లుంటుంది; నూతన ఉత్సాహం కలుగుతుంది; ఎండిపోయిన చెట్టుపై వర్షం పడిన తరువాత చిగురించినట్లుగా, తాజాదనం అనుభూతి చెందగలుగుతాడు అభ్యాసి; మానసిక ప్రశాంతత అంటే ఏమిటో నిజమైన అనుభూతి మొట్టమొదటిసారిగా అనుభూతి చెందడం జరుగుతుంది; ఒత్తిడి పోవడం అంటే ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది; నిశ్చలత్వం, అస్సలు శబ్దం లేని అంతరంగ నిశ్శబ్దం, ప్రశాంత చిత్తం, అకారణ ప్రేమ ఇటువంటి పదాలకర్థం ఏమిటో మొట్టమొదటిసారిగా రుచి చూస్తాం; ఆలోచనలో స్పష్టత వస్తుంది; ఏకాగ్రత పెరుగుతుంది; ఆత్మవిశ్వాసం పెరుగుతుంది; ఇవన్నీ అనుభవిస్తేనే తప్ప తెలియదు. కనుక ఎవరికి వారు ప్రత్యక్షానుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. వెరసి మనిషి జీవితంలోనే మార్పులు చోటు చేసుకోవడం గమనించగలుగుతాం. 
శుద్ధీకరణ అంటే ఏమిటి?
శుద్ధీకరణ అంతఃకరణ శుద్ధి; అంటే అశుద్ధాలతోనూ లేక మలినాలతోనూ, జటిల తత్త్వాలతోనూ, కోరికలతోనూ కలుషితమైపోయిన మనసు, బుద్ధి, అహం, చిత్తము - వీటిని శుద్ధి చేసే ప్రక్రియ. ధ్యానానికి అవరోధాలుగా నిలిచే వాటిని శభ్రమ చేసే ప్రక్రియ. మన అంతరంగం ఇంతకు పూర్వం కంటే శుద్ధి అయినట్లుగా అనుభూతి చెందే ప్రక్రియ. ప్రతి నిత్యం ఈ ప్రక్రియను అభ్యాసం చేయడం వల్ల ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళడమే గాక, ఆధ్యాత్మిక యాత్ర సాఫీగా, ప్రభావ పూరితంగా ఉండటం గమనించవచ్చు. 
సహజ మార్గ ధ్యాన పద్ధతిలో అభ్యాసి,  ప్రతి నిత్యం అనుసరించే 
3 ప్రధాన యౌగిక ప్రక్రియలు 
ఉదయం:  ధ్యానం (30-60 నిముషాలు)
సాయంకాలం: శుద్ధీకరణ లేక నిర్మలీకరణ  (20-30 నిముషాలు) 
రాత్రి: ప్రార్థనా-ధ్యానం (10-15 నిముషాలు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...