బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 6 - సంకల్పం
మనిషి జీవితంలో సంకల్పం లేనిదే యేమీ జరగదు. ఉదయం 4 గంటలకు లేవాలంటే రాత్రి పడుకునే ముందు ప్రొద్దున్నే లేవాలనుకోవడం సంకల్పం. జీవితంలో ఫలానా విధంగా తయారవ్వాలనుకోవడం సంకల్పం. ఇల్లు కట్టాలనుకోవడం సంకల్పం, డబ్బు సంపాదించి ధనికుడవ్వాలనుకోవడం సంకల్పం. ఇలా నిత్య జీవనంలో సంకల్పం లేకుండా యే పనీ చేయలేము.
సంకల్పం ఎంత శక్తివంతమైనదంటే కొన్ని సంకల్పాలు మనిషి చనిపోయిన తరువాత కూడా పని చేస్తూంటాయి. అందుకే వీలునామాని బహుశా ఆంగ్లంలో విల్ (Will) అని అనడానికి కారణమేమో. మనిషి సంకల్పం అంత గొప్పది. సంకల్పం లేనిదే యే కార్యమూ సిద్ధించదు.
ఇక ఆధ్యాత్మిక సంకల్పాలు మరింత శక్తివంతమైనవి. సంకల్పించగానే పని చేయడం మొదలైపోతుంది. కానీ మనిషి తన సంకల్పాన్ని అస్సలు సందేహించకూడదు. సందేహిస్తే అక్కడే పని ఆలోచనా స్థాయిలోనే ఆగిపోతుంది. ఎందుకంటే సందేహం సంకల్పాన్ని విషపూరితం చేస్తుంది.
సహజ మార్గంలోని అన్ని యౌగిక ప్రక్రియలలోనూ కూడా మనం వినయోగించేది రకరకాల సంకల్పాలే.
ఆధ్యాత్మికంగా యేదైనా పని జరగాలంటే, సంకల్పం, దృఢ సంకల్పమై ఉండాలి; ఆ సంకల్పం దైవ సంకల్పానికి అనుగుణంగా ఉన్నప్పుడు తేలికగా అయిపోతుంది. ఆధ్యాత్మిక సంకల్పం ఎంత సూక్ష్మంగా ఉంటే అంత ప్రభావపూరితంగా ఉంటుంది.
ఇంతకూ సంకల్పం అంటే ఏమిటి?
ఇచ్ఛాశక్తితో కూడిన ఆలోచనను సంకల్పం అంటారు.
సంకల్పం = ఆలోచన + ఇచ్ఛాశక్తి.
ఇది ఎంత సూక్ష్మ సూచనగా ఉంటే అంత బాగా పని చేస్తుంది.
ఇక్కడ మన యౌగిక ప్రక్రియలలో చేసే సంకల్పాలు:
ధ్యానంలో: హృదయాంతరాళంలో ఒక దివ్య వెలుగు ఉంది అన్న సంకల్పం.
శుద్ధీకరణలో: శరీర వ్యవస్థ నుండి అన్నీ అశుద్ధాలు, అన్నీ జటిల తత్త్వాలూ పొగ రూపంలో బయటకు వెళ్లిపోతున్నాయన్న సంకల్పం.
ప్రార్థనలో: ప్రార్థనా పంక్తులే సంకల్పం.
దాజీ నిర్దేశించిన 4 ప్రార్థనా-పూర్వక సూచనలన్నీ సంకల్పాలే. రాజయోగ సాధన సంకల్పాలతో కూడిన సాధన. హిందువుల క్రతువుల్లో కూడా ప్రారంభించే ముందు సంకల్పం చేసుకుంటారు.
అభ్యాసం చేయగా చేయగా మానవ సంకల్పం కూడా దైవ సంకల్పంలా మారిపోయే అవకాశం ఉంది. మనిషి చేసే యే సంకల్పమూ వ్యర్థం కాదు.
భౌతిక జీవనంలో కేవలం సంకల్పం చేసినంత మాత్రాన సరిపోదు; ప్రయత్నము, కృషి తోడవ్వాలి. కానీ ఆధ్యాత్మిక జీవనంలో సంకల్పం చేయగానే పని మొదలైపోతుంది.
కాబట్టి అభ్యాసులు యౌగిక ప్రక్రియల అభ్యాసం చేస్తున్నప్పుడు సంకల్పం సాధ్యమైనంత సూక్ష్మంగా చేసుకోగలిగితే సాధన యొక్క నాణ్యత మెరుగవడం గమనించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి