బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 22
సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?
పరమ పూజ్య బాబుజీ ఆవిష్కరించిన సహజమార్గ యాత్ర ప్రకారం, ఆధ్యాత్మిక యాత్ర అంటే 13 బిందువుల గుండా ఆత్మ చేసే ప్రయాణం. ఈ బిందువులను, చక్రాలని, గ్రంథులనీ కూడా అంటారు.
ఆత్మ కదులుతుందా? కదలదు. మరేం కదులుతుంది? ఇక్కడ, ఆత్మ అంటే ఆత్మ వ్యక్తమయ్యే మాధ్యమం, దాన్నే చేతన అని, చైతన్యమని అంటారు. ఆత్మ, చైతన్యం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ చేతన లేక చైతన్యం పూర్తిగా పరిశుద్ధ చైతన్యంగా మారే వరకూ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. అప్పటి వరకూ ఆత్మ పరితపిస్తూనే ఉంటుంది. జీవులను నడిపేది ఈ పరితపిస్తున్న ఆత్మే. ఆత్మ దేని కోసం తపిస్తున్నదో అది పరమాత్మ. ఆ పరమాత్మతో కలయిక జరిగే వరకూ, లయమయ్యేవరకూ ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. దీన్నే యోగం అంటారు.
ఈ యోగ సిద్ధి కలగడానికి ప్రధానంగా మూడు మార్గాలు - కర్మయోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం. కానీ ప్రతీ యోగమూ , మూడు యోగాలతోనూ కూడుకుని ఉంటుంది. ఏ యోగం ప్రబలంగా ఉంటే ఆ వ్యక్తిని ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు. ఉదాహరణకు, మనిషిలో భక్తి ఎక్కువగా ఉంటే అతను భక్తియోగాన్ని అనుసరిస్తున్నాడనవచ్చు; అలాగే జ్ఞానం ప్రబలంగా ఉంటే జ్ఞాన యోగి అని, అలాగే కర్మ ద్వారా దైవాన్ని సాధించాలనుకున్నవాడిని కర్మయోగి అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కానీ ముగ్గురూ మూడు యోగాలను అనుసరించవలసినదే. ఈ మూడిటికీ అతీతమైనది రాజయోగం అంటే మనసుతో యోగాన్ని సిద్ధింపజేసుకోవడం. దీన్ని కొందరు మనోయోగం అని కూడా అంటారు. అటువంటి రాజయోగ పద్ధతే మన ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గ పద్ధతి. మనసుతో చేసే యోగం. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల కలయిక ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి