శరణాగతి, ప్రేమ, లయావస్థ
సముచితమైన భావంతో మన నిత్య సాధన కొనసాగించ్చినప్పుడు, అంటే ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం మన దినచర్యలో భాగమైపోయినప్పుడు, సహజమైనప్పుడు అది నిరంతర స్మరణగా పరివర్తన చెందడం ప్రారంభిస్తుంది. నిరంతర స్మరణ సాధకుడు తనను తాను మరచిపోయి, ఆ భగవంతుని స్పృహలో జీవించేలా పరిణమిస్తుంది. అదే దివ్య ప్రేమకు దారి తీస్తుంది. శరణాగతి భావం అప్రయత్నంగానే సంభవిస్తుంది. శరణాగతి ప్రయత్నిస్తే వచ్చేది కాదు. తనంతటాబయగా సంభవిస్తుంది. ప్రేమ లేనిదే శరణాగతి లేదు; శరణాగతి లేనిదే ప్రేమ లేదు; అసలు ప్రేమ అంటేనే శరణాగతి. శరణాగతి, ప్రేమ లయావస్థకు దారి తీస్తాయ. ఈ అవస్థలో కేవలం సాధకుడి అస్తిత్వం యొక్క సాక్షి భావం ఒక్కటే ఉంటుంది. నీటి చుక్క మహాసముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాజీ చెప్పినట్లుగా నీటి చుక్కే సముద్రంగా మారిపోతుంది. నిజానికి "నేను సముద్రంగా మారిపోయాను" అని చెప్పడానికి నీటి చుక్క మిగలదు.
మహాసముద్రంగా మారిపోయిన తరువాత ఈ సాక్షి భావం కూడా కనుమరుగైపోతుందట. పూజ్య దాజీ ఇటీవలే ఇచ్చిన సందేశంలో, అయినప్పటికీ ఈ యాత్ర ఇంకా పూర్తవదంటారు. అప్పుడు వ్యక్తిగత చేతన యొక్క సాక్షి భావం పోయి, విశ్వ చేతనకు సాక్షిగా మారడం జరుగుతుంది. బహుశా అది మహాప్రళయంలో మాత్రమే అంతమవుతుంది.
ఇంత యాత్ర ఈ జన్మలోనే శరీరం ఉండగానే ప్రాణాహుతితో కూడిన సహజ మార్గ సాధన వల్ల సాధ్యమంటారు బాబూజీ, చారీజీ, దాజీ. అవసరమైనడల్లా దారిలో అడ్డు వచ్చే కలుపుమమొక్కలన్నిటినీ ధ్వంసం చేయగలిగే దృఢసంకల్పం, శ్రద్ధాభక్తులు, నిరంతర శ్రమ (తితిక్ష) సాధకుడు అలవరచుకోవలసి ఉందంటారు.
ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటాం, హృదయాలు తెరుస్తాం. తెరచిన హృదయం కానుక అందుకుంటుంది. కానుకను గుర్తించడం కృతజ్ఞత. కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక స్థితిని మన హృదయాలలో కలుగజేస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించినప్పుడు అది ప్రేమ దిశగా పైకి ఎగుస్తుంది. అంతరంగంలో ఉన్న ప్రేమ, పరమాత్మ పట్ల పూజ్య భావం సృష్టిస్తుంది. పూజ్యభావం మనలో పెరుగుతున్నకొద్దీ, మన హృదయం దైవకృపను ఆకర్షిస్తుంది. కృపా తరంగాలపై పయనిస్తున్న కొద్దీ, సమర్పణ భావం ప్రారంభమవుతుంది. సమర్పణభావం నిర్మలత్వాన్ని సృష్టిస్తుంది. నిర్మలత్వం వల్ల శరణాగతి ప్రారంభమవుతుంది. శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది.
- దాజీ, స్పిరిచువల్ అనాటమీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి