17, మే 2024, శుక్రవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 15 - నిరంతరస్మరణ

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 15
నిరంతరస్మరణ 

నిత్యసాధన పర్యవసానమే నిరంతర స్మరణ. సతత స్మరణ అని కూడా అంటారు. నిత్యసాధన అంటే ఉదయం ధ్యానం, సాయంకాలం శుద్ధీకరణ, రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థనా-ధ్యానం, దశనియమాలకనుగుణంగా  జీవించే ప్రయత్నం, సాహిత్య పఠనం, ప్రశిక్షకులతో  వ్యక్తిగత సిట్టింగులు, సామూహిక ధ్యానాలు, దైనందిన బాధ్యతలను నిర్వర్తించడం ఇత్యాదివి చేయగా చేయగా నిరంతర స్మరణ అనేది అంతరంగంలో సహజంగా అలవడుతుంది.  

నిరంతర స్మరణ అంటే యేది కాదు? 
నిరంతర స్మరణ అంటే జపం కాదు; 'మాస్టర్', 'మాస్టర్' అని మనసులో అనుకోవడం కాదు. 

నిరంతర స్మరణ అంటే ఏమిటి?
నిరంతర స్మరణ అంటే అంతరాయం లేకుండా, ఎడ తెగకుండా,  భగవత్  తత్త్వాన్ని హృదయంలో స్మరించడం. అది ఒక అలౌకికమైన అనుభూతి. 

నిరంతర స్మరణ ఎందుకు? 
మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్మరిస్తాం. అలాగే మనం ఎవరిని స్మరిస్తామో, వారిని ప్రేమించగలుగుతాం. అంటే దైవాన్ని స్మరించడం వల్ల దైవం పట్ల నిజమైన ప్రేమ సహజంగా ఏర్పడుతుంది, నిజమైన భక్తి కలుగుతుంది; ఇది శరణాగతికి దారి తీస్తుంది. శరణాగతి భగవంతునిలో సంపూర్ణ లయావస్థకు దారి తీస్తుంది. - బాబూజీ 

నిరంతర స్మరణను అలవరచుకునేందుకు ఇతర సూచనలు  
మనం యే పని చేస్తున్నా ఆ పని ఆయనే చేస్తున్నారన్న స్పృహతో చేయడానికి ప్రయత్నించాలి; ఆ పని యొక్క ఫలితాన్ని కూడా వారికే అర్పించే ప్రయత్నం చేయాలి. ఆఫీసుకు వెడుతున్నా, వంట చేస్తున్నా, చదువుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏమి చేస్తునా సరే, 'ఆయన' స్పృహలో చేయడానికి ప్రయత్నించండి - బాబూజీ 

ఆకలి వేస్తున్నప్పుడు పొట్ట ఆహారాన్ని స్మరిస్తుంది; దాహం వేసినప్పుడు గొంతు నీటిని స్మరిస్తుంది; అలాగే హృదయం తపించేది భగవంతుని కోసం. అదే నిజమైన స్మరణ.  - చారీజీ

ప్రతి రోజూ ఉదయం ధ్యానం పూర్తయిన తరువాత, ధ్యానంలో అనుభూతి చెందిన సూక్ష్మ ఆధ్యాత్మిక స్థితిని గుర్తించి, ఆస్వాదిస్తూ, ఆ స్థితి శరీర వ్యవవస్థలోని ప్రతి కణంలోనూ వ్యాపించి జీర్ణమైపోయినట్లు అనుభూతి చెందడానికి రెండు నిముషాలు వెచ్చించాలి. ఆ తరువాత రోజంతా మన దైనందిక పనులు  చేస్తుకుంటున్నప్పుడు కూడా, ఒక కన్ను మనం పొందిన స్థితిపై ఉంచి, రోజంతా కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆ ధ్యాన స్థితిలో ఎంత సేపు కొనసాగగలిగితే అంత సేపు కొనసాగండి. ఇదే నిరంతర స్మరణ అంటే. - దాజీ

నిరంతర స్మరణ గురించి బాబూజీ మరో వాక్యం 
First we forget to remember.
Then we remember to remember.
and then we remember to forget.

ముందు మనం స్మరించడం మరచిపోతాం. 
తరువాత మనం స్మరించాలని గుర్తుంచుకుంటాం. 
ఆ తరువాత మనం మరచిపోడానికి స్మరణలో ఉంటాం. 

నిరంతర స్మరణ వల్ల నిత్యజీవితంలో కలిగే కొన్ని ప్రయోజనాలు 
మనసు అటు-ఇటూ తిరగడం తగ్గుతుంది; చంచల స్వభావం తగ్గడం గమనించవచ్చు. 
సాధన చేయగా, చేయగా హృదయం స్థిరంగా కేంద్రంలో ఉండటం ప్రారంభిస్తుంది. దీన్నే మనం సెంటర్డ్ గా (Centred) ఉండటం అంటాం ఆంగ్లంలో. అటువంటి స్థితిలో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. 
నిరంతర స్మరణ సిద్ధించడం వల్ల కొత్త సంస్కారాలు ఏర్పడటం ఆగిపోయి హృదయం ఎప్పుడూ తేలికగా ఉండటం ప్రారంభిస్తుంది.
నిరంతర స్మరణ దైవం పట్ల, గురువు పట్ల మానవాళి పట్ల అకారణ ప్రేమను పుట్టిస్తుంది. ఆహాన్ని అదుపులో ఉంచుతుంది. 

నిరంతర స్మరణ విషయంలో అభ్యాసులు తరచూ చేసే పొరపాటు 
తరచూ అభ్యాసులు, "నేను ధ్యానం చేయలేకపోతున్నాను గాని నిరంతర స్మరణ చేస్తున్నాను" అని అంటూండటం మనం వింటూంటాం. ఇది పొరపాటు భావన. 
ఎందుకంటే ధ్యానం నిరంతర స్మరణకు మాతృక అంటారు మాస్టర్లు. కాబట్టి ధ్యానం లేనిదే స్మరణ లేదు. ఇది చాలా సూక్ష్మస్థాయిలో జరిగే యౌగిక ప్రక్రియ, అనుభూతి. 
నిజానికి "నేను నిరంతర స్మరణలో ఉన్నాను" అని అనే పరిస్థితి అసలు రాదు నిరంతర స్మరణలో నిజంగా ఉన్నప్పుడు. దాని ప్రభావం హృదయ లోలోతుల్లో అప్పుడప్పుడు స్ఫురించవచ్చు. 
చివరికి నిరంతర స్మరణ ప్రేమకు, శరణాగతికి దారి తీస్తేనే అది నిరంతర స్మరణ అవుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...