15, మే 2024, బుధవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 12 - శ్రీ రామ చంద్ర మిషన్ ప్రశిక్షక వ్యవస్థ

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 12 
శ్రీ రామ చంద్ర మిషన్ ప్రశిక్షక వ్యవస్థ 

భారత దేశం ఎందరో మహాత్ములచే, అవతార పురుషులచే, మహర్షులచే, మునులచే సమర్థులైన గురువులచే, సద్గురువులచే దివ్యంగా తీర్చిదిద్దబడిన పవిత్ర దేశం. 

శరీరానికి గుండె స్థానం ఎటువంటిదో, ప్రపంచానికి భారత దేశ స్థానం అటువంటిది. గుండె యే విధంగా శుద్ధి చేయబడిన రక్తాన్ని శరీరం అంతా సరఫరా చేస్తుందో, అదే విధంగా ప్రపంచం మొత్తానికి భారతదేశం ఎన్నో యుగాలుగా ఆధ్యాత్మిక శక్తిని సరఫరా చేస్తూ ఉన్నది. 

ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా కూడా, భౌతిక జీవితంతో విసిగిపోయినప్పుడు, లోపల  ఉదయించే అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు మనసును వేధిస్తున్నప్పుడు, మనసు దేని కోసమో తెలియకుండా పరితపిస్తున్నప్పుడు, సమాధానాల కోసం ఈ రోజుకీ కూడా భారత దేశం వైపే చూస్తూ ఉంటాడు. భారత దేశం వచ్చి వివిధ గురువులను ఆశ్రయిస్తూ తన ఆత్మలోని తపనను చల్లార్చుకోవాలని  ప్రయత్నిస్తూ ఉంటాడు. 

శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థాపకులైన సమర్థ గురు పరమపూజ్య బాబూజీ మహారాజ్ భారతదేశం వరకూ రానక్కర్లేకుండా, ప్రతీ దేశంలోనూ ఈ ఆధ్యాత్మిక తృష్ణను తీర్చగల ప్రాణాహుతితో కూడిన ధ్యానాన్ని అందించే వ్యక్తులను తయారు చేయాలనుకున్నారు. భారతదేశంతో సహా భూమ్మీద అన్నిచోట్లా ప్రాణాహుతిని అందించగల వ్యక్తులను తయారు చేయాలని సంకల్పించారు. వాళ్ళనే ప్రశిక్షకులని, హార్ట్ఫుల్నెస్ ట్రైనర్లని, ప్రిసెప్టర్లని  అంటారు.  ప్రపంచంలో ప్రతీ ఇంట్లోనూ ఒక ప్రిసెప్టర్ ఉండాలన్నది, బాబూజీ సంకల్పం ఈ సంకల్ప సిద్ధి కోసం సహజ మార్గ మాస్టర్ల పరంపర, సంస్థ ఆవిర్భావం దగ్గర నుండి కృషి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 16000 కు పైగా ప్రశిక్షకులున్నారు. వీరందఋ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. 

ఈ ప్రశిక్షకులను ఆ సమయంలో ఉన్న సంస్థ అధ్యక్షులు, ఆధ్యాత్మిక మార్గదర్శి, అయిన సజీవ మాస్టరు నేరుగా తగిన శిక్షణనిచ్చి తయారు చేయడం జరుగుతుంది. 

బాబూజీ ప్రశిక్షకులను శుద్ధ రక్తనాళాలుగా (arteries) అభివర్ణించేవారు. మాస్టర్ హృదయం అయితే, అందులో నుండి వచ్చే ప్రాణాహుతిని శుద్ధ రక్తనాళాల ద్వారా శరీరమంతటా సరఫరా చేసేది ప్రశిక్షకులు. అందుకే వీళ్ళని ఆంగ్లంలో arteries అని అనేవారు బాబూజీ. 

ప్రాణాహుతి ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడమే గాక, చేతనలో మార్పులు కొంచెం-కొంచెంగా తీసుకువచ్చి, మనిషిలో సమూల ప్రవర్తన తీసుకురాగలిగే శక్తి ప్రాణాహుతి. కేవలం అనుభవం ద్వారా మాత్రమే ఎవరైనా తెలుసుకోగలిగేది. 

స్వార్థం లేకుండా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, కేవలం గురువు పట్ల భక్తిప్రపత్తులతో, కృతజ్ఞతా భావనతో ఉచితంగా అందించే వ్యక్తులు ప్రశిక్షకులు. గురుదేవులు ప్రశిక్షకులపై ఉంచిన నమ్మకం అద్వితీయం; నమ్మకంలోనే పరాకాష్ఠ. ఎక్కడ నమ్మకం ఉంటుందో, ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ బాధ్యత ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే బాధ్యత అనేది మనస్సాక్షికి సంబంధించిన విషయం.  



1 కామెంట్‌:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...