20, మే 2024, సోమవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 19 - సహజమార్గ యాత్ర

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 19 
సహజమార్గ యాత్ర 

యాత్ర అన్నప్పుడు ఇక్కడ మనం ఆత్మ యొక్క యాత్రను గురించి ప్రస్తావిస్తున్నాం. సహజ మార్గం ప్రకారం ఆత్మ తన మూలం నుండి విడిపోయినప్పటి నుండి, (మూలం నుండి విడిపోడానికి కారణాలు యేమైనప్పటికీ కూడాను) తిరిగి మూలానికి  చేరుకునే మార్గంలో ఉంది ఆత్మ. ఆత్మ తన మూలానికి చేరుకోడానికి పరితపిస్తూ ఉన్నది, ఆ తిరుగు ప్రయాణంలోనే ఉంది; దారిలో ఉంది. మూలం నుండి విడిపోయిన క్రమంలో భయంతోనూ, అహంతోనూ  మొదలై ఎన్నో ఎన్నెన్నో సంస్కారాలను, కోరికలనూ ఏర్పరచుకుని, పట్టుపురుగు తానే సృష్టించుకున్న పట్టులోనే ఇరుక్కుపోయినట్లు, ఆత్మ వాటిల్లో తానే  సృష్టించుకున్నదానిలోనే  ఇరుక్కుపోయి, అందులో నుండి విముక్తి కోసం పరితపిస్తూ ఉంది. ఈ విధంగా ఆత్మ తన సృష్టించుకున్నవన్నీ ఖరచు చేసే క్రమంలోనే వివిధ రకాల జన్మలు తీసుకున్న తరువాత (84 లక్షల యోనుల్లో నుండి జీవుడు ప్రయాణిస్తాడని మన శాస్రాలు కూడా చెప్తున్నాయి), ఎన్నో సార్లు జనన-మరణాలకు లోనై మానవ జన్మ తీసుకోవడం  జరుగుతుంది. ఇంత దుర్లభమైన మానవ జన్మ వచ్చిన తరువాత కూడా, తాను ఏర్పరచుకున్నకర్మలను/వాసనలను/సంస్కారాలను ఖర్చు చేయడానికి వచ్చి, బరువు తగ్గించుకోవడానికి బదులుగా, వాటిల్లోనే ఇరుక్కుపోయి, మరిన్ని సంస్కారాల బరువును పెంచుకుని ఈ లోకం నుండి నిష్క్రమిస్తూ మళ్ళీ-మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు జీవుడు. ఇలా ఆత్మ యొక్క ప్రయాణం, అంటే తన సుదీర్ఘ యాత్ర,  తన మూలాన్ని, తన అసలు గమ్యాన్ని చేరుకునే వరకూ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనం యాత్ర అన్నప్పుడు ఆత్మ యొక్క యాత్రను మొత్తంగా చూడవలసి ఉంటుంది. కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితం చేయడానికి లేదు. 
సహజ మార్గ ఆధ్యాత్మిక పథము ఈ జన్మకే కాదు, అన్ని జన్మలకు పరిష్కారం సూచిస్తున్నది. 84 లక్షల జీవరాసుల ద్వారా జరిగే ఈ ఆత్మ యొక్క ప్రయాణం, వికాసం సహజంగా, ఆటోమ్యాటిక్ గా అప్రయత్నంగానే జరుగుతుంది. అప్పుడు, మానవ జన్మ వస్తుంది. ఇక్కడ నుండి అప్రయత్నంగా యేదీ జరగదు. ఎందుకంటే మనిషికి మనసు, బుద్ధి, అహం అన్నీ పరాడించడం జరిగింది కాబట్టి. ఆత్మ వికాసం మానవ జన్మతో ఆగిపోదు. మానవ జన్మ వచ్చే వరకూ ఎన్ని లోకాల ద్వారా ప్రయాణించామో, మానవ జన్మ తరువాత కూడా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎన్నో ఊర్ధ్వ లోకాలున్నాయంటారు. కానీ ఈ ప్రయాణం జీవుడికి, లేక ఆత్మకు ఇష్టమైతేనే కొనసాగుతుంది. లేకపోతే ఇక్కడిక్కడే జీవుడి ఇష్ట ప్రకారం కొనసాగుతూ ఉంటదట. అందుచేత ఆత్మ తన పరమగమ్యాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనుగడను సాధించవలసి ఉంది. 
ఈ విధంగా చూసినప్పుడు ఆత్మ, తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందే పరమపదాన్ని చేరుకునే క్రమంలో, ఎంతో యాత్ర పూర్తి చేసుకునే ప్రవేశిస్తుంది. 

మానవ జన్మలో వివిధ యాత్రలు 
గర్భంలోకి ప్రవేశించిన తరువాత గర్భంలోనే నవమాసాల యాత్ర పూర్తి చెయ్యాలి. ప్రసవం జరిగిన తరువాత, బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే వివిధ దశల యాత్రలను పూర్తి చేయాలి; పుట్టుక నుండి మరణం వరకూ ఒక యాత్ర; విద్యాభ్యాసం ఒక యాత్ర; ఉద్యోగం ఒక యాత్ర; గృహస్థాశ్రమం ధర్మం ఒక యాత్ర; ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ చేసేది కూడా యాత్రే; ఈ యాత్రలన్నిటిల్లోనూ  అంతర్లీనంగా జరిగేదే ఆధ్యాత్మిక యాత్ర, ఆత్మ యొక్క యాత్ర; పరిణామ యాత్ర; మూలానికి చేసే తిరుగు ప్రయాణం అనే యాత్ర.  
రానున్న వ్యాసాలలో ఈ ఆధ్యాత్మిక యాత్రను గురించి మరింత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...