శుద్ధీకరణ లేక నిర్మలీకరణ
శుద్ధీకరణ లేక నిర్మలీకరణ అనేది సహజ మార్గ పథంలోని రెండవ యౌగిక ప్రక్రియ. ఇది చాలా ప్రత్యేకమైన ప్రక్రియ. యే ఆధ్యాత్మిక పథంలోనూ కనిపించకపోవచ్చు. శారీరక శుద్ధి చేసుకోవడం మనకు తెలుసు. కానీ మానసిక శుద్ధి లేక అంతరంగ శుద్ధి ఎలా చేసుకోవాలో మనకు తెలియదు. దీన్నే అంతఃకరణ శుద్ధి అని కూడా అనవచ్చు. అంతఃకరణ అంటే - మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము - ఈ నాల్గింటినీ కలిపి అంతఃకరణ శుద్ధి అంటారు. మనిషి జీవితం ఎలా ఉందో అలా ఉండటానికి కారణం ఈ అంతఃకరణే. ఇది సంస్కారాల వల్ల, కోరికల వల్ల కలుషితమైపోయింది. అందుకే మనిషికి ఇన్ని కష్టాలు. దీని శుద్ధి జరిగే వరకూ, వీటి పవిత్రమైన స్వస్వరూపాలు సిద్ధించే వరకూ ఆధ్యాత్మిక పురోగతి జరగదు. స్వతః సిద్ధంగా ఇవేవీ మన శత్రువులు కాదు. వీటిని శుద్ధి చేసుకున్నట్లయితే మనిషి వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి వీటిని శత్రువులుగా భావించరాడు. వీటిని శుద్ధి చేసి మచ్చిక చేసుకునే ప్రయత్నమే మన సాధన, అభ్యాసం.
శుద్ధీకరణ చేసే విధానం ఏమిటి?
ఈ యౌగిక ప్రక్రియలో, తలపైభాగం నుండి చివరి వెన్నెముక వరకూ ఉన్న వీపు భాగాన్ని మనసులో ఉంచుకుని, శరీర వ్యవస్థలో నుండి (అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల నుండి) అన్నీ అశుద్ధాలు, అన్నీ జటిలమైన తత్త్వాలు, ఈ వీపు భాగం నుండి పొగ రూపంలో బయటకు వెళ్లిపోతున్నట్లుగా సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పాన్ని ఆ విధంగా కొంతసేపు కొనసాగించాలి; ఆ తరువాత నెమ్మదిగా ఈ ప్రక్రియ యొక్క వేగాన్ని పెంచాలి; ఇది మారికొంతసేపు కొనసాగాలి; కొంత సమయానికి ఛాతీ భాగంలో ఒకరకమైన శూన్యతను అనుభూతి చెందడం జరుగుతుంది; ఆ శూన్యత అనుభూతి కలిగినప్పుడు పై నుండి ఒక దివ్య ప్రవాహం ఆ ఛాతీ భాగంలోకి ప్రవేశించి ఆ వెలుగుతో ఆ శూన్యాన్ని నింపేస్తున్నట్లుగా భావించాలి; ఇది కొంతసేపు కొనసాగాలి; ముందు నుండి దివ్య ప్రవాహం ప్రవేశించడము, వెనుక భాగం నుండి పొగరూపంలో అశుద్ధాలన్నీ వెళ్ళిపోవడం ఏకకాలంలో జరుగుతున్నట్లుగా అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి; ఇలా కొంత సేపు కొనసాగిన తరువాత, వెనుక నుండి పొగ ఆగిపోయి, కేవలం ముందు నుండి దివ్యప్రవాహం మాత్రమే హృదయంలోకి ప్రవేశిస్తూ శరీరంలోని ప్రతీ కణంలో ఈ వెలుగు నిండుతున్నట్లుగా అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి; ఇలా ఒక అయిదు నిముషాలు కొనసాగిన తరువాత శరీరం అంతా స్వచ్ఛంగా సరళంగా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. అప్పుడు ఈ ప్రక్రియను ఆపాలి.
ధ్యానానికి, శుద్ధీకరణకు ఉన్న తేడా ఏమిటి?
ధ్యానంలో క్రియాశీలకంగా చేసేది యేదీ ఉండదు. హృదయంలో ఒక దివ్య వెలుగు ఉందన్న సంకల్పం చేసుకుని పరోక్ష భావనతో సాక్షిగా ఏం జరుగుతున్నదో అనుభూతి చెందడం జరుగుతుంది.
శుద్ధీకరణ ప్రక్రియలో పరోక్షంగా గాక సంకల్పాన్ని క్రియాశీలకంగా ఉంచుతూ 20 నిముషాలూ పని చేసేలా చూడటం జరుగుతుంది.
శుద్ధీకరణ సరిగ్గా జరిగిందా లేదా ఎలా తెలుస్తుంది?
శుద్ధీకరణ నిర్దేశించిన విధంగా చేసినట్లయితే, పూర్తయిన తరువాత హృదయంలో తేలికదనాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది; జటిలత్వం తగ్గి సరళత్వాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. ఈ తృప్తి లేకపోయినట్లయితే మరల చేసుకోవచ్చును. యేదైనా అభ్యాసం వల్ల సాధించడం జరుగుతుంది. మనకు తెలిసినా-తెలియకపోయినా జరగవలసిన పని మాత్రం జరుగుతూ ఉంటుంది. నిరాశ చెందనవసరం లేదు. దీని ప్రభావాన్ని నిజాయితీగా ప్రయత్నించేవారు, తప్పక అనుభూతి చెంది తీరుతారు.
శుద్ధీకరణ చేసుకునే సమయం?
శుద్ధీకరణ ప్రక్రియను, రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక చేసుకోవాలి. సాధారణంగా సూర్యాస్తమయం సమయంలో శరేష్ఠం. 20 నిముషాల నుండి 30 నిముషాల వరకూ చేసుకోవాలి. రోజుకు ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి. గృహిణులకు బాబూజీ మినహాయింపునివ్వడం జరిగింది. వాళ్ళకు వీలుగా ఉన్న సమయంలో చేసుకోవచ్చు. షిఫ్ట్ డ్యూటీలు చేసేవారు, వాళ్ళ డ్యూటీలు ముగించుకుని వచ్చిన తరువాత చేసుకోవాలి. రోజువారీ పనులు పూర్తి చేసుకున్న తరువాత చేసుకోవలసిన ప్రక్రియ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి