బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 8 - వైఖరులు
సహజ మార్గ యౌగిక ప్రక్రియల అభ్యాసం ఎలా చేయాలన్నది 5 శాతమయితే, ఎటువంటి వైఖరితో, ఎటువంటి భావనతో చేయాలన్నది 95 శాతం అంటారు పూజ్య దాజీ. యౌగిక ప్రక్రియ ఎలా చేయాలన్నదీ అభ్యాసి ప్రయత్నంలో భాగమే; ఉండవలసిన వైఖరి కూడా మన ప్రయత్నంలో భాగమే. కానీ దీనికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. యే సాధనయినా కూడా తీవ్ర తపనతో చేస్తేనే ఫలితాలు సక్రమంగా ఉంటాయి.
ధ్యానం ఎటువంటి వైఖరితో చెయ్యాలి?
తీవ్ర తపనతో చేయడానికి ప్రయత్నించాలి. సహజంగా మనలో ఉన్న తపనను యే విధంగానైనా పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆకలిగా ఉన్నప్పుడు భోజనాన్ని సంపూర్ణంగా యే విధంగానైతే ఆస్వాదించగలుగుతామో, తపనతో చేసిన ధ్యానం కూడా ఎన్నో రెట్లు సంతృప్తికరంగా ఉంటుంది.
తపన పెంచుకోవడం ఎలా?
ప్రతీ ఆత్మలోనూ సహజంగానే ఎంతో కొంత తపన ఉంటుంది. దాన్ని తీవ్రం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. ఒక పద్ధతి అంటూ యేమీ లేదు, ఎన్నో రకాలుగా ప్రయత్నించవచ్చు. మన చుట్టూ ఉన్న లోకాన్ని ఆశ్చర్యంతో పరికించి చూడటం ద్వారా కావచ్చు; ఆత్మ వికాసానికి సంబంధించిన గ్రంథాలను, ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనం చేయడం ద్వారా కావచ్చును; సజ్జనులతో, తోటి సాధకులతో సమయం వెచ్చించడం ద్వారా కావచ్చు; ఫలితం ఆశించకుండా ఇతరుల సేవలో నిమగ్నమవడం ద్వారా కావచ్చు; తపస్సు ద్వారా కావచ్చు; మహాత్ముల ప్రవచనాలు, ఉపన్యాసాల ద్వారా కావచ్చును; సృష్టి రహస్యాలను తెలుసుకోవాలన్న ఆతృతతో కావచ్చును; మహాత్ముల సాంగత్యం ద్వారా కావచ్చును; ఇవన్నీ కలిపి కూడా కావచ్చును; ఇలా ఇంకా అనేక రకాలుగా మనకు మార్గాలు స్ఫురించవచ్చును. నిజాయితీతో కూడిన ప్రయత్నం కీలకం.
శుద్ధీకరణ ఎటువంటి వైఖరితో చేయాలి?
ఉదయం నుండి సాయంకాలం వరకూ ఎండలో బాగా కష్టపడి, చమటలు కారుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడు స్నానం చేస్తానా, ఎప్పుడు శుభ్రంగా తాజాగా తయారవుతానా అన్న అశాంతితో ఎలా ఉంటామో, అలాగే ఎప్పుడెప్పుడు మనలో ఏర్పరచుకున్న మలినాలు, సంక్లిష్ట తత్త్వాలు పోగొట్టుకుంటానా అన్న అశాంతి వైఖరితో శుద్ధీకరణ చేసుకుంటే ఫలితం అద్భుతంగా ఉండటం అనుభూతి చెందవచ్చు.
ప్రార్థనా-ధ్యానం యే భావంతో చేయాలి?
నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా, దీనస్థితిలో ఉన్నట్లుగా, స్వార్థం లేకుండా, పూర్తి సమర్పణ భావంతో, వినమ్రంగా చేయాలి ప్రార్థన. అందరినీ కలుపుకోవాలి ప్రార్థనలో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి