23, మే 2024, గురువారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 21 - సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?

 



బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 21 
సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?


ఆత్మ కదులుతుందా? ప్రయాణిస్తుందా? అసలు ఈ యాత్ర అంటే ఏమిటి? నిజంగా యాత్ర జరుగుతుందా? అస్తిత్వానికి సంబంధించిన ఇటువంటి ప్రశ్నలు ప్రతీ ఆత్మకు కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు మన సహజ మార్గ పద్ధతిలో మన మాస్టర్ల ద్వారా అనేక సందర్భాలలో వెల్లడి చేయడం జరిగింది. వీటిని మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఆత్మ అనేది శుద్ధ చైతన్యం, ఒక ఉనికి, ఆత్మలో వికాసం చెందడానికి యేమీ లేదంటారు. ఇందులో మార్పు చెందవలసినదేదీ లేదంటారు. భౌతిక శరీరంలో అంటే స్థూల శరీరంలో, మార్పులు సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాని దీనికి పరిమితులున్నాయి; శరీరానికి వయసు మీరుతుందే తప్ప పెద్దగా వికాసం యేదీ జరగదు. ఇక కారణ శరీరంలో మార్పులు వచ్చే అవకాశమే లేదని ఇంతకు మూడే చెప్పుకున్నాం. ఇక మిగిలినది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ప్రధానంగా మనసు, బుద్ధి, అహం, చిత్తం. మన ఈ శరీర వ్యవస్థలో మార్పులు చెందేవి ఈ సూక్ష్మ శరీరాలే. సూక్ష్మ శరీర వికాసానికి అసలు ఎటువంటి పరిమితులు లేవు. దీన్నే ఆధ్యాత్మిక వికాసం అంటారు. 

ఆత్మ అభివ్యక్తమయ్యేది  సూక్ష్మ శరీరం ద్వారా. సూక్ష్మ శరీరం అభివ్యక్తమయ్యేది స్థూల శరీరం ద్వారా. 

పుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించేది, మరణించినప్పుడు శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయేది ఆత్మ. కానీ శరీరం విడిచి వెళ్ళేది కేవలం ఆత్మ మాత్రమే కాదు; దానితోపాటు సూక్ష్మ శరీరం కూడా వెళ్ళిపోతుంది; స్థూల శరీరం భూమ్మీద మిగిలిపోతుంది.  సూక్ష్మ శరీరం పరిశుద్ధంగా తయారయ్యే వరకూ, ఆత్మ మరల-మరల జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీర శుద్ధి జరగడం కోసమే, మనిషి జన్మ తీసుకున్నది. ఇక్కడ కర్మ సిద్ధాంతాల పాత్ర కనిపిస్తుంది. సూక్ష్మ శరీర శుద్ధి జరిగినంత మేరకు, దానిని బట్టి మరుజన్మ లభిస్తూ ఉంటుంది. 

ఈ ఆత్మను భగవంతునిలో ఒక అంశగా చెప్తారు. అందుకే ఆత్మను నీటి బొట్టని, భగవంతుడు మహాసముద్రమనీ కబీర్ అభివర్ణిస్తారు. ఈ నీటి చుక్క మహాసముద్రంలో కలిసిపోయి ఒకటవడమే యోగం. ఈ నీటి చుక్క సముద్రంలోనిదే కాబట్టి ఒకటవడానికి పరితపిస్తూ ఉంటుంది. 

నిజానికి నీటి చుక్క, మహాసముద్రంలో భాగమైనప్పుడు రెండూ వేర్వేరుగా ఉండే అవకాశమే లేదు. కానీ నీటి చుక్క విడిపోయిన భ్రమలో ఉంటుందట. ఆ భ్రమను తొలగించడమే ఆధ్యాత్మిక యాత్ర యొక్క లక్ష్యం, ప్రయోజనం. 

కానీ మనం ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నీటి చుక్క, నీటి చుక్కగా ఉంటే మహాసముద్రంలో తేలికగా ఒక్కటైపోతుంది. అంటే సముద్ర లక్షణాలన్నీ అన్నీ విధాలా నీటి చుక్కలో ఉంటేనే ఒక్కటవుతుంది. అదే నూనె చుక్క మహాసముద్రంలో పడిందనుకోండి. ఎప్పటికైనా మహాసముద్రంలో కలుస్తుందా? ఎప్పటికీ. కలవదు. నీటి చుక్క మహాసముద్రంలోనే ఉన్నా సముద్రంతో ఎటువంటి సంబంధమూ లేకుండా కొనసాగుతూ ఉంటుంది. ఇంతకంటే విషాదకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. నూనె చుక్కలో ఉండే ఆ జిడ్డుతనమే సముద్రంలో కలవనీయదు. మన ఆత్మ విషయంలో ఆ జిడ్డు అంటే ఏమిటి? కోరికలు, సంస్కారాలు, అహంకారము. ఇవే ఆత్మను భగవంతునితో ఐక్యం కానివ్వకుండా చేస్తున్నది. వీటిని సంపూర్ణంగా తొలగించుకున్న తక్షణమే ఆత్మ పరమాత్మలో సంపూర్ణ ఐక్యం పొందుతుంది;  ఇదే సహజ మార్గ పరమ లక్ష్యం; ఈ లక్ష్యాన్ని బాబూజీ తన దశ నియమాల్లో కూడా చెప్పడం జరిగింది. 

భగవంతునితో విడిగా ఉన్నామన్నది  భ్రమ మాత్రమేనని, ఆ భ్రమ ఈ సహజమార్గ జీవన విధానం ద్వారా తొలగిపోతుందంటారు దాజీ. అదే యోగం. ఇదే ఆధ్యాత్మిక యాత్ర పరమగమ్యం. అందరూ ఆ బాటలో ముందుకు సాగుదురుగాక! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...