బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 14
దశనియమాలు
పూజ్య బాబూజీ మహారాజ్, మనిషి నిత్యజీవితం ఎలా ఉండాలో, అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ మన దినచర్య యే విధంగా ఉండాలి, మన వైఖరులు ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలి అనే సూచనలు చాలా సరళంగా అందించడం జరిగింది. వీటిని మన నిత్య జీవన విధానంలో అమలుపరచే ప్రయత్నంలో ఉన్నప్పుడు, జీవితం ప్రతి నిత్యం నిత్యనూతనంగా ఉండటం, తేలికగా సవాళ్ళను ఎదుర్కోవడం, సంస్కారాలు ఏర్పడకుండా జీవించడం, ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలియడం, మనలో సూక్ష్మ స్థాయిలో కలిగే మార్పులు, వ్యక్తిత్వ వికాసం, అనుభవంలోకి రావడం వంటివెన్నిటినో చూడవచ్చు.
ఆ దశ నియమాలు ఈ విధంగా ఉన్నాయి:
1) ఉషః కాలానికి పూర్వమే నిద్ర లేచి, ఒకే సమయంలో మీ ప్రార్థనా-ధ్యానాదులను ఆరంభించండి. సాధ్యమైనంత వరకూ వాటిని సూర్యోదయానికి పూర్వమే పూర్తయ్యేలా చూడండి. ధ్యానం కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని, ఒక ఆసనాన్ని ఏర్పరచుకోండి. సాధ్యమైనంత వరకూ ఒకే భంగిమలో కూర్చొనే అలవాటు చేసుకోండి. శారీరక మానసిక శుచీలో ప్రత్యేక శ్రద్ధను వహించండి.
2) ఆధ్యాత్మికోన్నటి కోసం ప్రార్థన చేసి మీ ధ్యానాన్ని ప్రారంభించండి. హృదయం అంతా ప్రేమతో నిండిపోయే విధంగా ప్రార్థనను నివేదించండి.
3) భగవంతునితో సంపూర్ణ ఐక్యం పొందడమే లక్ష్యంగా ఏర్పరచుకోండి. ఆశయం సిద్ధించే వరకూ విశ్రమించకండి.
4) ప్రకృతితో సమానంగా ఒక్కటై ఉండేలా మీ జీవితాన్ని సరళంగా మలచుకోండి.
5) ఎల్లప్పుడూ సత్యసంధత కలిగి ఉండండి; కష్టాలు మీ మంచి కోసమే భగవంతుని వద్ద నుండే వస్తున్నాయని గ్రహించి కృతజ్ఞతతో ఉండండి.
6) ప్రజలందరూ తమ సహోదరులుగా తెలుసుకుని, వారితో అదే భావంతో మెలగండి.
7) మీ పట్ల ఎవరైనా పొరపాటుగా వ్యవహరిస్తే, వారి పట్ల ప్రతీకార భావం పెంచుకోకండి. దానికి బదులుగా అది భగవంతుని వద్ద నుండి వచ్చినదిగానే భావించి, కృతజ్ఞత కలిగి ఉండండి.
8) నిజాయితీయైన ధర్మబద్ధమైన సంపాదనకు ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ ఏమి లభించినా, దానిని నిరంతర దైవ చింతనతో భుజిస్తూ సంతుష్టులై ఉండండి.
9) ఇతరులలో ప్రేమ, పవిత్ర భావాలు జనింపజేసే ఉన్నత కోవకు చెందే విధంగా మీ ప్రవర్తనను, మీ జీవన విధానాన్ని మాలచుకోండి.
10) రాత్రి నిద్రపోయే ముందు, భగవత్సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ, ఉద్దేశపూర్వకంగా చేయని తప్పులకు పశ్చాత్తాప పడండి. వినమ్ర భావంతో క్షమాపణ వేడుకుంటూ, ఆ పొరపాట్లు పునరావృతం కావని ప్రార్థనాస్తితిలో తీర్మానించుకోండి.
పై దశనియమాలను పాటించడానికి ప్రయత్నిస్తూ జీవించినప్పుడు సౌశీల్య నిర్మాణం అప్రయత్నంగా జరుగుతుంది; ప్రవర్తనలో మార్పులు సంభవిస్తాయి. ఈ నియమాలను అనుసరిస్తూ, నిర్దేశించిన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేసుకుంటూ జీవించే విధానమే సహజ మార్గ జీవన విధానం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి