శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్
శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున్నాయి. ప్రకంపనాన్నే వైబ్రేషన్ అంటారు, ఆంగ్లంలో. నిజానికి పరిశీలిస్తే పదం అన్నా, ధ్వని అన్నా, నాదం అన్నా అన్నీ ప్రకంపనలే. స్థూల ప్రకంపనాన్ని పదం అని గాని, ధ్వని అని గాని అనవచ్చు; నాదం అంటే సూక్ష్మ ప్రకంపనం అనవచ్చు; శబ్దం అంటే సూక్ష్మాతిసూక్ష్మ ప్రకంపనం, మూల ప్రకంపనం అని ఆధ్యాత్మిక సందర్భాలలో అర్థం చేసుకోవాలి. లాలాజీ తన గ్రంథాలలో శబ్ద యోగం గురించి ప్రస్తావిస్తారు. పూజ్య లాలాజీ తన గ్రంథాలలో వారు ఎక్కడెక్కడ శబ్దం అని ప్రయోగించారో, అక్కడ ఆ పదానికి బదులుగా ప్రాణాహుతి అని మార్చి చదువుకుంటే వారు వ్రాసిన ఆధ్యాత్మిక సూక్ష్మాలు తేలికగా అర్థం చేసుకోవచ్చునన్నారు, పూజ్య దాజీ. కాబట్టి శబ్దం అంటే ప్రాణాహుతి శక్తి అని కూడా అర్థం చేసుకోవాలి. ప్రాణాహుతి కంటే అతి సూక్ష్మ శక్తి సృష్టిలో లేదంటారు దాజీ. అందుకే దీన్ని ఆది శక్తి అని కూడా సంబోధిస్తారు వారు.
మనలను, మన చుట్టూ ఉన్న సృష్టిని పరికించి చూస్తే, విశ్వమంతా మనతో సహా అన్నీ ప్రకంపనలే, వైబ్రేషన్సే. సర్వం శబ్ద మయం. కొన్ని స్థూలమైనవి (గ్రహాలు,,, మనుషులు, వస్తువులు త్యాదివి), కొన్ని సూక్ష్మమైనవి (పరమాణువు స్థాయిలోనివి), మరికొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైనవి (వివిధ రకాల చేతనా స్థాయిలు) , చివరిగా అతి సూక్ష్మాతి సూక్ష్మ శక్తి - ప్రాణాహుతి, అనే ప్రకంపనలతో నిండి ఉంది ప్రపంచం. చివరికి చేతనం కూడా వైబ్రేషనే. ఆత్మ కూడా వైబ్రేషనే. గ్రహాలు, చెట్లు, జంతువులు అన్నీ వైబ్రేషన్లే. అంటే మనందరమూ శబ్దాలమే. ఓంకార నాదం కూడా శబ్దమే. శబ్దమే పరమ సత్యం. ఈ సత్యాన్ని, ఈ మూలశబ్దంతో అనుసంధానమై, తాదాత్మ్యం చెందిన అనుభవం ద్వారా సాక్షాత్కరించుకునే యోగమే, శబ్దయోగం. హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ యోగసాధన ఈ దృక్కోణంలో చూస్తే శబ్దయోగమే. ప్రాణాహుతి ద్వారా అన్నీ స్థాయిల్లో సాక్షాత్కారం సుగమం అయిపోతుంది. వ్యక్తిగత అనుభవమే దీనికి నిదర్శనం.
అద్భుతం.
రిప్లయితొలగించండి