31, మే 2024, శుక్రవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 24 - సహజమార్గ యాత్ర - సాంప్రదాయపరంగా వివరించే యాత్ర

 



బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 24 
సహజమార్గ యాత్ర - సాంప్రదాయపరంగా వివరించే యాత్ర 

సనాతన ఆధ్యాత్మిక వాజ్ఞ్మయం ప్రకారం మనిషి యాత్రలో 'షట్' చక్రాలు దాటవలసి ఉంటుంది. సంస్కృతంలో నిజానికి షట్ అంటే 6 చక్రాలు. కొన్ని సాంప్రదాయాలు ఏడవదైన సహస్రారం     అనేది చక్రం కాదంటారు. మరికొన్ని సాంప్రదాయాలు 7 చక్రాలని చెప్తారు. సహస్రారం అనేది  యాత్ర యొక్క గమ్యస్థానంగా చేపట్టారు. ఇక్కడికి చేరుకున్న తరువాత సాధకుడు భగవంతుని తత్త్వమైన సత్-చిత-ఆనంద్ స్థితిని అనుభూతి చెందుతాడని, అక్కడితో మన యాత్ర ముగుస్తుందని చెప్తూంటారు. 
పైన చిత్రంలో చూపించిన విధంగా 7 చక్రాలు, వాటి స్థానాలు గమనించవచ్చు. మొదటి 3 చక్రాలు - మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర చక్రాలు జంతువుల్లోనూ, మనుషుల్లోనూ సమానంగా ఉంటాయట. ఈ మూడు చక్రాల్లో స్థితమై ఉన్నవారు మౌలిక అవసరాలే పరమావధిగా భావిస్తూ జీవితం వెచ్చిస్తూ ఉంటారు. అనాహత చక్రం లేక హృదయ చక్రం నుండి సాధకుడి అసలు యాత్ర ప్రారంభమవుతుంది. 
ఒక్కొక్క చక్రంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక్కొక్క రకమైన చేతనం ఉంటుంది; ఆయా చక్రాలకు సంబంధించిన సిద్ధులు కూడా కలుగుతూ ఉంటాయి. గురువు లేకుండా యాత్ర కొనసాగించినప్పుడు ఈ సిద్ధుల్లో ఇరుక్కుపోయి, అదే పరమ లక్ష్యం అని భావించి యాత్ర ముందుకు సాగకపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గురువు లేకుండా ఈ యాత్ర అసాధ్యం. 
సహజ మార్గ పథంలో ఆ ప్రమాదం లేదు, ఎందుకంటే ఇక్కడ సాధకుడిని సిద్ధుల్లో ఇరుక్కుపోకుండా అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. అందుకే దాజీ సిద్ధులు కావాలనుకుంటే సహజ మార్గం మీకు కాదని స్పష్టంగా చెప్పారు. సహజ మార్గ పథంలో యాత్ర హృదయ చక్రం లేక అనాహత చక్రం నుండి ప్రారంభమవుతుంది. అంటే అనాహత  చక్రం వరకూ ప్రయాణించినవారు సహజ మార్గానికి ఆకర్షితులవుతారు. ఈ పథంలో అనాహత చక్రాన్ని నాలుగు చక్రాలుగా చెప్తారు - 1, 2, 3, 4 బిందువులు ఇందులో ఉంటాయి. 5 వది విశుద్ధ చక్రం. ఈ 5 బిందువులు కలిపి హృదయ క్షేత్రం అంటారు. ఇది ద్వంద్వాల ప్రపంచం; సాధకుడు ద్వంద్వాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, ఈ క్షేత్రాన్ని దాటే వరకూ మోక్షం సిద్ధించదు. అన్నిటి కంటే కష్టతరమైన యాత్ర ఈ క్షేత్రంలోనే జరుగుతుంది; ఇక్కడ గురువుపై ఆధారపడటం చాలా అవసరం. ఇక్కడే కాదు, ప్రారంభించినప్పటి నుండి చిట్టచివరి గమ్యస్థానం వరకూ గురువుపై ఆధారపడటం తప్పదు. సూక్ష్మ స్థితుల్లోకి వెళ్ళినకొద్దీ గురువు సహాయం పెరుగుతూ ఉంటుంది. 




బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 23 - సహజమార్గ యాత్ర - చక్రాలు/బిందువులు/గ్రంథులు

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 23 
సహజమార్గ యాత్ర - చక్రాలు/బిందువులు/గ్రంథులు 

బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథంలో 13 చక్రాలు లేక బిందువులు లేక గ్రంథులు ఉన్నాయి. ఈ మూడు పదాలూ ఒకే వస్తువును సూచిస్తాయి. ఈ 13 బిందువులను ప్రధానంగా 3 క్షేత్రాలుగా విభజించారు - హృదయ క్షేత్రం, మనో క్షేత్రం, కేంద్ర క్షేత్రం అని మూడు క్షేత్రాలు. మొదటి 5 బిందువులు హృదయ క్షేత్రంలోకి వస్తాయి; 6 నుండి 12 బిందువులు మనో క్షేత్రంలోకి వస్తాయి; 13 వ బిందువు కేంద్ర క్షేత్రంలోకి వస్తుంది. ఇవి గాక 10 కి, 11 కి మధ్య సహస్ర దళ్ కమల్ (sdk) అని ఒక స్థానం ఉంటుంది. ఈ 13 బిందువులే గాక ఇంకా అనేక బిందువులు, ఉపబిందువులు, ఉన్నాయి వారి ఆవిష్కరణ ప్రకారం. కేంద్ర బిందువుతో సహాయ మొత్తం 65 బిందువులును ఆవిష్కరించడం జరిగింది బాబూజీ. ఇక బిందువుకు బిందువుకూ మధ్య అసంఖ్యాకమైన బిందువులు ఇంకా ఉన్నాయంటారు దాజీ. ప్రధానంగా మనం 13 బిందువులను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ బిందువుల స్థానాన్ని సూచిస్తున్న ఈ క్రింది చిత్రం గమనించగలరు. 



30, మే 2024, గురువారం

బాబూజీ దోమలగుడా యోగాశ్రమం ప్రారంభించి 57 సంవత్సరాలు

 
బాబూజీ దోమలగుడా యోగాశ్రమం ప్రారంభించి 
57 సంవత్సరాలు 



పరమపూజ్య బాబూజీ మహారాజ్ 28.5.1967 న మానవాళి సేవకై ప్రారంభించిన దోమలగుడా ఆశ్రమం, ఇప్పటికి 57 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, దోమలగుడా  ఆశ్రమ బృందం 28.5.2024 న ప్రత్యేకమైన కృతజ్ఞతతో, సుమారు 300 అభ్యాసులు ఇక్కడ సమావేశమై సత్సంగంలో పాల్గొన్నారు. 



ఆ తరువాత సమావేశమైన అభ్యాసులందరూ ఒక కుటుంబ సమావేశంలా కూర్చొని, బాబూజీతోనూ, దోమలగుడా ఆశ్రమంతోనూ తమకున్న అనుభవాలను, అనుబంధాన్ని అందరితో పంచుకోవడం జరిగింది. వాతావరణం అంతా ఆత్మీయతతోనూ, ప్రేమతోనూ, పవిత్రతతోనూ, ప్రశాంతంగానూ, తేలికగానూ ఉండటం ప్రతి ఒక్కరూ అనుభూతి చెందడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఈ యోగాశ్రమం ద్వారా జరిగే సంస్థ కార్యకలాపాలు ఎలా ఉండాలి, యే విధంగా ముందుకు సాగాలి అన్న అంశాలపై విస్తృత చర్చ కూడా జరిగింది. 

ఆ తరువాత అందరూ భోజనం చేసి నిష్క్రమించడం జరిగింది. అందరి ముఖాల్లో ఆనందం, ఒక కొత్త వెలుగును గమనించడం జరిగింది. 
హైదరాబాదు ఆధ్యాత్మికంగా ఒక ధన్యమైన నగరం. పరమ పూజ్య బాబూజీ, చారీజీ పలుమార్లు విచ్చేసిన నగరం. దాజీ ఇక్కడే నివాసం ఉండటం ధన్యతలో పరాకాష్ఠ. అంటే కాదు, బాబూజీ, చారీజీ, దాజీలు, ముగ్గురూ తలొక ఆశ్రమ నిర్మాణం ఇక్కడ హైదరాబాదులో చేయడం జరిగింది. ప్రపంచంలో మరెక్కడా, యే నాగరంలోనూ ఇలా నిర్మించడం జరగలేదు. హదరాబాదు అభ్యాసులపై మహత్తరమైన బాధ్యతలనుమచ్చారు మన మాస్టర్లు. ఆ బాధ్యతలకు తగ్గట్టుగా మానందరమూ జీవించాలని, గురుపరంపర మెప్పు పొందే దిశలో మన జీవితాలుండాలని ప్రార్థిస్తున్నాను. 

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 22 - సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 22 

సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?


పరమ పూజ్య బాబుజీ ఆవిష్కరించిన సహజమార్గ యాత్ర ప్రకారం, ఆధ్యాత్మిక యాత్ర అంటే  13 బిందువుల గుండా ఆత్మ చేసే ప్రయాణం. ఈ బిందువులను, చక్రాలని, గ్రంథులనీ కూడా అంటారు. 

ఆత్మ కదులుతుందా? కదలదు. మరేం కదులుతుంది? ఇక్కడ, ఆత్మ అంటే ఆత్మ వ్యక్తమయ్యే మాధ్యమం, దాన్నే చేతన అని, చైతన్యమని అంటారు. ఆత్మ, చైతన్యం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ చేతన లేక చైతన్యం పూర్తిగా పరిశుద్ధ చైతన్యంగా మారే వరకూ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. అప్పటి వరకూ ఆత్మ పరితపిస్తూనే ఉంటుంది. జీవులను నడిపేది ఈ పరితపిస్తున్న ఆత్మే. ఆత్మ దేని కోసం తపిస్తున్నదో అది పరమాత్మ. ఆ పరమాత్మతో కలయిక జరిగే వరకూ, లయమయ్యేవరకూ ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. దీన్నే యోగం అంటారు. 

ఈ యోగ సిద్ధి కలగడానికి ప్రధానంగా మూడు మార్గాలు - కర్మయోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం. కానీ ప్రతీ యోగమూ , మూడు యోగాలతోనూ కూడుకుని ఉంటుంది. ఏ యోగం ప్రబలంగా ఉంటే ఆ వ్యక్తిని ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు. ఉదాహరణకు, మనిషిలో భక్తి ఎక్కువగా ఉంటే అతను భక్తియోగాన్ని అనుసరిస్తున్నాడనవచ్చు; అలాగే జ్ఞానం ప్రబలంగా ఉంటే జ్ఞాన యోగి అని, అలాగే కర్మ ద్వారా దైవాన్ని సాధించాలనుకున్నవాడిని కర్మయోగి అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కానీ ముగ్గురూ మూడు యోగాలను అనుసరించవలసినదే. ఈ మూడిటికీ అతీతమైనది రాజయోగం అంటే మనసుతో యోగాన్ని సిద్ధింపజేసుకోవడం. దీన్ని కొందరు మనోయోగం అని కూడా అంటారు. అటువంటి రాజయోగ పద్ధతే మన ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గ పద్ధతి. మనసుతో చేసే యోగం. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల కలయిక ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గం.


28, మే 2024, మంగళవారం

బాబూజీ ప్రారంభించిన దోమలగుడా యోగాశ్రమం 57 వ వార్షికోత్సవం - 28.5.2024


బాబూజీ ప్రారంభించిన 
దోమలగుడా యోగాశ్రమం  57 వ వార్షికోత్సవం 28.5.2024 

శ్రీరామ చంద్ర మిషన్ లోనే మొట్టమొదటి ఆశ్రమం 1965 లో తిరుపతిలో, పరమపూజ్య బాబూజీ  ద్వారా ప్రారంభించడం జరిగింది. 
ఇవాల్టి రోజున, అంటే 28.5.1967 న హైదరాబాదులోని దోమలగూడా ప్రాంతంలో శ్రీరామ చంద్ర మిషన్ లోనే 2 వ ఆశ్రమాన్ని తన స్వహస్తాలతో ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత సత్సంగాన్ని నిర్వహించి, ప్రారంభోత్సవ సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి యోగాశ్రమం అని పేరు పెట్టడం జరిగింది. 1971 లో మన ఆశ్రమం ఉన్న వీధికి శ్రీరామ చంద్ర మిషన్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. అంతకు ముందే బాబూజీ ఆ వీధికి ఆ పేరుంటే బాగుంటుందనుకున్నారట.  వారి వాక్కు ఫలించగానే బాబూజీ ఎంతో సంతోషించారట. 
మన గురుపరంపరలోని నలుగురు మాస్టర్లలో ఆదిగురువులు లాలాజీ గారు తప్ప మిగిలినవారందరూ - బాబూజీ, చారీజీ, దాజీ - ఈ ఆశ్రమాన్ని చాలా సార్లు సందర్శించినవారే. సత్సంగాలు నిర్వహించి, ప్రశంగాలిచ్చి అనేకమంది జీవితాలను ఉద్ధరించడం కొనసాగుతూనే ఉంది. 
అంతే కాదు, పూజ్య చారీజీని బాబూజీ వారసునిగా డిశంబరు 1983 లో ప్రకటించినది కూడా ఈ ఆశ్రమంలోనే. 
మరొక్క గొప్ప సంఘటన, హైదరాబాదు శివార్లలో ఉన్న మన ఆశ్రమానికి "కాన్హాశాంతి వనం" అని పూజ్య చారీజీ నామకరణం చేసినది కూడా ఈ ఆశ్రమంలోనే. 
ఈ ఆశ్రమం ఎంతో మంది అభ్యాసులకు పుట్టినిల్లు. ఇక్కడ నుండి అనేక మంది అభ్యాసులు అంకితభావం గల వలంటీర్లుగానూ, మంచి అభ్యాసులుగానూ, భక్తులుగానూ, మాస్తారుగారికి ప్రేమికులుగానూ, తీర్చి దిద్దబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా  ఎంతో మంది మన సంస్థకు వివిధ సామర్థ్యాలతో సేవాలనందిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

మానవాళికి ఇంటింటా ప్రాణాహుతితో కూడిన ధ్యానాన్ని, సహాజమార్గం ద్వారా అందించే ప్రయత్నంలో దోమలగూడా యోగాఆశ్రమం 57 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. చారీజీ మన ఆశ్రమాలను కాంతి-కేంద్రాలనేవారు. ఈ కాంతి-కేంద్రం ఇంకా ఎంతో మందికి వెలుగును ప్రసరిస్తూ బాబూజీ దివ్యప్రణాళికలో అనంతంగా సేవాలనందించుగాక. 
ఈ ఆశ్రమంలో ఈరోజున హైదరాబాదులోని ఈ ఆశ్రమంతో అనుబంధం ఉన్న అభ్యాసులందరూ కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాబూజీ పట్ల కృతజ్ఞతా పూర్వకంగా ఉంటూ వారిని స్మరణలో గడపడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ కలిసి ధ్యానం చేసుకుని, తమ-తమ అనుభవాలను పునర్జీవిస్తూ, సూక్ష్మ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించుకుని ఆనందంలో గడపాలనుకుంటున్నారు. అట్లే జరుగుగాక!



 

23, మే 2024, గురువారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 21 - సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?

 



బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 21 
సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?


ఆత్మ కదులుతుందా? ప్రయాణిస్తుందా? అసలు ఈ యాత్ర అంటే ఏమిటి? నిజంగా యాత్ర జరుగుతుందా? అస్తిత్వానికి సంబంధించిన ఇటువంటి ప్రశ్నలు ప్రతీ ఆత్మకు కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు మన సహజ మార్గ పద్ధతిలో మన మాస్టర్ల ద్వారా అనేక సందర్భాలలో వెల్లడి చేయడం జరిగింది. వీటిని మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఆత్మ అనేది శుద్ధ చైతన్యం, ఒక ఉనికి, ఆత్మలో వికాసం చెందడానికి యేమీ లేదంటారు. ఇందులో మార్పు చెందవలసినదేదీ లేదంటారు. భౌతిక శరీరంలో అంటే స్థూల శరీరంలో, మార్పులు సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాని దీనికి పరిమితులున్నాయి; శరీరానికి వయసు మీరుతుందే తప్ప పెద్దగా వికాసం యేదీ జరగదు. ఇక కారణ శరీరంలో మార్పులు వచ్చే అవకాశమే లేదని ఇంతకు మూడే చెప్పుకున్నాం. ఇక మిగిలినది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ప్రధానంగా మనసు, బుద్ధి, అహం, చిత్తం. మన ఈ శరీర వ్యవస్థలో మార్పులు చెందేవి ఈ సూక్ష్మ శరీరాలే. సూక్ష్మ శరీర వికాసానికి అసలు ఎటువంటి పరిమితులు లేవు. దీన్నే ఆధ్యాత్మిక వికాసం అంటారు. 

ఆత్మ అభివ్యక్తమయ్యేది  సూక్ష్మ శరీరం ద్వారా. సూక్ష్మ శరీరం అభివ్యక్తమయ్యేది స్థూల శరీరం ద్వారా. 

పుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించేది, మరణించినప్పుడు శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయేది ఆత్మ. కానీ శరీరం విడిచి వెళ్ళేది కేవలం ఆత్మ మాత్రమే కాదు; దానితోపాటు సూక్ష్మ శరీరం కూడా వెళ్ళిపోతుంది; స్థూల శరీరం భూమ్మీద మిగిలిపోతుంది.  సూక్ష్మ శరీరం పరిశుద్ధంగా తయారయ్యే వరకూ, ఆత్మ మరల-మరల జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీర శుద్ధి జరగడం కోసమే, మనిషి జన్మ తీసుకున్నది. ఇక్కడ కర్మ సిద్ధాంతాల పాత్ర కనిపిస్తుంది. సూక్ష్మ శరీర శుద్ధి జరిగినంత మేరకు, దానిని బట్టి మరుజన్మ లభిస్తూ ఉంటుంది. 

ఈ ఆత్మను భగవంతునిలో ఒక అంశగా చెప్తారు. అందుకే ఆత్మను నీటి బొట్టని, భగవంతుడు మహాసముద్రమనీ కబీర్ అభివర్ణిస్తారు. ఈ నీటి చుక్క మహాసముద్రంలో కలిసిపోయి ఒకటవడమే యోగం. ఈ నీటి చుక్క సముద్రంలోనిదే కాబట్టి ఒకటవడానికి పరితపిస్తూ ఉంటుంది. 

నిజానికి నీటి చుక్క, మహాసముద్రంలో భాగమైనప్పుడు రెండూ వేర్వేరుగా ఉండే అవకాశమే లేదు. కానీ నీటి చుక్క విడిపోయిన భ్రమలో ఉంటుందట. ఆ భ్రమను తొలగించడమే ఆధ్యాత్మిక యాత్ర యొక్క లక్ష్యం, ప్రయోజనం. 

కానీ మనం ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నీటి చుక్క, నీటి చుక్కగా ఉంటే మహాసముద్రంలో తేలికగా ఒక్కటైపోతుంది. అంటే సముద్ర లక్షణాలన్నీ అన్నీ విధాలా నీటి చుక్కలో ఉంటేనే ఒక్కటవుతుంది. అదే నూనె చుక్క మహాసముద్రంలో పడిందనుకోండి. ఎప్పటికైనా మహాసముద్రంలో కలుస్తుందా? ఎప్పటికీ. కలవదు. నీటి చుక్క మహాసముద్రంలోనే ఉన్నా సముద్రంతో ఎటువంటి సంబంధమూ లేకుండా కొనసాగుతూ ఉంటుంది. ఇంతకంటే విషాదకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. నూనె చుక్కలో ఉండే ఆ జిడ్డుతనమే సముద్రంలో కలవనీయదు. మన ఆత్మ విషయంలో ఆ జిడ్డు అంటే ఏమిటి? కోరికలు, సంస్కారాలు, అహంకారము. ఇవే ఆత్మను భగవంతునితో ఐక్యం కానివ్వకుండా చేస్తున్నది. వీటిని సంపూర్ణంగా తొలగించుకున్న తక్షణమే ఆత్మ పరమాత్మలో సంపూర్ణ ఐక్యం పొందుతుంది;  ఇదే సహజ మార్గ పరమ లక్ష్యం; ఈ లక్ష్యాన్ని బాబూజీ తన దశ నియమాల్లో కూడా చెప్పడం జరిగింది. 

భగవంతునితో విడిగా ఉన్నామన్నది  భ్రమ మాత్రమేనని, ఆ భ్రమ ఈ సహజమార్గ జీవన విధానం ద్వారా తొలగిపోతుందంటారు దాజీ. అదే యోగం. ఇదే ఆధ్యాత్మిక యాత్ర పరమగమ్యం. అందరూ ఆ బాటలో ముందుకు సాగుదురుగాక! 

21, మే 2024, మంగళవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 20 - సహజమార్గ యాత్ర - యోగము

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 20 
సహజమార్గ యాత్ర - యోగము 

యోగానికి అనేక నిర్వచనాలు మన శాస్త్రాలలో కనిపిస్తాయి. యోగ అంటే సరళమైన అర్థం కలయిక. ఆత్మ పరమాత్మలో   ఐక్యమవడం; వ్యక్తిగత చైతన్యం విశ్వ చైతన్యంలో లయమవడం ఇలా. కొన్ని నిర్వచనాలను పరికిద్దాం:
యుజ్యతే ఇతి యోగః 
యోగః చిత్త వృత్తి నిరోధః 
యోగః కర్మసు కౌశలం 
యోగ్యస్థః కురు కర్మాణి 

1)     యోగం అంటే ఏమిటి?

    యుజ్యతే ఇతి యోగః – కలయికే యోగం అంటే. రెండుగా ఉన్నవి ఒక్కటిగా మారిపోవడం; నీటి చుక్క సముద్రంలో కలిసినప్పుడు సముద్రంగా మారిపోవడం. ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడు పరమాత్మగా మారిపోవడం.

2)    ఈ యోగాన్ని సాధించడం ఎలా?

    యోగః చిత్తవృత్తి నిరోధః – చిత్తంలోని అనేక రకాల వృత్తులను, అనేక రకాల తత్త్వాలను నిరోధించడమే యోగం. చిత్తం అంటే చైతన్యం; చైతన్యం అనేది ప్రధాన నాలుగు సూక్ష్మశరీరాల్లో ఒకటి; కాని ఇందులోనే మనసు, బుద్ధి, అహంకారం అనే మూడు ఇతర సూక్ష్మశరీరాలుంటాయి. వీటన్నిటినీ శుద్ధి చేస్తే చిత్తశుద్ధి తనంతతానుగా జరుగుతుంది.

3)    యోగం సాధిస్తే ఏమిటి ప్రయోజనం?

    యోగః కర్మసు కౌశలం – యోగసాధన వల్ల మనం చేసే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది, కుశలత పెరుగుతుంది, పనితనం పెరుగుతుంది. పనితనం పెరగడం వల్ల అమోఘమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది; చేసిన పని సార్థకమవుతుంది; జీవితమే సార్థకమవుతుంది.

4)    మనం చేసే పనులు ఏ విధంగా చెయ్యాలి?

    యోగస్థః కురు కర్మాణి – యోగసాధన వల్ల కలిగిన యోగస్థితిలో ఉంటూ కర్మలు చేసినప్పుడు సంస్కారాలు/వాసనలు అంటవు. ఏ పనీ మోహంతో చేయడం ఉండదు. యోగస్థితి మనిషికి కనిపించని కవచంలా  పని చేస్తుంది; ఈ విధంగా జీవితం కొనసాగినప్పుడు, జన్మరాహిత్యం లేక మోక్షం అనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితి, ఆ తరువాత ఆత్మసాక్షాత్కారం అనే అత్యున్నత ఆద్యాత్మిక స్థితి అనుభవంలోకి వస్తాయి.

కాబట్టి యోగసాధన ప్రతి ఒక్కరికీ అనివార్యము. భూమిపై శ్రేష్ఠమైన విధంగా జీవించే జీవన విధానం ఈ యోగవిద్య మనకు నేర్పిస్తుంది. మనిషి మరింత మరింత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదిగే ఏకైక మార్గం యోగం. హార్ట్ ఫుల్ నెస్ యోగ విధానం అనేది ఇటువంటి యోగవిద్యను ఆధునిక మానవుని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యోగవిద్యనందించే రాజయోగ విధానం. అందరూ ప్రయత్నింతురుగాక!


20, మే 2024, సోమవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 19 - సహజమార్గ యాత్ర

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 19 
సహజమార్గ యాత్ర 

యాత్ర అన్నప్పుడు ఇక్కడ మనం ఆత్మ యొక్క యాత్రను గురించి ప్రస్తావిస్తున్నాం. సహజ మార్గం ప్రకారం ఆత్మ తన మూలం నుండి విడిపోయినప్పటి నుండి, (మూలం నుండి విడిపోడానికి కారణాలు యేమైనప్పటికీ కూడాను) తిరిగి మూలానికి  చేరుకునే మార్గంలో ఉంది ఆత్మ. ఆత్మ తన మూలానికి చేరుకోడానికి పరితపిస్తూ ఉన్నది, ఆ తిరుగు ప్రయాణంలోనే ఉంది; దారిలో ఉంది. మూలం నుండి విడిపోయిన క్రమంలో భయంతోనూ, అహంతోనూ  మొదలై ఎన్నో ఎన్నెన్నో సంస్కారాలను, కోరికలనూ ఏర్పరచుకుని, పట్టుపురుగు తానే సృష్టించుకున్న పట్టులోనే ఇరుక్కుపోయినట్లు, ఆత్మ వాటిల్లో తానే  సృష్టించుకున్నదానిలోనే  ఇరుక్కుపోయి, అందులో నుండి విముక్తి కోసం పరితపిస్తూ ఉంది. ఈ విధంగా ఆత్మ తన సృష్టించుకున్నవన్నీ ఖరచు చేసే క్రమంలోనే వివిధ రకాల జన్మలు తీసుకున్న తరువాత (84 లక్షల యోనుల్లో నుండి జీవుడు ప్రయాణిస్తాడని మన శాస్రాలు కూడా చెప్తున్నాయి), ఎన్నో సార్లు జనన-మరణాలకు లోనై మానవ జన్మ తీసుకోవడం  జరుగుతుంది. ఇంత దుర్లభమైన మానవ జన్మ వచ్చిన తరువాత కూడా, తాను ఏర్పరచుకున్నకర్మలను/వాసనలను/సంస్కారాలను ఖర్చు చేయడానికి వచ్చి, బరువు తగ్గించుకోవడానికి బదులుగా, వాటిల్లోనే ఇరుక్కుపోయి, మరిన్ని సంస్కారాల బరువును పెంచుకుని ఈ లోకం నుండి నిష్క్రమిస్తూ మళ్ళీ-మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు జీవుడు. ఇలా ఆత్మ యొక్క ప్రయాణం, అంటే తన సుదీర్ఘ యాత్ర,  తన మూలాన్ని, తన అసలు గమ్యాన్ని చేరుకునే వరకూ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనం యాత్ర అన్నప్పుడు ఆత్మ యొక్క యాత్రను మొత్తంగా చూడవలసి ఉంటుంది. కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితం చేయడానికి లేదు. 
సహజ మార్గ ఆధ్యాత్మిక పథము ఈ జన్మకే కాదు, అన్ని జన్మలకు పరిష్కారం సూచిస్తున్నది. 84 లక్షల జీవరాసుల ద్వారా జరిగే ఈ ఆత్మ యొక్క ప్రయాణం, వికాసం సహజంగా, ఆటోమ్యాటిక్ గా అప్రయత్నంగానే జరుగుతుంది. అప్పుడు, మానవ జన్మ వస్తుంది. ఇక్కడ నుండి అప్రయత్నంగా యేదీ జరగదు. ఎందుకంటే మనిషికి మనసు, బుద్ధి, అహం అన్నీ పరాడించడం జరిగింది కాబట్టి. ఆత్మ వికాసం మానవ జన్మతో ఆగిపోదు. మానవ జన్మ వచ్చే వరకూ ఎన్ని లోకాల ద్వారా ప్రయాణించామో, మానవ జన్మ తరువాత కూడా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎన్నో ఊర్ధ్వ లోకాలున్నాయంటారు. కానీ ఈ ప్రయాణం జీవుడికి, లేక ఆత్మకు ఇష్టమైతేనే కొనసాగుతుంది. లేకపోతే ఇక్కడిక్కడే జీవుడి ఇష్ట ప్రకారం కొనసాగుతూ ఉంటదట. అందుచేత ఆత్మ తన పరమగమ్యాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనుగడను సాధించవలసి ఉంది. 
ఈ విధంగా చూసినప్పుడు ఆత్మ, తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందే పరమపదాన్ని చేరుకునే క్రమంలో, ఎంతో యాత్ర పూర్తి చేసుకునే ప్రవేశిస్తుంది. 

మానవ జన్మలో వివిధ యాత్రలు 
గర్భంలోకి ప్రవేశించిన తరువాత గర్భంలోనే నవమాసాల యాత్ర పూర్తి చెయ్యాలి. ప్రసవం జరిగిన తరువాత, బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే వివిధ దశల యాత్రలను పూర్తి చేయాలి; పుట్టుక నుండి మరణం వరకూ ఒక యాత్ర; విద్యాభ్యాసం ఒక యాత్ర; ఉద్యోగం ఒక యాత్ర; గృహస్థాశ్రమం ధర్మం ఒక యాత్ర; ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ చేసేది కూడా యాత్రే; ఈ యాత్రలన్నిటిల్లోనూ  అంతర్లీనంగా జరిగేదే ఆధ్యాత్మిక యాత్ర, ఆత్మ యొక్క యాత్ర; పరిణామ యాత్ర; మూలానికి చేసే తిరుగు ప్రయాణం అనే యాత్ర.  
రానున్న వ్యాసాలలో ఈ ఆధ్యాత్మిక యాత్రను గురించి మరింత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

19, మే 2024, ఆదివారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 18 - శరణాగతి, ప్రేమ, లయావస్థ


 బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 18   

శరణాగతి, ప్రేమ, లయావస్థ 


సముచితమైన భావంతో మన నిత్య సాధన కొనసాగించ్చినప్పుడు, అంటే  ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం మన దినచర్యలో  భాగమైపోయినప్పుడు, సహజమైనప్పుడు అది నిరంతర స్మరణగా పరివర్తన చెందడం ప్రారంభిస్తుంది. నిరంతర స్మరణ సాధకుడు తనను తాను మరచిపోయి, ఆ భగవంతుని స్పృహలో జీవించేలా పరిణమిస్తుంది. అదే దివ్య ప్రేమకు దారి తీస్తుంది. శరణాగతి భావం అప్రయత్నంగానే సంభవిస్తుంది. శరణాగతి ప్రయత్నిస్తే వచ్చేది కాదు. తనంతటాబయగా సంభవిస్తుంది. ప్రేమ లేనిదే శరణాగతి లేదు; శరణాగతి లేనిదే ప్రేమ లేదు; అసలు ప్రేమ అంటేనే శరణాగతి. శరణాగతి, ప్రేమ లయావస్థకు దారి తీస్తాయ. ఈ అవస్థలో కేవలం సాధకుడి అస్తిత్వం యొక్క సాక్షి భావం ఒక్కటే ఉంటుంది. నీటి చుక్క మహాసముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాజీ చెప్పినట్లుగా నీటి చుక్కే సముద్రంగా మారిపోతుంది. నిజానికి "నేను సముద్రంగా మారిపోయాను" అని చెప్పడానికి నీటి చుక్క మిగలదు. 

మహాసముద్రంగా మారిపోయిన తరువాత ఈ సాక్షి భావం కూడా కనుమరుగైపోతుందట. పూజ్య దాజీ ఇటీవలే ఇచ్చిన సందేశంలో, అయినప్పటికీ ఈ యాత్ర ఇంకా పూర్తవదంటారు. అప్పుడు వ్యక్తిగత చేతన యొక్క సాక్షి భావం పోయి, విశ్వ చేతనకు సాక్షిగా మారడం జరుగుతుంది. బహుశా అది మహాప్రళయంలో మాత్రమే అంతమవుతుంది. 

ఇంత యాత్ర ఈ జన్మలోనే శరీరం ఉండగానే ప్రాణాహుతితో కూడిన సహజ మార్గ సాధన వల్ల సాధ్యమంటారు బాబూజీ, చారీజీ, దాజీ. అవసరమైనడల్లా దారిలో అడ్డు వచ్చే కలుపుమమొక్కలన్నిటినీ ధ్వంసం చేయగలిగే దృఢసంకల్పం, శ్రద్ధాభక్తులు, నిరంతర శ్రమ (తితిక్ష) సాధకుడు అలవరచుకోవలసి ఉందంటారు. 

ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటాం, హృదయాలు తెరుస్తాం. తెరచిన హృదయం కానుక అందుకుంటుంది. కానుకను గుర్తించడం కృతజ్ఞత. కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక స్థితిని మన హృదయాలలో కలుగజేస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించినప్పుడు అది ప్రేమ దిశగా పైకి ఎగుస్తుంది. అంతరంగంలో ఉన్న ప్రేమ, పరమాత్మ పట్ల పూజ్య భావం సృష్టిస్తుంది. పూజ్యభావం మనలో పెరుగుతున్నకొద్దీ, మన హృదయం దైవకృపను ఆకర్షిస్తుంది. కృపా తరంగాలపై పయనిస్తున్న కొద్దీ, సమర్పణ భావం ప్రారంభమవుతుంది. సమర్పణభావం నిర్మలత్వాన్ని సృష్టిస్తుంది. నిర్మలత్వం వల్ల శరణాగతి ప్రారంభమవుతుంది. శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది. 

- దాజీ, స్పిరిచువల్  అనాటమీ 

17, మే 2024, శుక్రవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 17 - 'B' పాయింట్ శుద్ధీకరణ

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 17  
'బి' పాయింట్ శుద్ధీకరణ 


పాయింట్ B శుద్ధీకరణ
పాయింట్ B ఇంద్రియపరమైన కోరికలకు నిలయం. ముఖ్యంగా లైంగికపరమైన ముద్రలు ఇక్కడే ఏర్పడతాయని బాబూజీ చెప్పడం జరిగింది. ఈ యౌగిక ప్రక్రియను, రోజుకొక్కసారి మాత్రమే 5-7 నిముషాలకు మించి చేయరాదు. 
ఈ యౌగిక ప్రక్రియ ఉదయం ధ్యానానికి ముందు 5-7 నిముషాలకు మించకుండా చేసుకునే ప్రక్రియ. పాయింట్ B పై దృష్టి నిలిపి, ముందు నుండి అన్నీ మలినాలు, అశుద్ధాలు, బరువూ శరీర వ్యవస్థ నుండి బయటకు వెళ్లిపోతున్నట్లుగా భావించాలి. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూ ఉండగా, వెనుక నుండి ఆత్మ దివ్యంగా ప్రకాశిస్తున్నట్లుగా భావించండి. 

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 16 - 'A' పాయింట్ ధ్యానం

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 16 
'A' పాయింట్ ధ్యానం 



పాయింట్ A అనేది ప్రాపంచిక చింతలకు నిలయం. ప్రతి రోజూ ఒక్కసారి రాత్రి ప్రార్థనా-ధ్యానం కంటే పూర్వం 5-7 నిముషాలు చేయవలసిన ప్రక్రియ. 
విశ్వమానవ సౌభ్రాతృత్వ భావన మనలో పెంపొందడానికి మనం పాయింట్ A పై ధ్యానిస్తాం. అదే అందరిలో ఐకమత్యం రావడానికి దారి తీస్తుంది. ఈ ధ్యానాన్ని రాత్రి పడుకోబోయే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం కంటే ముందు అయిదు నుండి ఏడు నిముషాలకు మించకుండా చేయాలి. 
పురుషులకు 
పాయింట్ A పై దృష్టిని నిలిపి, ప్రపంచంలో ఉన్న స్త్రీపురుషులందరూ మీ సోదరసోదరీమణులని భావించుకోవాలి. పాయింట్ A పై ధ్యానిస్తున్నప్పుడు ఈ ఆలోచన సత్యము అన్న విశ్వాసంతో మనసును నిలపాలి. ఈ ప్రక్రియను గనుక హృదయపూర్వకంగా చేసినట్లయితే, దీని ప్రభావం వెనువెంటనే కనిపిస్తుంది. ఈ ప్రభావం శాశ్వతంగా ఉంటుంది కూడా. 
స్త్రీలకు 
దివ్య కానుకలన్నీ మీకు అందుబాటులో ఉన్నాయని భావించాలి. అలాగే ప్రపంచంలో ఉన్న స్త్రీపురుషులందరూ తమను తాము సోదరసోదరీమణులుగా భావిస్తున్నారని, మీ ఆలోచన కూడా వారి ఆలోచనతో ఏకీభవిస్తున్నట్లుగా భావించాలి. 

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 15 - నిరంతరస్మరణ

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 15
నిరంతరస్మరణ 

నిత్యసాధన పర్యవసానమే నిరంతర స్మరణ. సతత స్మరణ అని కూడా అంటారు. నిత్యసాధన అంటే ఉదయం ధ్యానం, సాయంకాలం శుద్ధీకరణ, రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థనా-ధ్యానం, దశనియమాలకనుగుణంగా  జీవించే ప్రయత్నం, సాహిత్య పఠనం, ప్రశిక్షకులతో  వ్యక్తిగత సిట్టింగులు, సామూహిక ధ్యానాలు, దైనందిన బాధ్యతలను నిర్వర్తించడం ఇత్యాదివి చేయగా చేయగా నిరంతర స్మరణ అనేది అంతరంగంలో సహజంగా అలవడుతుంది.  

నిరంతర స్మరణ అంటే యేది కాదు? 
నిరంతర స్మరణ అంటే జపం కాదు; 'మాస్టర్', 'మాస్టర్' అని మనసులో అనుకోవడం కాదు. 

నిరంతర స్మరణ అంటే ఏమిటి?
నిరంతర స్మరణ అంటే అంతరాయం లేకుండా, ఎడ తెగకుండా,  భగవత్  తత్త్వాన్ని హృదయంలో స్మరించడం. అది ఒక అలౌకికమైన అనుభూతి. 

నిరంతర స్మరణ ఎందుకు? 
మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్మరిస్తాం. అలాగే మనం ఎవరిని స్మరిస్తామో, వారిని ప్రేమించగలుగుతాం. అంటే దైవాన్ని స్మరించడం వల్ల దైవం పట్ల నిజమైన ప్రేమ సహజంగా ఏర్పడుతుంది, నిజమైన భక్తి కలుగుతుంది; ఇది శరణాగతికి దారి తీస్తుంది. శరణాగతి భగవంతునిలో సంపూర్ణ లయావస్థకు దారి తీస్తుంది. - బాబూజీ 

నిరంతర స్మరణను అలవరచుకునేందుకు ఇతర సూచనలు  
మనం యే పని చేస్తున్నా ఆ పని ఆయనే చేస్తున్నారన్న స్పృహతో చేయడానికి ప్రయత్నించాలి; ఆ పని యొక్క ఫలితాన్ని కూడా వారికే అర్పించే ప్రయత్నం చేయాలి. ఆఫీసుకు వెడుతున్నా, వంట చేస్తున్నా, చదువుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏమి చేస్తునా సరే, 'ఆయన' స్పృహలో చేయడానికి ప్రయత్నించండి - బాబూజీ 

ఆకలి వేస్తున్నప్పుడు పొట్ట ఆహారాన్ని స్మరిస్తుంది; దాహం వేసినప్పుడు గొంతు నీటిని స్మరిస్తుంది; అలాగే హృదయం తపించేది భగవంతుని కోసం. అదే నిజమైన స్మరణ.  - చారీజీ

ప్రతి రోజూ ఉదయం ధ్యానం పూర్తయిన తరువాత, ధ్యానంలో అనుభూతి చెందిన సూక్ష్మ ఆధ్యాత్మిక స్థితిని గుర్తించి, ఆస్వాదిస్తూ, ఆ స్థితి శరీర వ్యవవస్థలోని ప్రతి కణంలోనూ వ్యాపించి జీర్ణమైపోయినట్లు అనుభూతి చెందడానికి రెండు నిముషాలు వెచ్చించాలి. ఆ తరువాత రోజంతా మన దైనందిక పనులు  చేస్తుకుంటున్నప్పుడు కూడా, ఒక కన్ను మనం పొందిన స్థితిపై ఉంచి, రోజంతా కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆ ధ్యాన స్థితిలో ఎంత సేపు కొనసాగగలిగితే అంత సేపు కొనసాగండి. ఇదే నిరంతర స్మరణ అంటే. - దాజీ

నిరంతర స్మరణ గురించి బాబూజీ మరో వాక్యం 
First we forget to remember.
Then we remember to remember.
and then we remember to forget.

ముందు మనం స్మరించడం మరచిపోతాం. 
తరువాత మనం స్మరించాలని గుర్తుంచుకుంటాం. 
ఆ తరువాత మనం మరచిపోడానికి స్మరణలో ఉంటాం. 

నిరంతర స్మరణ వల్ల నిత్యజీవితంలో కలిగే కొన్ని ప్రయోజనాలు 
మనసు అటు-ఇటూ తిరగడం తగ్గుతుంది; చంచల స్వభావం తగ్గడం గమనించవచ్చు. 
సాధన చేయగా, చేయగా హృదయం స్థిరంగా కేంద్రంలో ఉండటం ప్రారంభిస్తుంది. దీన్నే మనం సెంటర్డ్ గా (Centred) ఉండటం అంటాం ఆంగ్లంలో. అటువంటి స్థితిలో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. 
నిరంతర స్మరణ సిద్ధించడం వల్ల కొత్త సంస్కారాలు ఏర్పడటం ఆగిపోయి హృదయం ఎప్పుడూ తేలికగా ఉండటం ప్రారంభిస్తుంది.
నిరంతర స్మరణ దైవం పట్ల, గురువు పట్ల మానవాళి పట్ల అకారణ ప్రేమను పుట్టిస్తుంది. ఆహాన్ని అదుపులో ఉంచుతుంది. 

నిరంతర స్మరణ విషయంలో అభ్యాసులు తరచూ చేసే పొరపాటు 
తరచూ అభ్యాసులు, "నేను ధ్యానం చేయలేకపోతున్నాను గాని నిరంతర స్మరణ చేస్తున్నాను" అని అంటూండటం మనం వింటూంటాం. ఇది పొరపాటు భావన. 
ఎందుకంటే ధ్యానం నిరంతర స్మరణకు మాతృక అంటారు మాస్టర్లు. కాబట్టి ధ్యానం లేనిదే స్మరణ లేదు. ఇది చాలా సూక్ష్మస్థాయిలో జరిగే యౌగిక ప్రక్రియ, అనుభూతి. 
నిజానికి "నేను నిరంతర స్మరణలో ఉన్నాను" అని అనే పరిస్థితి అసలు రాదు నిరంతర స్మరణలో నిజంగా ఉన్నప్పుడు. దాని ప్రభావం హృదయ లోలోతుల్లో అప్పుడప్పుడు స్ఫురించవచ్చు. 
చివరికి నిరంతర స్మరణ ప్రేమకు, శరణాగతికి దారి తీస్తేనే అది నిరంతర స్మరణ అవుతుంది. 

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...