28, జూన్ 2024, శుక్రవారం

ఆత్మ సాక్షాత్కారం - బాబూజీ

 


ఆత్మ సాక్షాత్కారం - బాబూజీ 

అభ్యాసి: ఆత్మ సాక్షాత్కార అనుభూతి ఎలా ఉంటుంది బాబూజీ? దాని అనుభవం మాకు మీరు ఇవ్వగలరా బాబూజీ?
బాబూజీ: ఎవరో ఒకసారి మా వద్దకు వచ్చి సవాలు చేయడం జరిగింది. అప్పుడు  వెంటనే ఒక్క నిమషంలోనే ఆత్మ సాక్షాత్కారంలో ఆఖరి స్థితి వరకూ అనుభవాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తరువాత నా శక్తులన్నీ వెంటనే ఉపసంహరించుకోవడం జరిగింది. ఆతని పరిస్థితి అంతకు ముందులాగే తయారయ్యింది. ఈ సంఘటన 1957 లో అనుకుంటాను జరిగింది. ఆ సమయంలో నన్ను కలవడానికి షాహాజహానుపూర్ రావడం జరిగింది. వాళ్ళల్లో ఒకరు, "ప్రాచీన కాలంలో ఋషులు, మునులు నిముషాల్లో సాక్షాత్కారం చేయించేసేవారట" అన్నాడు. "కావచ్చు, బహుశా చేయించేవారేమో. మన దగ్గర మాత్రాం సమయం పడుతుంది మరి" అన్నాను. ఇలా మాట్లాడుతూనే అతన్ని ఆత్మసాక్షాత్కారం యొక్క ఆఖరి స్థితి వరకూ తీసుకెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఈ ప్రశ్నలు అతన్ని అడిగాను:
"నీ శరీరం ఉందా?" "లేదు" అన్నాడు. 
"నీ ఆత్మ ఉందా?" అని అడిగాను. "లేదు" అన్నాడు. 
"మరేముంది?" అని అడిగాను. "యేమీ లేదు బాబూజీ" అన్నాడు. 
"ఇదే సాక్షాత్కారం యొక్క ఆఖరి స్థితి" అని చెప్పాను. 
ఆ తరువాత నా శక్తులన్నీ పూర్తిగా ఉపసంహరించుకున్నాను. అతనున్న పూర్వ స్థితికి తిరిగి వచ్చేశాడు. ఆ స్థితిని శాశ్వతంగా ఉండేట్టు చేయమని ఎంతో బ్రతిమాలాడు. "చూడు నాయనా! మేమెప్పుడూ ఎవరితోనూ వాగ్దానాలు చెయ్యం. కానీ నేను నీకు మాట ఇస్తున్నాను ఇచ్చేస్తాను, కానీ ముందు నువ్వు ఎమ్. ఎ. పూర్తి చేసిరా" అని చెప్పాను. 
అభ్యాసి: బాబూజీ అతను వస్తే ఆయనకు సాక్షాత్కార అనుభవం ఇచ్చేస్తారా? 
బాబూజీ: వాగ్దానం చేశాను కదా. తప్పక ఇస్తాను. కానీ ముందు అతను ఎం. ఎ. పూర్తి చేసి రానీ. నేను కూడా నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. 
కొంతమంది ఎలాంటి ప్రశ్నలు వేస్తారంటే వాటికి జవాబు చెప్పడం అసాధ్యమవుతుంది. ఒకవేళ జవాబు ఇస్తే అది వాళ్ళకు అర్థం కాదు. 
ఒకసారి ఒక సజ్జనుడు లాలాజీని, భగవంతుడు సృష్టిని ఎందుకని  సృష్టించాడంటారు? అని అడిగాడు. 
దానికి లాలాజీ: ఆ సమయంలో నువ్వు గాని నేను గాని లేము అక్కడ, లేకపోతే అక్కడే ఆపేసి ఉండేవాళ్ళం, అని సమాధానాం ఇచ్చారట. 
అలాగే మరొక వ్యక్తి లాలాజీని "భగవంతుడు మీద మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?" అని అడిగాడు. దానికి లాలాజీ మౌనంగా ఉండిపోయారు. కాస్సేపు తరువాత ఆ వ్యక్తి మళ్ళీ ఆ ప్రశ్నను అడిగాడు. దానికి లాలాజీ, "మీకు ఇప్పటికే సమాధానం చెప్పానని అనుకుంటున్నాను." అని అన్నారట. 
 

27, జూన్ 2024, గురువారం

బాబూజీ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రాణాహుతి ప్రసరణ

 



బాబూజీ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రాణాహుతి ప్రసరణ 

అభ్యాసి: బాబూజీ, మీరు రచించిన గ్రంథాలు ప్రాణాహుతిని ప్రసరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. 
బాబూజీ: నిజంగా ఇలాంటి అనుభవం నీకు జరిగిందా?
అభ్యాసి: అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను బాబూజీ. 
బాబూజీ: నీ అనుభవం సరైనదే. అన్నిటికంటే ఎక్కువ నేను వ్రాసిన సహజ మార్గ దశనియమాలపై వ్యాఖ్య అనే పుస్తకం నుండి ఈ అనుభూతి మీకు కలుగుతుంది.  
అభ్యాసి: అది నాకు తెలియదు కానీ మీ పుస్తకాలు చదువుతూ  ఉంటే మాత్రం  ప్రాణాహుతి ప్రసరణ ప్రారంభమైపోతుంది. 
బాబూజీ: సహజ మార్గ దశ నియమాల వ్యాఖ్య అనే పుస్తకం నుండే ప్రాణాహుతి ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా?  ఎందుకంటే ఆ పుస్తకం నేను వ్రాయలేదు కాబట్టి. 
అభ్యాసి: ఎందుకని బాబూజీ? అందులో మీ పేరే ఉంది గదా?!
బాబూజీ: విను. ఒకసారి నా గురుభాయ్ పండిత రామేశ్వర ప్రసాద్ మిశ్రా గారు మా ఇంటికి వచ్చారు. అనేక విషయాలు చర్చించిన తరువాత, మిషన్ లోని దశ నియమాలపై వ్యాఖ్యను దయచేసి వ్రాయించండి అని కోరడం జరిగింది. సోదరా, ఇది లాలాజీకి సంబంధించిన విషయం, నేనెలా వ్రాయించగలను? అన్నాను. డానికాయన మీరు కచ్చితంగా వ్రాయించగలరు అన్నాడు. సరే అయితే నాకు కొంచెం ఆలోచించడానికి సమయం కావాలన్నాను.  సరే ఎంత సమయం కావాలి? అని అడిగారు. మేము ఆరు నెలల సమయం కావాలన్నాము. వారు తన డైరీలో వ్రాసుకుని, మరికొన్ని సంభాషణల తరువాత ఇంటికి వెళ్ళడం జరిగింది. సరిగ్గా 6 నెలల తరువాత, కాగితం కాలం తీసుకుని వచ్చి, ఇప్పుడు చెప్పండి భాయ్ అన్నారు. ఏమి వ్రాయించమంటారు? అని అడిగాను. మీరే చెప్పారు గదా, ఆరు నెలల తరువాత దశ నియమాలపై వ్యాఖ్య వ్రాయిస్తామని చెప్పారు గదా? అన్నారాయన. సోదరా! నిజంగా నేను మరచిపోయాను. అస్సలు దీని గురించి ఆలోచించలేదు. "అదేమీ కుదరదు, మీరిప్పుడు వ్రాయించవలసినదే" అన్నారాయన. సరే అయితే, వ్రాయండి అన్నాను. అలా నేను చెప్తూ పోయాను, ఆయన వ్రాస్తూ వెళ్ళారు. ఈ విధంగా మూడు సిట్టింగుల్లో దశ నియమాల వ్యాఖ్య వ్రాయించడం జరిగిపోయింది. పై నుండి ఆలోచనలు వస్తూ పోయాయి, మేము చెబుతూ పోయాం; మేము కేవలం ఒక మాధ్యమంగా ఉన్నాం అంతే. దశ నియమాల వ్యాఖ్య వ్రాయడం పూర్తయిన తరువాత ఒక అనుబంధం వ్రాయాలనుకున్నాను. రెండు-మూడు వాక్యాలు అదనంగా వ్రాద్దామనుకున్నాను. కానీ ఒక్క ఆలోచన కూడా రానే లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా?

గురువుకి, ఈశ్వరుడికి తేడా ఏమిటి? - బాబూజీ

 


గురువుకి, ఈశ్వరుడికి తేడా ఏమిటి? - బాబూజీ 

అభ్యాసి: బాబూజీ, గురువుకి, ఈశ్వరుడికీ తేడా ఏమిటి? 
బాబూజీ: ఈశ్వరుడికి మనసు ఉండదు. ఆయనకు కూడా మనసు ఉండుంటే ఆయన కూడా ఈ సంస్కారాల ఉచ్చులో ఇరుక్కుపోయి ఉండేవాడు; జనన-మరణాల బంధాల్లో చిక్కుకుపోయేవాడు. 
ఈశ్వరుడు తన వంటి వాడిని మరొకరిని తయారు చేయలేడు. కానీ మనం మనలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని సృష్టించగలం. 
అభ్యాసి: బాబూజీ, అభ్యాసి చాలా పుస్తకాలు చదవాల్సి ఉంటుందా? 
బాబూజీ: నేను వ్రాసిన ఈ నాలుగు పుస్తకాలు (సత్యోదయం, సహజ మార్గ దృష్ట్యా, రాజా యోగ ప్రభావము, అనంతుని వైపు, సహజ మార్గ దశనియమాల వ్యాఖ్య) పరిపూర్ణమైనవి. వీటిని దాటి యే జ్ఞానమూ లేదు. 
అభ్యాసి: బాబూజీ అప్పుడప్పుడు ధ్యానంలో నాకు వెలుగు కనిపిస్తూ ఉంటుంది. 
బాబూజీ: యదార్థ తత్త్వం పదార్థంతో సంపర్కమైనప్పుడు ఈ వెలుతురు కనిపిస్తుంది. 
ఎవరైతే మహామాయ క్షేత్రాన్ని దాటి ఉంటారో, వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంలో మాత్రమే అద్భుతాలు చేయగలుగుతారు. అందుకే ప్రాపంచిక విషయాల అవసరం వచ్చినప్పుడు, మేము ఈ పనిని ప్రిసెప్టర్లకు అప్పగిస్తూ ఉంటాం; వాళ్ళు మహామాయ క్షేత్రానికి దిగువన ఉండటం వల్ల. 


కామం, క్రోధం, అహం - బాబూజీ

 


కామం, క్రోధం, అహం - బాబూజీ 

అభ్యాసి: బాబూజీ, కామం, క్రోధం పూర్తిగా తొలగించలేమా? 

బాబూజీ: కామం, క్రోధం, అహం, లోభం, మోహం ఈ మూడున్నాయి. వీటిల్లో లోభాన్ని, మోహాన్ని పూర్తిగా తొలగించేసుకోవచ్చు. ఎందుకంటే అవి మనిషి సృష్టించుకున్నవి కాబట్టి. కామం, క్రోధం అహంకారం - ఇవి భగవంతుడు సృష్టించినవి. వీటిని పూర్తిగా నాశనం చేయలేము. కానీ, వీటిల్లో మితం ఉండేలా చూసుకోవచ్చు. అవసరమైనప్పుడు వస్తాయి, అవసరమైన పని చేసుకుంటాయి, అవసరమైనప్పుడు వెళ్ళిపోతాయి. 

ఒకవేళ కోపాన్ని పూర్తిగా తొలగించేస్తే మనిషి నిష్క్రియకు లోనవుతాడు; యే పనీ చేయకుండా ఉండిపోతాడు. అలాగే కామాన్ని పూర్తిగా తొలగించేస్తే తెలివితేటలు, బుద్ధి కూడా పని చేయడం మానేస్తుంది. ఎందుకంటే కామానికి, క్రోధానికి మూల కేంద్రం ఒక్కటే కాబట్టి. 

మేము అయితే ఎవరినీ నపుంసకులుగా గాని, దరిద్రులుగా గాని చేయదలచుకోలేదు, కేవలం మనిషిని మనిషిగా చేయాలనుకుంటున్నాం. 

అహాన్ని నాశనం చేస్తే మనిషి మృత్యువు అక్కడికక్కడే సంభవిస్తుంది. అందుకే ఎవరికైనా మోక్షం ఇచ్చినప్పుడు, కొంత అహాన్ని అలాగే మిగల్చడం జరుగుతుంది; దాన్ని అంతిమ క్షణంలో శుభ్రం చేయడం జరుగుతుంది. 

26, జూన్ 2024, బుధవారం

బాబూజీ చెప్పిన గాడిద కథ

 


బాబూజీ చెప్పిన గాడిద కథ 

బాబూజీ ఒకసారి అభ్యాసులతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు మీ గుమ్మంలోకి కూడా చాలా మంది గాడిదలు వస్తూండవచ్చు కదా?" అని అంటే దానికి బాబూజీ, "ఆ, వస్తూ ఉంటారు కానీ వాళ్ళని మనుషులుగా మార్చి తిరిగి వెనక్కి పంపుతూ ఉంటాను" అన్నారు. ఆ తరువాత మాట్లాడుతూ "గాడిదను గాడిద అని ఎందుకంటారో మీకు తెలుసా?" అని అడిగారు. దానికి వారే సమాధానం చెప్తూ, "ఒక లక్షణం ఏమిటంటే, గాడిద తన ఇంటి దారిని మరచిపోతుంది అందుకే తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతుంది. రెండవ లక్షణం ఏమిటంటే డానిది, పచ్చదనం చూసి బాధపడుతుంది; ఎండిపోయిన భూమిని చూసి ఆనందిస్తుంది; పచ్చదనం చూసి నేనేమీ అసలు తినలేదే అనుకుంటుంది; ఎండుభూమిని చూసి మొత్తం తినేశాను అనుకుంటుంది." (నవ్వులు)

"బాబూజీ నా మనసులో అనేక ప్రశ్నలు వస్తూంటాయి"  అన్నాడు ఒక అభ్యాసి. దానికి బాబూజీ, "నాకు తెలుసు మీ మనసులో ఎందుకు అన్నీ ఆలోచనలు వస్తాయో చెప్పమంటావా?" "చెప్పండి బాబూజీ."పని చేసేదేమి లేకపోవడం వల్లే ఈ ఆలోచనలు వస్తూంటాయి. నిజానికి నేను కూడా యే పనీ చేయననుకోండి. చూశారా, ఒక దొంగ మరొక దొంగను ఎలా పట్టుకున్నాడో!" అన్నారు బాబూజీ. 

సహజ మార్గ పద్ధతి ద్వారా దివ్యదర్శనం జరుగుతుందా?

 


సహజ మార్గ పద్ధతి ద్వారా దివ్యదర్శనం జరుగుతుందా?

హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతి, ఈ ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా దైవ దర్శనం జరుగుతుందా? భగవంతుని సాక్షాత్కారం జరుగుతుందా అనేది సాధకుల్లో అంతర్లీనంగా తొణికిసలాడే ప్రశ్న. 

ఒక్క మాటలో చెప్పాలంటే  ఆ దివ్య స్పర్శ యొక్క అనుభూతి కలుగుతుంది. అంతర్యామిగా ఉండే భగవంతుని ఉనికిని మొట్టమొదటి నుండే స్పర్శించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక దాహం తృప్తి పడుతుంది; తపనకు ఉపశమనం కలుగుతుంది. కొంచెం-కొంచెంగా ఈ దాహార్తి తీరుతూ ఉంటుంది. దీన్నే పూజ్య దాజీ incremmental 
experience of  the Divine  అంటారు. 

దీనికి సంకేతాలు: హృదయభారం తగ్గి తేలికగా అనిపించడం, అంతకంతకూ నిగూఢమైన ప్రశాంతత అనుభూతి చెందడం, నిశ్చలత్వాన్ని, నిశ్శబ్దాన్ని, శూన్యత్వాన్ని, అలౌకిక ఆనందాన్ని, అనుభూతి చెందడం జరుగుతుంది. 

అర్జునుడంతటి మహాపురుషుడు కూడా భగవంతుని విరాట్ స్వరూపాన్ని చూపించినప్పుడు దర్శించలేకపోయాడు; స్వస్వరూపానికి వచ్చేయమంటాడు. "హృదయమే పశ్యసి" హృదయంలో నన్ను దర్శించమని శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పినట్లు పూజ్య దాజీ తరచూ చెబుతూ ఉంటారు. అదే సహజ మార్గ ధ్యానంలో చేసే ప్రయత్నం. అందుకే సహజ మార్గ సాధకులు, వారిని గమనిస్తే ఎప్పుడూ ఆత్మసంతృప్తి కలిగి ఉన్నట్లుగా కనిపిస్తారు, ఇతరులకు సేవలనందించాలన్న తపన ప్రారంభమవుతుంది వాళ్ళల్లో.  

మతం భగవంతుడు ఉన్నాడన్న అవగాహనను కలిగిస్తుంది; ఉన్నాడన్న నమ్మకాన్నిస్తుంది; ఆధ్యాత్మికత ఆ భగవంతుని అనుభూతినిస్తుంది; కేవలం దివ్యత్వాన్ని అనుభూతి చెందడం వల్ల సంతుష్టి కలుగదు. అణువణువూ దివ్యంగా మారాలన్న సంకల్పం కలుగుతుంది. ఆ తరువాత ఆనందస్వరూపులుగా మారడం జరుగుతుంది; తుదకు అది కూడా దాటినప్పుడు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందడం జరుగుతుంది. 

ఈ ప్రక్రియ అంతా ప్రతీ అభ్యాసిలోనూ కూడా, అభ్యాసి తపన, నిబద్ధతను బట్టి కొంచెం-కొంచెంగా జరుగుతూ ఉంటుంది. కొంచెం-కొంచెంగా ఎందుకు అని అనిపిస్తుంది? కొంచెం-కొంచెంగా దైవానుభూతి కలగడమే కాదు, కొంచెం-కొంచెంగా దైవత్వానికి నిలబడే సమర్థతను కూడా ఏకకాలంలో పెంచుతూ ఉండటం జరుగుతుంది, ఈ ప్రాణాహుతితో కూడిన ధ్యానంలో. అందుకే అభ్యాసి ప్రయత్నం/సహకారం, గురువు/భగవంతుని  యొక్క కృప/అనుగ్రహం, రెండూ కలిసినప్పుడు, నీటి చుక్క మహాసముద్రంలో కలిసే, ఆత్మ పరమాత్మలో ఏకమయ్యే యోగసిద్ధి కలుగుతుంది. 

అటువంటి అద్భుతమైన ధ్యాన పద్ధతిని మానవాళికి అందించిన మన ప్రియతమ బాబూజీ మహారాజ్ కు శతకోటి వందనాలు, కృతజ్ఞతలు, ప్రేమతో కూడిన శరణాగతితో ప్రణామాలు. 

25, జూన్ 2024, మంగళవారం

ధ్యానంలో కలిగే స్థితులు - 6

 


ధ్యానంలో కలిగే స్థితులు - 6 

ఉదయం ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధారణంగా ఆ రోజు మనం చెయ్యవలసిన పనుల జాబితా మన ముందుకొస్తుంది. వీటిని గురించి తెలియకుండానే ఆలోచించడం జరుగుతూ ఉంటుంది.  హృదయంలో దివ్య వెలుగు గాకుండా మనం వీటిని గురించి ఆలోచిస్తాం. కానీ ఇలా ఆలోచించడంలో ఆ జాబితాలోని అనవసరమైన పనులేమిటో గుర్తించి అక్కడికక్కడే ఆ జాబితా లో నుండి మానసికంగానే  తొలగించేస్తాం. అప్పుడు అవసరమైన పనులు మాత్రమే ధ్యాసలో ఉంటాయి. ఆ విధంగా ఎంతో సమయం ఆదా అవడమే గాక సమయాన్ని సృష్టించుకోగలుగుతాం; అలాగే ఒత్తిడి లేకుండా పని చేయగలగడం, సమర్థవంతంగా పనిచేయగలగడం జరుగుతుంది. అలా ధ్యానం మన అమూల్యమైన సమయాన్నితగిన విధంగా వినియోగించుకునేలా చేస్తుంది. ధ్యానం సమయం ఆదా చేస్తుంది, సమయాన్ని సృష్టిస్తుంది కూడా. సమయం లేదనుకునే వారికి ఇది శుభవార్త. 
ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మనసు తేలికగా హృదయంలోని దివ్య జ్యోతిపై కేంద్రీకరించగలగడం జరుగుతుంది. ఇంతకు ముందు వ్యాసాలలో చెప్పుకున్న అనేక సూక్ష్మ స్థితులు కలగడం వల్ల మన సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతుంది. ధ్యానం మనసుకు అతీతంగా తీసుకువెళ్ళి నిగూఢమైన, తీక్ష్ణమైన  అంతరంగ స్థితులకు  దారి తీస్తుంది. సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతున్న కొద్దీ చేతనంలో సమూల మార్పులు కలుగుతాయి. చేతనంలో కలిగే సమూల మార్పుల వల్ల మనిషిలో కొంచెం-కొంచెంగా పరివర్తన కలుగుతుంది. ఇదీ మన హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యానం చేయడంలో మర్మం. మార్పులు నెమ్మదిగా వచ్చినా కచ్ఛితంగా వస్తాయి, సమూల మార్పులు కలుగుతాయి. 

ధ్యానంలో కలిగే స్థితులు - 5

 



ధ్యానంలో కలిగే స్థితులు - 5 

ధ్యానం యొక్క మూడు ప్రయోజమాలు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం: 1) మనసును క్రమశిక్షణలో పెట్టడం లేదా క్రమబద్ధం చేయడం 2) మనసుకు అతీతంగా వెళ్ళడం 3) ధ్యాన స్థితిని గుర్తించడం, అందులో రోజంతా కొనసాగడం. 
 
ధ్యానం చేస్తున్నప్పుడు దృష్టిని హృదయంపై గాక హృదయంలో ఉన్న దివ్య ఉనికిపై (Divine Presence) పై ఉండాలి. ఉనికి అంటే Presence అంటే చారీజీ మనకర్థమయ్యేలా బాగా చెప్పారు. ఒక మల్లెపూల బుట్ట ఒక గదిలో పెట్టారనుకోండి. ఆ బుట్ట అక్కడి నుండి తీసేసిన తరువాత కూడా అక్కడ మల్లెపూల గుబాళింపు మనం అనుభూతి చెందుతాం. దీన్నే ఉనికి లేక Presence  అని అంటారు. మన దృష్టిని ఈ విధంగా ఒక తైల ధారగా ఉంచడాన్నే ధారణ అంటారు. 

ఈ విధంగా భక్తిప్రపత్తులతో ఒక సాక్షిభావంతో ధ్యానంలో కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనలు రావచ్చు. దాజీ చెప్పినట్లు ధ్యానం ముందున్న స్థితి కంటే కూడా ధ్యానం తరువాత కలిగే అంతరంగ స్థితి చాలా ప్రధానం. ఈ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసమే ఆ ధ్యానం మనకు ప్రసాదించిన ధ్యాన స్థితి అని గుర్తించడం అభ్యాసం చెయ్యాలి. 

ఇలా కలిగిన ధ్యాన స్థితిపై 2-3 నిముషాలు ధ్యానం తరువాత, దృష్టి పెట్టి ఉంచగలిగినప్పుడు ఆ ధ్యాన స్థితి నిలకడగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకుని ఆ స్థితిలో మనసు రోజంతా సాధ్యమైనంత ఎక్కువ సేపు నానేలా చూడటానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మనసు విచ్చలవిడిగా, చంచలంగా సంచరించే తత్త్వం తగ్గుతుంది. అంతేగాక కొత్త ముద్రలు ఏర్పడవు. ఈ అభ్యాసం చేయగా చేయగా ఒక రోజు, రోజుకు 24 గంటలూ ఈ ధ్యాన స్థితిలో కొనసాగే పరిస్థితి ఏర్పడుతుంది. జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దీన్నే నిరంతర స్మరణ అని కూడా అంటారు. ఇది ఒక ఆధ్యాత్మిక కవచం సాధకుడికి. ఎన్నిటి నుండో సంరక్షిస్తూ ఉంటుంది. 



ధ్యానంలో కలిగే స్థితులు - 4

 


ధ్యానంలో కలిగే స్థితులు - 4 

కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కన్నా కళ్ళు మూసుకుని ఉన్నప్పుడే ఎక్కువ ఆలోచనలు వాస్తు ఉన్నట్లుగా అనిపిస్తాయి. నిజానికి కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా చాలా ఆలోచనలు వస్తూంటాయి; కానీ మన దృష్టి వాటిపై లేకపోవడం వల్ల అవి తక్కువగా ఉన్నట్లనిపిస్తాయి. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు మన దృష్టి వేరే దేబి మీద లేకపోవడం వల్ల, ఆలోచనలపైనే ఉండటం వల్ల, ఎక్కువగా ఉన్నట్లనిపిస్తుంది. 
ఈ ఆలోచనలు మన ధ్యానాన్ని భంగపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ దాజీ ఇచ్చిన గొప్ప అవగాహన మనం గుర్తుంచుకోవాలి - ముక్కు వాసన చూడటానికి, కళ్ళు చూడటానికి, చెవులు వినడానికి, ఇలా ప్రతీ అవయవానికి నిర్ధారితమైన పనిని  స్వతఃసిద్ధంగా ప్రకృతిచే ఎలాగైతే కేటాయించబడ్డదో, అలాగే మనసుకు ఆలోచించడం అనే పని కేటాయించబడ్డది. ముక్కు పని వాసన చూడటం; అలాగే మనసు పనే ఆలోచించడం. కాబట్టి మనసు యొక్క స్వభావమే, అంటే ప్రకృతే ఆలోచించడం. సహజ మార్గ ధ్యానంలో మనం ఆలోచనలని లేక మనసును నియంత్రించే ప్రయత్నం చెయ్యం; మనసును క్రమబద్ధం చేసే ప్రయత్నంలో ఉంటాం; అందుకే ధ్యానంలో ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో పోఱయడటం గాని, ఆలోచనలను ఆపే ప్రయత్నం గాని చేయవద్దని చెప్పడం జరుగుతుంది. కేవలం వాటిపై దృష్టి పెట్టకుండా ఉండే శిక్షణనివ్వడం జరుగుతుంది. ఆలోచనలకు స్వతహాగా యే శక్తీ ఉండదు. మనం దృష్టిని పెట్టడం వల్లనే ఆలోచనలకు బలం వస్తుంది. కాబట్టి మన దృష్టి పెట్టనప్పుడు వాటంతటవే నిర్వీర్యమైపోయి రాలిపోతాయి. ఇది అనుభవపూర్వకంగా ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇలా రాలిపోయినప్పుడు మనకు చక్కటి ప్రశాంతత అనుభూతి చెండుతాం; బరువు తగ్గినట్లు అనుభూతి చెండుతాం. 
కాబట్టి, ఈ అవగాహన సాధకులకు ధ్యానించడంలో ఉపయోగపడగలదు. ఎందుకంటే మనం ధ్యానిస్తున్నది ఆలోచనలు పూర్తిగా పోగొట్టఊకోడానికి కాదు, అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆలోచనలు పూర్తిగా పోయేది కేవలం మృత్యు సమయంలోనే అంటారు బాబూజీ. ఇంచుమించు ఆలోచనారహితమైన స్థితిని సాధించవచ్చు గాని అస్సలు ఆలోచనల్లేని స్థితి ఉండదు. పైగా ఒక్కసారి ఊహించండి! ధ్యానం తరువాత ఒక్క ఆలోచన కూడా లేదనుకోండి. అంటే మనసే లేదనుకోండి భూమ్మీద మనుగడ ఎలా సాధ్యం? ఆలోచన లేకుండా ఎ పనైనా చేయగలమా? ధ్యానం చేయాలన్నది కూడా ఒక ఆలోచనే కదా? కాబట్టి ఆలోచనకు ఒక నిర్దుష్టమైన ప్రయోజనం ఉందని, అది భూమ్మీద ఉన్నంత వరకూ అవసరమని మనం మనసులో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 

22, జూన్ 2024, శనివారం

పూజ్య దాజీ రాధామాతను గురించి చదివిన హిందీ కవిత

 




పూజ్య దాజీ రాధామాతను గురించి చదివిన హిందీ కవిత
జూన్ 15, 2024, రాధాకృష్ణ మందిరం, డాల్లస్ , అమెరికా 

राधे राधे 

రాధే రాధే 

कृष्ण और राधा स्वर्ग में विचरण करते हुए

స్వర్గంలో రాధాకృష్ణులు విహరిస్తూ 

अचानक एक दुसरे के सामने आ गए

అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు 

विचलित से कृष्ण- प्रसन्नचित सी राधा...

కృష్ణుడు విచలిత మనస్కుడై, రాధ ప్రసన్న చిత్తురాలై ఉంది 

कृष्ण सकपकाए, राधा मुस्काई

కృష్ణుడు తడబడ్డాడు, రాధ చిరునవ్వుతో ఉంది 

इससे पहले कृष्ण कुछ कहते

కృష్ణుడు యేదో చెప్పే ముందే 

राधा बोल उठी- "कैसे हो द्वारकाधीश ??"

రాధ, "ఎలా ఉన్నారు ద్వారకాధీశా?" అని అడిగింది 

जो राधा उन्हें कान्हा कान्हा कह के बुलाती थी

ఎప్పుడూ కాన్హా, కాన్హా అని పిలుస్తూ ఉండే రాధ 

उसके मुख से द्वारकाधीश का संबोधन कृष्ण को भीतर तक घायल कर गया

ద్వారకాధీశా అని సంభోదించడం కృష్ణుడి మనసును గాయపరచింది 

फिर भी किसी तरह अपने आप को संभाल लिया

అయినా యేదో విధంగా తనను తాను నియంత్రించుకుని 

और बोले राधा से ... "मै तो तुम्हारे लिए आज भी कान्हा हूँ

రాధతో, "నేనిప్పటికీ నీకు కాన్హానే రాధా  

तुम तो द्वारकाधीश मत कहो!

కనీసం నువ్వయినా ద్వారకాధీశా అని సంభోదించకుండా ఉంటే బాగుంటుంది కదా!   

आओ बैठते है .... कुछ मै अपनी कहता हूँ कुछ तुम 

अपनी कहो

రా కాసేపు కూర్చుందాం ... నా విశేషాలు కొన్ని, నీ విశేషాలు కొన్ని చెప్పుకుందాం  

सच कहूँ राधा जब जब भी तुम्हारी याद आती थी

నిజం చెప్పాలంటే రాధా, నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా 

इन आँखों से आँसुओं की बुँदे निकल आती थी..."

నా కళ్ళల్లో నుండి అశ్రువులు ప్రవహించేవి 

बोली राधा - "मेरे साथ ऐसा कुछ नहीं हुआ

దానికి రాధ, "నాకు అటువంటివేవీ జరగలేదు 

ना तुम्हारी याद आई ना कोई आंसू बहा

నువ్వు గుర్తు రావడం గాని కన్నీరు కార్చడం గానీ ఎప్పుడూ జరగలేదు 

क्यूंकि हम तुम्हे कभी भूले ही कहाँ थे

ఎందుకంటే నిన్ను అసలు నేను మరచిపోతే గదా 

जो तुम याद आते, इन आँखों में सदा तुम रहते थे

గుర్తు రావడానికి, సదా ఈ కళ్ళల్లోనే ఎప్పుడూ ఉన్నావు కదా  

कहीं आँसुओं के साथ निकल ना जाओ

కన్నీటితోపాటు నువ్వు కూడా ఎక్కడ వెళ్లిపోతావోనని 

इसलिए रोते भी नहीं थे

ఏడ్చేదాన్ని కూడా కాదు. 

प्रेम के अलग होने पर तुमने क्या खोया

నువ్వు నీ ప్రేమ నుండి విడిపోయినప్పుడు నువ్వు ఏమి కోల్పోయావో 

इसका इक आइना दिखाऊं आपको ?

మీకు అద్దం పట్టి చూపించమంటావా ?

कुछ कडवे सच , प्रश्न सुन पाओ तो सुनाऊ?

కొన్ని చేదు నిజాలు, ప్రశ్నలు,  నువ్వు వినగలిగితే చెప్తాను

कभी सोचा इस तरक्की में तुम कितने पिछड़ गए

నువ్వు సాధించిన ప్రగతిలో ఎంత వెనకబడిపోయావో ఆలోచించావా 

यमुना के मीठे पानी से जिंदगी शुरू की

యమునలోని తియ్యటి నీటితో నీ జీవితాన్ని ప్రారంభించావు 

और समुन्द्र के खारे पानी तक पहुच गए ?

సముద్రంలోని ఉప్పు నీటి దాకా వెళ్ళిపోయావు. 

एक ऊँगली पर चलने वाले सुदर्शन चक्र पर भरोसा कर लिया

ఒక్క వేలు మీద నడిచే సుదర్శన చక్రం మీద ఆధారపడ్డావు 

और दसों उँगलियों पर चलने वाळी बांसुरी को भूल गए ?

పది వ్రేళ్ళపై నడిచే వేణువును మరచిపోయావు. 

कान्हा जब तुम प्रेम से जुड़े थे तो ....

కాన్హా, నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు 

जो ऊँगली गोवर्धन पर्वत उठाकर लोगों को विनाश से बचाती थी

ఏ వ్రేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజల వినాశనం జరగకుండా కాపాడావో 

प्रेम से अलग होने पर वही ऊँगली क्या क्या रंग दिखाने लगी ?

ప్రేమ నుండి విడిపోయిన తరువాత అదే వ్రేలు ఎన్ని రంగులు చూపించడం ప్రారంభించిందో? 

सुदर्शन चक्र उठाकर विनाश के काम आने लगी

సుదర్శన చక్రాన్ని సంధించి,  వినాశనానికి తోడ్పడేలా చేసింది  

कान्हा और द्वारकाधीश में क्या फर्क होता है बताऊँ ?

కాన్హాకి ద్వారకాధీశుడికి గల వ్యత్యాసం ఏమిటో చెప్పమంటావా?

कान्हा होते तो तुम सुदामा के घर जाते

నువ్వు కాన్హా అయి ఉండుంటే కుచేలుడింటికి (సుదాముడు  ఇంటికి ) నువ్వే వెళ్ళి ఉండేవాడివి 

सुदामा तुम्हारे घर नहीं आता

కుచేలుడు(సుదాముడు) మీ ఇంటికి రావడం కాదు 

युद्ध में और प्रेम में यही तो फर्क होता है

యుద్ధానికి, ప్రేమకు గల తేడా ఇదే 

युद्ध में आप मिटाकर जीतते हैं

యుద్ధంలో వినాశనం చేసి గెలుస్తారు 

और प्रेम में आप मिटकर जीतते हैं

ప్రేమలో తనను తాను కోల్పోయి గెలవడం జరుగుతుంది. 

कान्हा प्रेम में डूबा हुआ आदमी दुखी तो रह सकता है

కాన్హా, ప్రేమలో మునిగియున్న వ్యక్తి దుఃఖితుడై ఉండవచ్చు 

पर किसी को दुःख नहीं देता

కానీ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వడం జరగదు 

आप तो कई कलाओं के स्वामी हो

నువ్వు ఎన్నో కళల్లో ఆరితేరిన వ్యక్తివే  

स्वप्न दूर द्रष्टा हो गीता जैसे ग्रन्थ के दाता हो

ఎన్నో స్వప్నాలు, దూరదృష్టి గలవాడివే, గీత వంటి మహాగ్రంథాన్ని అందించినవాడివే  

पर आपने क्या निर्णय किया अपनी पूरी सेना कौरवों को सौंप दी?

అయినా,  నీ  మొత్తం సేనను కౌరవులకు ఎలా అప్పగించేశావు ?

और अपने आपको पांडवों के साथ कर लिया ?

నిన్ను నువ్వు పాండవుల పక్షంలో ఉంచుకున్నావు  

सेना तो आपकी प्रजा थी राजा तो पालाक होता है उसका रक्षक होता है

నీ సేనలంటే నీ ప్రజే కదా, రాజు అంటే ప్రజను పాలించేవాడే  కదా, వాళ్ళని రక్షించేవాడే  కదా?

आप जैसा महा ज्ञानी उस रथ को चला रहा था

నీ వంటి మహాజ్ఞాని రథం నడపటం ఏమిటో  

जिस पर बैठा अर्जुन आपकी प्रजा को ही मार रहा था

దానిపై కూర్చొని అర్జునుడు నీ ప్రజలనే సంహరిస్తూ ఉంటే 

पनी प्रजा को मरते देख आपमें करूणा नहीं जगी ?

నీ  ప్రజలే నీ ముందు మరణిస్తూ ఉంటే నీలో కరుణ కలగలేదా?

क्यूंकि आप प्रेम से शून्य हो चुके थे

ఎందుకు కలగలేదంటే అప్పటికే నీలో ప్రేమ శూన్యమయిపోయింది కాబట్టి 

आज भी धरती पर जाकर देखो

భూమ్మీదకు వెళ్ళి చూడు  ఈనాటికీ కూడా 

अपनी द्वारकाधीश वाळी छवि को ढूंढते रह जाओगे

నీ ద్వారకాధీశుడి పేరు ఎక్కడుందా అని వెతుక్కోవలసి వస్తుంది 

हर घर हर मंदिर में मेरे साथ ही खड़े नजर आओगे

ప్రతీ ఇంట్లోనూ, ప్రతీ గుడిలోనూ నువ్వు నాతోనే నిలబడినట్లు   కనిపిస్తావు. 

आज भी मै मानती हूँ लोग गीता के ज्ञान की बात करते हैं

నాకు తెలుసు, ఈనాటికీ ప్రజలు నీ గీతా జ్ఞానాన్ని చర్చించుకుంటూ ఉంటారు, నిజమే  

उनके महत्व की बात करते है मगर धरती के लोग

గీతామహాత్మ్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ భూమ్మీద ప్రజలు 


युद्ध वाले द्वारकाधीश पर नहीं, i. प्रेम वाले कान्हा पर भरोसा करते हैं

యుద్ధంలో ఉన్న ద్వారకాధీశుడిని కాదు, ప్రేమతో కూడిన కాన్హాను నమ్ముతారు. 

गीता में मेरा दूर दूर तक नाम भी नहीं है,

గీతలో ఎక్కడా నా పేరు కూడా కనిపించదు 

पर आज भी लोग उसके समापन पर " राधे राधे" करते हैं 

కానీ ఈనాటికీ కూడా గీతాపఠనం ముగించినప్పుడు 

"రాధే రాధే" అనే అంటారు. 




       

 

 



ధ్యానం లో కలిగే స్థితులు - 3

 


ధ్యానం లో కలిగే స్థితులు - 3

భగవంతుడు మనిషిని సృష్టించాడు, మనిషి మతాలను సృష్టించాడు. 
- బాబూజీ 
మనందరమూ యేదొక మతంలో జన్మిస్తాం. పుట్టుకతో నిజానికి ఎవరికీ మతం ఉండదు, కులం ఉండదు, భాష ఉండదు, జాతి ఉండదు. ఆ శిశువు కేవలం భగవంతుని సృష్టి మాత్రమే. జన్మించిన మరుక్షణమే రంగు, లింగబేధంతో మొదలై, పైన అనుకున్నవన్నీ ఆ శిశువుకు మానవులు ఆపాదించేస్తూ ఉంటారు. బహుశా తప్పదేమో. ఎందుకో గాని కేవలం మానవుడికి పుట్టిన మానవుడిగా పరిగణించడం, సాక్షాత్తూ భగవంతుని సృష్టిగా భావించడం మనందరికీ ఎందుకో చాలా కష్టం. ఆ తరువాత పర్యవసానాలు జీవితం అంతా అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నవే. అందుకే మనిషి తాను చేసుకున్న సృష్టిని నాశనం చేసుకుంటే, కేవలం భగవంతుని సృష్టి మిగులుతుందని బాబూజీ చెబుతూండేవారు. దీన్నే ఆధ్యాత్మిక భాషలో వ్యక్తిగత ప్రళయం అని కూడా అంటారు. వ్యక్తిగత ప్రళయం ద్వారా భగవంతుని సృష్టి ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. 

 కాబట్టి యే ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరించినా మన కదలిక ఈ వ్యక్తిగత ప్రళయం వైపుగా కొనసాగాలి; అప్పుడే భగవంతుడు మనలను సృష్టించిన విధంగా మనలను మనం పునరుద్ధరించుకోగలుగుతాం. అటువంటి ఆధ్యాత్మిక పద్ధతే మన హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ పద్ధతి. ఇక్కడ బాబూజీ చెప్పిన వాక్యాలను లోతుగా పరిశీలించాలి. మతం దాటితే ఆధ్యాత్మికం మొదలవుతుందంటారు బాబూజీ - అంటే మతం భగవంతుడి అస్తిత్వాన్ని గురించి ఒక అస్పష్టమైన అవగాహన ఇస్తుంది, కానీ అనుభూతి ఉండదు, నమ్మకాలు తప్ప; ఆధ్యాత్మికత, అనుభూతిని ప్రసాదిస్తుంది. భగవంతుని అంతర్యామిగా అనుభూతి చెందమంటుంది; అక్కడితో ఆగరు బాబూజీ. ఆధ్యాత్మికత దాటితే అసలు తత్త్వం బోధపడుతుందంటారు; అంటే ఒక దశలో అనుభవాలు కూడా ఆగిపోతాయన్నమాట; పూజ్య దాజీ ఒక దశలో అనుభూతులంటే కూడా విసిగిపోవాలని చెప్తారు; వాటిని దాటి ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలంటారు. ఇంకా అవలేదు. ఈ సత్యానుభూతిని కూడా దాటడానికి ప్రయత్నించాలని చెప్తారు బాబూజీ. సత్యాన్ని దాటడం ఏమిటని, మన అల్ప మానవ బుద్ధికి అంతు చిక్కదు. సాధన ద్వారా, మనసు లక్షణమే మారిపోయిన తరువాత, అలా అతి సూక్ష్మంగా తయారైన మనసు ఒక సాక్షిగా మిగిలి, జరుగుతున్న యాత్రను వీక్షిస్తున్నప్పుడు తెలుస్తుందట. అలా సత్యతత్త్వాన్ని కూడా దాటితే కలిగే అలౌకిక ఆత్మానుభూతిని పరమానంద స్థితి, ఆంగ్లంలో Bliss అని అంటారు. ఇదే చిట్టచివరి గమ్యంగా భావిస్తావేమో మనం అని చెప్పి, ఈ పరమానంద స్థితిని కూడా దాటితేనే అసలు ప్రయాణం అంటారు, బాబూజీ. ఈ స్థితిని దాటితే మనం గమ్యాన్ని చేరుకున్నట్లే అంటారు, బాబూజీ. ఇక యాత్ర మన ప్రమేయం లేకుండా తనంతతానుగా అనంతంగా దేశ-కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇదీ అనంతం వైపు ప్రయాణం అంటే. ఇలా ముందుకు సాగుతున్న కొద్దీ మనిషి ఆత్మలో కలిగే పరివర్తననే చైతన్య వికాసం అని, ఆత్మ వికాసం అని, పరిణామ యాత్ర అని చెప్పుకుంటూ ఉంటాం. మరింత మరింత మెరుగైన వ్యక్తిగా తయారవడం, ఆత్మశుద్ధి జరగడం, స్వయంగా మనకు మనమే  గమనించుకోవచ్చు, బాబూజీ అనుగ్రహం వల్ల. 

20, జూన్ 2024, గురువారం

ధ్యానంలో కలిగే స్థితులు - 2

 


ధ్యానంలో కలిగే స్థితులు - 2 

ఇంతకు ముందు చెప్పినవన్నీ మనసులో ఉంచుకొని ధ్యానాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. దాజీ చెప్పిన విధంగా ధ్యానం తరువాత కలిగిన స్థితులు ప్రధానంగా గుర్తించే ప్రయత్నం చెయ్యాలి. ఆ స్థితికి ఫలానా స్థితి అని పేరు పెట్టలేకపోయినా, మాటల్లో వర్ణించలేకపోయినా హృదయం స్పష్టంగా  గుర్తిస్తుంది; దాన్ని మనసులో ఉంచుకోవాలి. అయినా సరే ఆ స్థితులను మాటల్లో పెట్టే ప్రయత్నం చేయాలి; డైరీలో వ్రాసుకోవాలి. 
సాధారణంగా ధ్యానం తరువాత ఎలా ఉందని ప్రశిక్షకుడు అడిగినప్పుడు, 'బాగుంది' అంటారు అభ్యాసులు. బాగుంది అని మొదట్లో అన్నప్పటికీ కూడా కొంచెం-కొంచెంగానైనా మాటల్లో పెట్టే ప్రయత్నం చేయాలి. 
ధ్యానం పూర్తయిన తరువాత కలిగే ధ్యాన స్థితులను నిజానికి సరిగ్గా మాటల్లో పెట్టలేకపోయినా ఈ విధంగా వర్ణిస్తూ ఉంటాం: ప్రశాంతంగా ఉంది; తేలికగా ఉంది; బరువు తగ్గినట్లుంది; నిశ్చలంగా ఉంది; ఆలోచనారహితంగా ఉంది; ప్రేమానుభూతి కలిగింది; సమర్పణ భావం కలిగింది; శూన్యత అనుభూతి కలిగింది; శరీరం లేనట్లనిపించింది; శరీరం విపరీతంగా విస్తరించినట్లనిపించింది; మత్తుగా అనిపించింది; నిద్రలోకి వెళ్ళినట్లుగా అనిపించింది; ఫలానా రంగు కనిపించింది; మునిగిపోయినట్లుంది; నిమగ్నమైనట్లనిపించింది; నన్ను నేను కోల్పోయినట్లనిపించింది; ఎక్కడున్నానో తెలియలేదు; ఇలా కొన్ని సకారాత్మక వర్ణనలుంటాయి . అలాగే ధ్యానం చేస్తున్న సమయంలో నకారాత్మకంగా అనిపించే సందర్భాలు రావచ్చు.  కొన్ని స్థితులు ఇలా ఉంటాయి: బరువుగా ఉంది; అలజడిగా ఉంది; ఆలోచనలు విపరీతంగా వచ్చాయి; గందరగోళంగా ఉంది; భయం వేసింది; అశాంతిగా ఉంది; తలబరువుగా అనిపించింది; నకారాత్మకమైన ఆలోచనలు వచ్చాయి; లైంగిక భావాలు కలిగాయి; పాత జ్ఞాపకాలు వచ్చాయి; ఇలా కొన్నితిని వర్ణించవచ్చు. 
కానీ, ప్రతీ ధ్యానం తరువాత మనశ్శాంతి, తేలికదనం వంటి సకారాత్మక స్థితులు తప్పక కలుగుతాయి. ఇంద్రధనస్సులో ప్రధానంగా ఏడు రంగులే కనిపించినా, ఈ చివరి నుండి ఆ చివరి వరకూ  జాగ్రత్తగా పరిశీలిస్తే, మనకు ప్రక్క-ప్రక్కనే ఉన్న రంగుల వివిధ పాళ్ళల్లో కలవడంతో అనేక వర్ణాలు కనిపిస్తాయి. ఒకే రంగు అయినా వివిధ ఛాయాల్లో కనిపిస్తుంది. ఒక రంగు తేలికగా, ఆ ప్రక్కడే గాఢంగా, ఆ ప్రక్కడి మరింత గాఢంగా ఇలా గాఢత్వంలో తేడాలు కనిపిస్తాయి. అలాగే ధ్యానం తరువాత కలిగే స్థితుల్లో కూడా, ఉదాహరణకు లీనమైపోయినట్లనిపించిందనుకోండి; ఒకసారి దీని తీక్ష్ణత మామూలుగాను, కొన్ని సార్లు అదే స్థితి మరింత గాఢంగా మరింతగా లీనమైపోయినట్లుగానూ అనిపిస్తుంది. ఇలా ప్రతీ అంతరంగ స్థితికి వర్తిస్తుంది. 
ఈ అంతరంగ స్థితి మరింత సూక్ష్మంగా రోజు-రోజుకీ మారుతున్నప్పుడు మనసు క్రమక్రమంగా క్రమబద్ధం అవడం, ఆలోచనలు తగ్గడం, స్పష్టంగా ఆలోచించడం, వంటి మార్పులు సంభవిస్తాయి. ఫలితంగా మన ఆలోచనల్లో, అలవాట్లలో, ప్రవర్తనలో మార్పులు రావడం వల్ల శీలంలోనే పరివర్తన కలుగుతుంది; తత్ఫలితంగా మన ప్రారబ్ధంలోనే  మార్పులు కలిగే అవకాశం ఉంది. 
ఈ విధంగా మన సూక్ష్మ శరీరాల శుద్ధి జరిగి, పరిణతి జరుగుతుంది; దీన్నే ఆత్మవికాసం అంటారు. ఈ ఆత్మవికాసానికి అంతు అంటూ ఉండదు. స్థూలం నుండి సూక్ష్మం; సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మం ఇలా మన యాత్ర కొనసాగుతూ ఉంటుంది. మన చైతన్య వికాసం జరుగుతూ ఉంటుంది. మనుషులు మరింత మరింత మెరుగైన వ్యక్తులుగా మారే అవకాశం ఉంది ఈ సాధన వల్ల. 

19, జూన్ 2024, బుధవారం

ధ్యానం లో కలిగే స్థితులు


ధ్యానం లో కలిగే  స్థితులు 

ధ్యానం ప్రారంభించిన ప్రతీ అభ్యాసి, మొట్టమొదటి ధ్యానం నుండే యేవేవో స్థితులను ఆశిస్తూ ఉంటాడు. అప్పటికే మనసు నిండా చిన్నప్పటి నుండి కలిగిన అనుభవాల వల్ల, పెరిగిన వాతావరణం వల్ల, చదువుకున్న గ్రంథాల వల్ల, విన్న ప్రవచనాల వల్ల, అప్పటికే యేదో తెలిసిపోయిన స్థితిలో ఉండి, అస్పష్టంగానైనా యేదో ఆశిస్తూ ఉంటాడు. ధ్యానం అంటే స్పష్టమైన అవగాహన లేక ఈ భావాలుంటాయి; భగవంతుడు దర్శనం ఇస్తాడనో, యేవో ప్రకంపనలు కలుగుతాయనో, యేదో వెలుగు కనిపించాలనో, మహాత్ముల దర్శనం కలుగుతుందనో, లేక భవిష్యత్తులో జరుగవలసినవి ముందే తెలిసిపోతాయనో, యేవో అద్భుతాలు జరుగుతాయనో చాలా ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. అసలు తుడిచేసిన పలకలాంటి హృదయంతో యేవీ ఆశించకుండా ఉండే ఖాళీ హృదయంతో కూర్చొనేవాళ్ళు చాలా అరుదు; ఈ విధంగా ధ్యానించగలిగితే, వాళ్ళు ధన్యులు. 
అయితే పైన చెప్పినవేవీ జరగవా? ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో? తప్పక జరిగే అవకాశం ఉంది, కానీ చాలా ముందుకు సాగిన తరువాత, గణనీయమైన పురోగతి సాధించిన తరువాత  అవకాశం ఉంటుంది. 
మరేం జరుగుతుంది హార్ట్ఫుల్నెస్ ధ్యానం తరువాత? ధ్యానం చేసిన ప్రతీసారీ తప్పక మనశ్శాంతి, తేలికదనం అనుభూతి చెండుతాం. హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు ధ్యాన సమయంలో యేమి జరిగిందీ అన్నాదాని కంటే కూడా, ధ్యానం తరువాత కలిగే అనుభూతిని గుర్తించమంటారు. ఆ స్థితినే రోజంతా స్మరించుకునే ప్రయత్నంలో ఉండమాటారు; దాన్నే ఎ. ఇ. ఐ. ఒ. యు. ప్రక్రియగా పూజ్య దాజీ మనకు నేర్పడం జరిగింది. 
కొన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవలసినవి 
ఒకటి. మంచి ధ్యానం, చెడు ధ్యానం అంటూ యేదీ ఉండదు. నిజానికి మనకు బాగోలేదనిపించిన ధ్యానం చాలా మంచి ధ్యానం కావచ్చు. ఎందుకంటే ప్రతీ ధ్యానం ఆత్మ వికాసంలో ఒక్కొక్క మెట్టుగా భావించాలి. మనం నిర్మించుకుంటున్న ఆధ్యాత్మిక సౌధంలో ఒక్కొక్క ధ్యానం ఇటుకరాయిగా భావించుకోవాలి. 
 "ధ్యానంలో యేమి జరిగినా అది మన మంచికే" - బాబూజీ. 
రెండు. ధ్యానం అనేది ఒక ప్రయాణం. ఒక యాత్ర. వివిధ రకాల చేతనల ద్వారా జరిగే యాత్ర. ప్రతీ ధ్యానం కొత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ఒకేలా ఉందీ అంటే మన ఎక్కడో ఇరుక్కుపోయామని తెలుసుకోవాలి, వెంటనే ప్రశిక్షకుని వద్దకు వెళ్ళి సిట్టింగు తీసుకోవాలి. మనకు కలిగిన అనుభూతి పట్ల మక్కువ మమకారం ఏర్పడటం వల్ల ఇలా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అందుకే డైరీలో వ్రాసుకొని మరచి పొమ్మంటారు, మన మాస్టర్లు. 
మూడు: ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం చంచలంగా ఉండే మనసును క్రమబద్ధీకరించడం, క్రమశిక్షణలో పెట్టడం - అని మరచిపోకూడదు.  
నాలుగు. ప్రతీ ఉదయం ధ్యానంలో, ఒక ప్రత్యేకమైన ధ్యాన స్థితిని ప్రసాదించడం జరుగుతుందని పూజ్య దాజీ చెబుతూ ఉంటారు. దాన్ని గుర్తించి, రోజంతా ఆ స్మరణలో ఉండటం వల్ల మనకు కొత్త సంస్కారాలు అంటే అవకాశం ఉండదు; మనసు ఊరికే అటు-ఇటూ సంచరించడం తగ్గుతుంది కూడా. ఒక రోజు, అంటే  రోజుకు 24 గంటలు, గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకన్లు స్మరణలో ఉండే అవకాశం వస్తుంది. దీన్ని నిరంతర స్మరణ అంటారు దాజీ. జాగృత, స్వప్న, సుషుప్తి - ఈ మూడు అవస్థల్లో కూడా ఈ స్మరణ కొనసాగినప్పుడు, దాన్ని నిరంతర స్మరణ అంటారు. దీన్నే బాబూజీ కాన్ స్టెంట్  ఛార్జింగ్ అంటారు. ఇటువంటి నిరంతర స్మరణ ప్రేమకు దారి తీస్తుంది; ఆ ప్రేమ శరణాగతికి దారి తీస్తుంది; శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది. 



 

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...