24, ఆగస్టు 2023, గురువారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - గీతాచార్యుడు

 


భగవద్గీత - గీతాచార్యుడు 

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 

తత్ర శ్రీరవిజయో భూతిః ధృవా నీతర్మతిర్మమ || 


అర్థం 

ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనస్సును ధరించిన పార్థుడు ఉంటారో, అక్కడ తప్పక విజయం, నీతి ఉంటాయి అని అర్థం. శ్రీకృష్ణుడు అనుగ్రహానికి ప్రతీక; పార్థుడు మానవ ప్రయత్నానికి ప్రతీక. మానవ ప్రయత్నం, భగవంతుని కృప, ఈ  రెండూ ఉన్నచోట తప్పక విజయం ఉంటుంది. 


శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీత రూపంలో భారతీయ జన మానసంలో, అందరిలోనూ ఇక్కడ పుట్టిన అందరిలోనూ, చదువుకున్నవారైనా, చదువుకోనివారైనా, పామరులైనా, పండితులైనా, అక్షరాస్యులయినా, నిరక్షరాస్యులైనా, ఏ మతానికి చెందినవారైనా, ప్రతి ఒక్కరిలోనూ గీత వారి జీవితాల్లో యేదో విధంగా దర్శనమిస్తుంది. ఉదాహరణకు అందరిలో సమానంగా ఉన్న ఒక అవగాహన, ప్రయత్నం చేయడం వరకే మన పని, ఫలితం ఆ భగవంతునిది అన్న అవగాహన. ఇదే భారతీయులను శతాబ్దాలుగా జరిగిన అన్ని దండయాత్రలను, దాడులను, తట్టుకుంటూ కూడా తన మూల అస్తిత్వాన్ని, నాగరికతను, కోల్పోకుండా రక్షించినది, అపరిమితమైన సహనాన్ని ఇచ్చినది ఈ అవగాహనే. పైన చెప్పిన శ్లోకం అన్నిటి కంటే గొప్ప గీతోపదేశం అనిపిస్తుంది, ముఖ్యంగా ఈ మానవ జీవిత మనుగడను సాధించడానికి ఈ శ్లోకం గొప్ప బలాన్నిస్తుంది, స్ఫూర్తినిస్తుంది, నిర్భయంగా ముందుకు సాగేలా చేస్తుంది.  


శ్రీకృష్ణ భగవానుడు, గీతాచార్యునిగా, బోధించిన భగవద్గీతకు ఎందరో మహానుభావులు అనేక భాష్యాలు వ్రాసారు, వ్రాస్తూనే ఉన్నారు. ఈ శాస్త్రాన్ని అనేక రకాలుగా అభివర్ణించారు కూడా. ఇవన్నీ చూస్తే, గీత ఎవరి అవసరాలకు తగ్గట్టుగా అలా దర్శనమిస్తుందనిపిస్తుంది. మనిషి జీవితంలో ప్రతీ క్షణమూ, ప్రతీ దశ కూడా సవాళ్ళతో కూడుకొని ఉన్నదే. పైగా ఒక్కొక్కరికీ ప్రత్యేకమైన విధంగా ఉంటుంది కూడా. యే ఇద్దరి జీవితాలు ఒక్కలా ఉండవు. వాళ్ళ-వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళున్న పరిస్థితులను బట్టి, తగిన మార్గదర్శనం చేసేటువంటి మహా గ్రంథం భగవద్గీత. కేవలం కంఠస్థం చేసి మనసులో అనుకున్నా కూడా ఆ శబ్ద తరంగాలకు ఆత్మకు తెలియని శాంతి కలుగుతుంది. ఆనందులోని విషయం ఆ విధమైనటువంటి స్వస్థత చేకూర్చే శక్తి ఉన్నది, తద్వారా ఆ వ్యక్తికి కర్తవ్య బోధ జరుగుతుంది కూడా. 


భగవద్గీత మహాభారత ఇతిహాసంలోనిది. కురుపాండవుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాక ముందు, అర్జునుడు తన స్వజనులను చంపుటకు ఇష్టపడక, అధైర్యానికి లోనై, విషాదంలో మునిగిపోయిన క్షణంలో, శ్రీ కృష్ణ భగవానుడు ఆర్జనుడికి కర్తవ్య బోధ చేసి మరల యుద్ధానికి సన్నద్ధుడిని చేసే క్రమంలో వారివురి మధ్య జరిగిన సంవాదమే శ్రీమద్భగవద్గీత. ఈ సంవాదంలో అనేక సందేశాలు మనకు కనిపిస్తాయి; భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ, అన్ని రకాల వారికి వర్తించే అంశాలు అనేకం దర్శనమిస్తాయి. ముఖ్యంగా దీన్ని యోగశాస్త్రంగా పరిగణిస్తారు పెద్దలు. మనిషి జీవిత పరమార్థమైన యోగాన్ని ఇక్కడ విశదీకరిస్తారు.


భగవద్గీత, ఉపనిషత్తుల సారము, కర్మ, భక్తి, జ్ఞాన యోగములను, భగవంతుని తత్త్వాన్ని, ఆత్మ స్వరూపాన్ని తెలియజేసే ఉద్గ్రంథం. కురుక్షేత్ర యుద్ధానికి, భగవద్గీతకు,  ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు, సంజయుడు, వేదవ్యాస మహర్షి, బర్బరీకుడి శిరస్సు. 


దీన్ని రచించినది వేదవ్యాస మహర్షి. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొదటి ఆరు అధ్యాయాలను కలిపి కర్మషట్కము అని, తరువాతి ఆరు ఆధ్యాయాలను కలిపి భక్తిషట్కము అని, చివరి ఆరు ఆధ్యాయాలను కలిపి జ్ఞానషట్కము అని అంటారు. అంతేగాక ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగమని కూడా చెబుతారు. అవి ఈ విధంగా ఉన్నాయి: 

1) అర్జున విషాద యోగము, 2) సాంఖ్య యోగము, 3) కర్మ యోగము, 4) జ్ఞాన యోగము, 5) కర్మసన్న్యాస  యోగము, 6) ఆత్మ సంయమ యోగము, 7) జ్ఞానవిజ్ఞాన యోగము, 8) అక్షరపరబ్రహ్మ యోగము, 9) రాజవిద్యా రాజగుహ్య యోగము, 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము, 12) భక్తి యోగము 13) క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము 14) గుణత్రయవిభాగ యోగము, 15) పురుషోత్తమప్రాప్తి యోగము 16) దైవాసురసంపద్విభాగ యోగము 17) శ్రద్ధాత్రయవిభాగ యోగము 18) మోక్షసన్న్యాస యోగము.

శ్రీకృష్ణ భగవానుడు అన్నీ యోగమార్గాలూ చెప్పిన తరువాత 18 వ అధ్యాయంలో చెప్పిన ఈ శ్లోకం సామాన్యులయిన మనకు, ఇవన్నీ ఎప్పటికి అధ్యయనం చేయాలి, ఎప్పటికి అర్థం అవ్వాలి, ఎప్పటికి ఆచరణలో పెట్టాలి, ఎప్పటికీ జ్ఞానోదయం కావాలి, అన్న సంధిగద్ధమలో పడిపోయి ఈ మహత్తర విద్యకు దూరమవకుండా మనందరికీ ఈ శ్లోకం ఎంతో ఊరటను, తేలికదనాన్ని,  ధైర్యాన్ని, అభయాన్ని అందిస్తుంది. అన్నిటినీ వదిలిపెట్టేసి ఎవరైతే నా శరణులోకి వస్తారో వాళ్ళ పాపాలను తొలగించి, మోక్షం యిస్తానని గొప్ప అభయం యిస్తాడు భగవానుడు. 


సర్వ ధర్మాన్పరిత్యజ్య  మామేకం శరణం వ్రజ 

అహంత్వా పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. 


అయితే యుద్ధ రంగంలో ఇరుపక్షాలు యుద్ధానికి సన్నద్ధులై ఉండగా శ్రీకృష్ణుడు అర్జునుడికి 700 శ్లోకాలు చెప్పే అంత సమయం ఉందా అని మన వంటి సామాన్యులకు ప్రశ్న కలుగుతుంది. ఆ సందేహాన్ని ప్రక్కకు పెట్టి కాస్సేపు ఈ గ్రంథాధ్యయనం చేసినవారు దీని వల్ల ప్రయోజనం పొందడంలో ఎటువంటి లోటూ రాదు. అయితే ఈ సందేహాన్ని పూజ్య బాబూజీ మహారాజ్ నివృత్తి చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు చెప్పే అంతా సమయం లేదని, వాటిని  కేవలం, దివ్య చైతన్య ప్రసరణతో కూడిన శ్లోకాల్లో చెప్పడం జరిగిందని వెల్లడి చేయడం జరిగింది. తక్కిన శ్లోకాలన్నీ వేదవ్యాస మహర్షి వివరణలని, అవి సాధకులందరూ చదవదగ్గవని పూజ్య దాజీ 2021 లో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు నిగూఢమైన ధ్యాన స్థితిలో వారికి బాబూజీ నుండి అందినటువంటి ఆ ఏడు శ్లోకాలనే గాక, మరో మూడు శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికినవి కూడా వెల్లడించడం జరిగింది. ఈ శ్లోకాలేవేవి తెలుసుకోడానికి, మరిన్ని వివరాలకు ఈ క్రింది లింకుల ద్వారా దీనికి సంబంధించిన 5 వ్యాసాలు దయచేసి చదువగలరు. 

https://hrudayapatham.blogspot.com/2021/11/1.html

https://hrudayapatham.blogspot.com/2021/11/2-7.html

https://hrudayapatham.blogspot.com/2021/11/2-3.html

https://hrudayapatham.blogspot.com/2021/11/4.html

https://hrudayapatham.blogspot.com/2021/11/5.html









1 కామెంట్‌:

  1. adbhutam krishna gaaru ! meeru ichina linkulanu kooda tappaka choostaanu. deenini mechukOvadam tappa, emi kaamentu chestaamu... google emo kaamentu cheyi antundi. dhanyavaadaalu. chakkani kaaryam ippati maaku sankshiptamgaa akshara baddham chesi
    andistunaaru

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...