16, ఆగస్టు 2023, బుధవారం

మన మహర్షులు - నారద మహర్షి


దేవర్షి నారద 

(కాలం: అన్ని యుగాల్లోనూ, అన్ని పురాణాల్లోనూ, అన్ని లోకాల్లోనూ  దర్శనమిస్తాడు, 8 మంది చిరంజీవుల్లో ఒకరు)

నారద మహర్షి మహతి అనే వీణను ధరిస్తాడు ; చేతుల్లో  చిడతలు ఉంటాయి. ఆయన సర్వకాల సర్వావస్థలలోనూ "నారాయణ నారాయణ" అంటూ  నిరంతర దైవస్మరణలో ఉంతు లోక కళ్యాణం మాత్రమే మనసంతా నింపుకొని తన కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడు.  

నారం దదాతి ఇతి నారదః 

నార - కేవలం నరుడికి మాత్రమే సంబంధించినదాన్ని నార అంటారు. అంటే కేవలం నరుడు మాత్రమే సిద్ధించుకోగలిగినది, మిగిలినవారు ఎవరూ పొందలేనిది. అదే ఆత్మజ్ఞానం. కాబట్టి నార   అంటే ఆత్మజ్ఞానం. అంటే ఇచ్చేవాడు; ఆత్మజ్ఞానాన్ని అర్హత కలిగినవారికి ప్రసాదించేవాడు నారద అని అర్థం. నారదుడు అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. 

ఉదాహరణకు, ధ్రువుడిని కాపాడింది, ప్రహ్లాదుడుకి గర్భంలో ఉండగానే ఆత్మజ్ఞానం ప్రసాదించిమనది, వాల్మీకిచే శ్రీమద్రామాయణం రచింపజేసినది,  వేదవ్యాసుడి చేత  మహాభాగవతం వ్రాయించినది, ఇలా ఎందరో తరింపజేసినది నారదుడు. 

దేవర్షి, బ్రహ్మమానస పుత్రుడు, త్రిలోక సంచారి, ఇలా నారద మహర్షికి అనేక పేర్లున్నాయి. వీరు ఇప్పటికీ  ఉన్నారని చెప్తారు. 8 మంది చిరంజీవుల్లో వీరొకరు - 
1) అశ్వత్థామ, 2) మహాబలి, 3) వేదవ్యాస, 4) హనుమాన్, 5) విభీషణ, 
6) కృపాచార్యుడు, 7) పరశురాముడు, 8) మార్కండేయుడు. 

 సినిమాలు, టీవీ సీరియళ్ళ వల్ల నారదుడు కలహప్రియుడుగానూ, కామెడియన్ గానూ మాత్రమే మనకు తెలుసు. కానీ నారదుడు వేదోపనిషత్తులు, శిక్షాకాల్పనిరుక్తవ్యాకరణాది  శృతి శాస్త్రపు మర్మములు తెలిసినవాడని, ఎంతో మందికి ఆత్మజ్ఞానం ప్రసాదించి వారిలో అపూర్వ పరివర్తన కలుగజేసినవాడని, అన్ని లోకాల్లోనూ పూజ్యుడుగా స్వాగతింపబడేవాడని, దేవతలకు, రాక్షసులకు కూడా పూజ్యనీయుడని, ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ఒత్తిడిని తగ్గించే మహానుభావుడని, నిరంతర దైవసమరణలో ఉంటూ ఇతరుల హృదయాలకు గొప్ప శాంతిని ప్రసాదించేవాడని,  "నారద భక్తి సూత్రాలు" అనే అద్భుత గ్రంథాన్ని మానవాళికి అందించిన వాడని, అందరిచే పూజింపబడేవాడని, అందరి హృదయాలలో పరివర్తన తీసుకురాగలవాడని, ఇంకా ఎన్నో మనకు తెలియదు. 

నారదుడు ప్రసాదించిన నారద భక్తి సూత్రాలు మానవాళికి ఒక వరం. కర్మ, భక్తి, జ్ఞాన, యోగాల్లో ఆన్నిటికంటే తేలికైనది, భక్తి యోగము.  ఈ గ్రంథంలో నారద మహర్షి ఎంతో విపులంగా భక్తి అంటే ఏమిటో తెలియజేయడం జరిగింది - అసలు భక్తి స్వభావం ఏమిటి? భక్తి ఎలా అలవర్చుకోవాలి? భక్తుడికి ఉండవలసిన లక్షణాలేమిటి? భక్తి అలవడటానికి చేయవలసిన సాధనలేమిటి? భక్తి మార్గంలో వచ్చే అవరోధాలేమిటి? ఈ అవరోధాలను అధిగమించడం ఎలా? ఈ  భక్తిలో ఉండే వివిధ స్థాయిలు ఎలా ఉంటాయి? అత్యున్నత స్థాయికి చెందిన భక్తే కాకుండా అతి నిమ్న స్థాయి భక్తిని కూడా ఇందులో చర్చించడం జరిగింది; ఏమిటవి? మన హృదయంలో భక్తి పెరిగిందని మనకేలా తెలుస్తుంది? మన హృదయంలోకి భక్తి ప్రవేశించడానికి అడ్డు తగిలేదేమిటి? తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? హెచ్చరికలు కూడా చర్చించడం జరిగింది. నేను భక్తి మార్గంలో ఉన్నప్పటికీ నేను  ఆధ్యాత్మికంగా  పురోగతి ఎందుకు చెందడం లేదు? ఈ  భక్తి అనేది ఎందుకింత ప్రధానమైనది అలాగే అంత తేలికైనదిగా కూడా ఎలా ఉంది? మిగిలిన సాధనలతో పోలిస్తే భక్తి సాధన ఏ  విధంగా తేలికైనది? భక్తి లేకుండా తక్కిన సాధనా పద్ధతులు కూడా నెరవేరకుండా ఉండటానికి కారణం ఏమిటి? భక్తిని అలవరచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఇంకా ఎన్నెన్నో అంశాలు భక్తికి సంబంధించి ఈ ఉద్గ్రంథంలో చర్చించడం జరిగింది. 

పూజ్య దాజీ  కూడా భక్తికి సంబంధించిన ప్రసంగాలు చేస్తున్నప్పుడు నారద భక్తి సూత్రాలు చదవమని సూచించడం జరిగింది. సత్యాన్వేషకులందరూ, ఆధ్యాత్మిక సాధకులందరూ ఈ గ్రంథాన్ని తప్పక అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. 






 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...