29, ఆగస్టు 2023, మంగళవారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణుడి అష్ట భార్యలు


 శ్రీకృష్ణుడి  అష్ట భార్యలు 
(పైన చిత్రంలో శ్రీ కృష్ణుడి ఎనిమిది మంది భార్యలు - రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నగ్నజీతి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ అని అష్టభార్యలు. మధ్యలో రాధాకృష్ణులు) 

శ్రీకృష్ణుడికి అష్ట భార్యలు కాదు, మొత్తం 16108 మందిని పెళ్ళి చేసుకున్నాడని మనందరమూ చిన్నప్పటి నుండి విని ఆ మహాపురుషుడు అంతమందిని పెళ్ళి చేసుకున్నాడని విమర్శలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నిజానికి ఆయనకు ఉన్నది 8 మంది భార్యలే. పైన చెప్పిన విధంగా. రాధ ఆయన దివ్యసహవాసి. మిగిలిన 16100 మంది నరకాసురుని చెరలో బంధింపబడ్డ వారు. శ్రీకృష్ణుడు నరకాసుర వధ చేసిన తరువాత వాళ్ళందరినీ చెర నుండి విడిపించి,  వాళ్ళ-వాళ్ళ ఇళ్ళకు వెళ్ళమంటాడు. కానీ వాళ్ళు, ఆసురుడితో ఇంత కాలం జీవించినందుకు సమాజం వాళ్ళని అంగీకరించదని, పైగా మమ్మల్ని కళంకితులుగా చూస్తారని, ఇంటికి వెళ్ళలేమని,  తిరస్కరిస్తారు. అప్పుడు వాళ్ళకు సమాజంలో వారికి గౌరవించదగ్గ హోదా కల్పించడానికి వాళ్ళందరినీ వివాహమాడి వాళ్ళకు అన్నీ రకాల రక్షణ కల్పిస్తాడు. ఇంతకంటే మరో కారణం లేదు. ఇంకా వివరాలు కావాలంటే మనం భాగవత పురాణం చదివి తెలుసుకోవాలి. 
ఇక ఈ అష్ట భార్యల విషయంలో కూడా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్లే ఆయన వివాహం చేసుకుంటాడు:
రుక్మిణి: రుక్మిణి శ్రీకృష్ణుని మొదటి భార్య. ఈమె సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మి అవతారమని భాగవతం చెబుతుంది. రుక్మిణి శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. కానీ ఆమె వివాహం శిశుపాలునితో బలవంతంగా చేయబోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను తన రథంలో ఎత్తుకొని వచ్చి వివాహమాడతాడు.  
సత్యభామ: శ్రీకృష్ణుడు శమంతకమణి అనే మణిని జాంబవంతునితో యుద్ధం చేసి తీసుకువచ్చి సత్రాజిత్తుకు అందజేసి, తనపై సత్రాజిత్తు వేసిన అపవాడును పోగొట్టుకున్నందుకు, సత్రాజిత్తు తన కుమార్తెను హృదయపూర్వకంగా ఇచ్చి శ్రీకృష్ణునితో  వివాహం జరిపిస్తాడు. ఆమె కూడా కృష్ణ ప్రేమికురాలే. సత్యభామను భూదేవి అవతారమని అంటారు. 
జాంబవతి: శ్రీకృష్ణుడి మూడవ భార్య జాంబవతి. శమంతకమణిని జాంబవంతుడితో 29 రోజులు యుద్ధం చేసి గెలుచుకుని, జాంబవంతుడి శ్రీరామునితో యుద్ధం చేయాలన్న కోరికను శ్రీకృష్ణావతారంలో తీర్చి, శ్రీరామ సాక్షాత్కారం శ్రీకృష్ణునిలో జరిగినందుకు కృతజ్ఞతతో తన కూమార్తె అయిన జాంబవతిని, శమంతకమణిని రెంటినీ శ్రీకృష్ణ భాగవానుడికి అర్పిస్తాడు. శ్రీకృష్ణుడు జాంబవతిని ఆ విధంగా వివాహమాడాడు.  
కాళింది: కాళింది ఎవరో కాదు, సాక్షాత్తు యమునా నదే. ఒక రోజు కృష్ణార్జునులు వేటాడుతూండగా కాళింది శ్రీకృష్ణుడిని ప్రేమస్తూ, వివాహమాడాలని తపిస్తూ ఉంది. ఆమె భక్తికి, ప్రేమకు మెచ్చి శ్రీకృష్ణుడు ఆమెను వివాహమాడటం జరుగుతుంది. 
మిత్రవింద: మిత్రవింద అవంతీపుర రాజకుమార్తె. ఆమె స్వయంవరంలో శ్రీకృష్ణుడిని కోరుకుంటుంది. కానీ ఇది ఆమె అన్నదమ్ములకు నచ్చక శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తే, వాళ్ళందరినీ ఓడించి మిత్రవిందను వివాహం చేసుకోవడం జరుగుతుంది. 
నగ్నజీతి: నగ్నజీతికి సత్య అనే పేరు కూడా ఉంది. ఈమెను వివాహమాడటానికి స్వయంవరంలో శ్రీకృష్ణుడు ఏడు వృషభాలకు ముక్కు త్రాడు వేయవలసి ఉండింది. కృష్ణుడు ఆ పని చాలా తేలికగా చేసి నగ్నజీతిని వివాహమాడటం జరుగుతుంది. 
భద్ర: భద్ర శ్రీకృష్ణుడి బంధువుల అమ్మాయే. ఆమె శ్రీకృష్ణుడిని అపారంగా ప్రేమించింది. ఆమె అన్నదమ్ములే శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరుపుతారు. 
లక్ష్మణ: లక్ష్మణకు లక్షణ అన్న పేరు కూడా ఉంది. ఆమె గొప్ప సౌందర్యవతే గాక ఎన్నో గొప్ప లక్షణాలు గలది కూడా. ఆమెను కూడా శ్రీకృష్ణుడు స్వయంవరంలో వివాహమాడటం జరుగుతుంది.
రాధ: రాధ కృష్ణుని కంటే వయసులో పెద్దది. మొట్టమొదటిసారిగా రాధకు 12 యేళ్ళున్నప్పుడు, కృష్ణుడికి 7 యేళ్ళున్నప్పుడు బృందావనంలో కలుస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే ఆమె శ్రీకృష్ణునితో అనేక ఆధ్యాత్మిక సూక్ష్మ స్థాయిల్లో లయమైపోవడం జరిగిపోయిందని భాగవతం చెబుతుంది. రాధాకృష్ణుల ప్రేమ అలౌకికమైనది, దివ్యమైనది. వీరి ప్రేమ తత్త్వాన్ని గురించి స్వయంగా భగవానుడే బాబూజీతో పంచుకున్న అంశాలు మనం ఇంతకు ముందు వ్యాసంలో చదువుకున్నాం: శ్రీకృష్ణుడు రాధతో లేని క్షణమే లేదని, చివరికి యుద్ధరంగంలో కూడా అదృశ్యంగా ఆయనతోనే ఉందని, ఇరువురూ ఒకరులేకపోతే మరొకరు లేరని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ధ్యానించదగ్గ ఆమోఘ వ్యక్తిత్వం. అందరూ ఆ ప్రయత్నంలో ఉందురుగాక. 

ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు 16108 మందిని వివాహం చేసుకోవడం జరిగింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా, భగవానుడు చేసినవన్నీ  లీలలేనని, లోకకళ్యాణార్థమేనని, కర్మవశాన జరిగిన సంఘటనలు కావని కొంత సూక్ష్మ దృష్టితో పరికించి చూస్తే గాని బోధ పడదు. అందుకే ఓషో రజనీష్ కృష్ణుడు భవిష్యత్తులో అర్థంచేసుకోగలిగిన వ్యక్తిత్వం అని చెప్పడం జరిగింది. అందుకే రాముడిని అనుసరించాలి, కృష్ణుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.  

 

2 కామెంట్‌లు:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...