శ్రీకృష్ణ జన్మాష్టమి 2023 సెప్టెంబర్
6 వ తేదీన ఆసన్నమవుతున్న
సందర్భంగా యుగపురుషుడు, యోగీశ్వరుడు, మొట్టమొదటి జగద్గురువు
అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను, యథాశక్తి, ప్రత్యేకంగా
స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం దుస్సాహసమే
అయినప్పటికీ పూజ్య గురుదేవుల కృప వల్ల కలిగే శ్రీకృష్ణ భాగవానుడి ఆశీస్సులతో ధైర్యం
చేద్దాం.
శ్రీ కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి, విస్తృతమైన వైదిక వాజ్ఞ్మయాన్ని (వేదాలు, వేదాంగాలు, షడ్ దర్శనాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతం ఇలా ఎన్నో వైదిక
గ్రంథాలను) మానవాళి తేలికగా అధ్యయనం చేసుకోవాలన్న సంకల్పంతో వీలుగా ఉండేలా
క్రోడీకరించి, సంకలనం చేయడం జరిగింది. ఇంత చేసిన తరువాత కూడా, అంతటి మహహత్తర కార్యాన్ని సంపూర్ణంగా
నిర్వహించిన తరువాత కూడా, యేదో తెలియని వెలితి ఆయన మనసులో ఉండి
బాధపెడుతున్న తరుణంలో శ్రీ నారద మహర్షి, ఆయనను ఒక భక్తిరస ప్రధానమైన శ్రీమద్భాగవతాన్ని
రచించమని కోరతారట. భాగవత కథ అంటే భగవంతుని కథ అని అర్థం. అంటే శ్రీకృష్ణ భగవానుని
కథ. ఆ విధంగా శ్రీమద్భాగవతం ఆవిర్భవించింది.
రాముడిని అనుసరించు, కృష్ణుడిని అర్థం చేసుకో -
అన్నారు మన పెద్దలు. విష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముని
అవతారంగా అవతరించాడని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా
అవతరించాడని మన వైదిక సాహిత్యం చెప్తుంది. రామావతారం అసంపూర్ణ అవతారమని, కృష్ణావతారం పూర్ణ అవతారమని
కూడా చెబుతోంది మన సనాతన ధర్మం. రాముడికి తనలో ఉన్న దివ్యత్వాన్ని గురించిన ఎరుక
ఉండేది కాదట; కృష్ణునికి పుట్టినప్పటి నుండీ తనలోని దివ్యత్వం యొక్క ఎరుక ఉండేదట. రాముడిని రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు; అంటే రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు. అంతటి
ధర్మ నిరతుడు ఇంతకు పూర్వం జన్మించ లేదు; ఇక జన్మించడు బహుశా. అందుకే ఆయనను
అనుసరించవలసిన అవసరం. కృష్ణుడిని కృష్ణం వందే జగద్గురుం అన్నారు. కృష్ణుడు తన జీవితమంతా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ, సజ్జనులకు మార్గదర్శనం చేస్తూ, జీవిత పరమార్థాన్ని భగవద్గీత
ద్వారా ప్రపంచానికి తెలియజేసిన పరమోత్కృష్ట గురువు కావడం వల్ల ఆయనను జగద్గురువుగా
మన మనసుల్లో నిలిచిపోయారు. ఈ యుగానికి యుగపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మే.
అంతే కాదు, మన సహజమార్గ సాంప్రదాయంలో
కూడా మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ పరమాత్మేనని, ఆయనతోనే మన గురుపరంపర ప్రారంభమయ్యిందని
కూడా సహజమార్గ సాహిత్యం చెబుతున్నది.
శ్రీకృష్ణుని స్పర్శ, శ్రీకృష్ణచైతన్యము, శ్రీకృష్ణ తత్త్వం, ప్రతీ భారతీయుని హృదయంలోనూ, దేశంలోని ప్రతీ చెట్టు, చేమ, పుట్ట, రాళ్ళల్లోనూ, అణువణువులోనూ ఏదొక రూపంలో
నిక్షిప్తమై ఉన్నదని చెప్పనవసరం లేదు. గీతాచార్యునిగా ఆయన బోధించిన
శ్రీమద్భగవద్గీత మన నాగరికతను, మన భారతీయ మనస్తత్వాన్ని, ఎంత మంది దాడులు చేసినా
చెరగని సంస్కృతితో విలసిల్లడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ మానవ
కళ్యాణానికి ఇప్పటికీ కారణమవుతున్నది.
చూసారా ఇది మిస్సు అయ్యాను. ఈ రోజు గమనించాను. చాలా చక్కగా సంక్షిప్తంగా చెప్పారు.
రిప్లయితొలగించండి