మహర్షి పతంజలి
(కాలం: సుమారు 2500 సంవత్సరాలకు పూర్వం)
(పైనున్న చిత్రంలో ఉన్నది, మన శ్రీరామ చంద్ర మిషన్, తూముకుంట ఆశ్రమంలో పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ నెలకొల్పిన పతంజలి మహర్షి విగ్రహం)
యోగేన చిత్తస్య పదేన వాచా, మలం శరీరస్య చ వైద్య కేన |
యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ||
పతంజలి మహర్షి అనగానే మనందరికీ గుర్తొచ్చేది యోగసూత్రాలు లేక యోగ దర్శనం. ఇది మన వైదిక వాజ్ఞ్మయంలో ఉండే షడ్ దర్శనాల్లో ఆరవ దర్శనం. అంతేగాక ఆయన మరో రెండు ఉద్గ్రంథాలూ కూడా రచించారు - పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి వ్యాకరణానికి మహాభాష్యం వ్రాసారు. ఇది గాక శారీరక ఆరోగ్యం కోసం, ఆయుర్వేద శాస్త్రం కూడా రచించడం జరిగింది. దీనినే పతంజలి తంత్రం అని కూడా అంటారు. ఇలా పతంజలి మహర్షి శారీరక ఆరోగ్యం కోసం, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక సిద్ధుల కోసం యోగ సూత్రాలు లేక యోగదర్శనం, వాక్ శుద్ధి కోసం మాహాభాష్యం వ్రాసారు. ఈ విధంగా మనిషి మనుగడకు అవసరమైన అన్ని అవసరాలను అందించి, మానవ జీవిత సార్థక్యతకు సమగ్రమైన పరిష్కారాన్ని సూచించారు.
వీరి జన్మ విచిత్రమైన రీతిలో జరిగింది; నేటి తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో, గోనిక అనే స్త్రీ సంతానం కోసం అంజలి ఘటించి ప్రార్థిస్తూండగా ఆమె అంజలిలో ఒక చిన్న పాము పిల్ల ఎక్కడి నుండో పడుతుంది. సంస్కృతంలో పడటాన్ని పతన్ అంటారు. అంజలిలో పడటం వల్ల ఆయనకు పతంజలి అనే పేరు వచ్చింది. చిదంబరంలో ఉన్న నటరాజ స్వామికి సేవలనందించడానికి, శ్రీ మహావిష్ణువు సూచన మేరకు నటరాజ నృత్యానుభూతి పొందడానికి ఆదిశేషుడే పతంజలి రూపంలో దిగి రావడం, ఈ మూడు మహా గ్రంథాలూ రచించడం జరిగింది.
యోగా దర్శనం లేక యోగా సూత్రాలు అనే అద్భుత గ్రంథంలో పశవుగా ఉండే మానవుడు పశుపతిగా ఎలా మారాలో, అంటే మన పూజ్య బాబూజీ మహారాజ్ గారు చెప్పినట్లుగా పాశవిక మానవుడి నుండి దివ్యమానవుడిగా ఎలా పరివర్తన చెందవచ్చో, 196 సూత్రాల్లో, 4 అధ్యాయాల్లో, అష్టాంగ యోగంగా మనకు అందించడం జరిగింది. అష్టాంగ యోగంలో - యమ, నియమ, ఆసన, ణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఎనిమిది మెట్లు.
మనకు ఆసక్తి కలిగించే మరో అద్భుత విషయం ఏమిటంటే బాబూజీ మహారాజ్ తన పూర్వ జన్మలలో, ఒక జన్మలో పతంజలిగా ఉన్నారు. పతంజలి మహర్షే మరలా తిరిగి వచ్చి తన యోగదర్శనాన్ని ఆధునిక మానవునికి అనుకూలంగా మలచి సహజమార్గంగా మానవాళికి అందించారా అన్నట్లుగా ఒక అద్భుతమైన తలంపు కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి