27, ఆగస్టు 2023, ఆదివారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణ లీలామృతం



శ్రీ కృష్ణ లీలామృతం  

ఆదౌ దేవకీదేవగర్భజననం గోపీగృహే వర్ధనం 
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధరణం |
కంసఛ్ఛేదకౌరవాదిహననం కుంతీసుతాపాలనం 
ఏతద్భాగవతం  పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం|| 

(ఏకశ్లోకీ భాగవతం అంటే ఒక్క శ్లోకంలో భాగవతం)

శ్రీకృష్ణ లీలామృతాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకునే ముందు మనం 'లీల' అంటే ఏమిటో తెలుసుకుందాం. మామూలు మనుషులు కర్మవశాన పుడతారు. జన్మించిన తరువాత చేసే పనులు కూడా కర్మవశాన్నే చేస్తూంటారు. వాటిని కర్మలంటాం  కూడా. శ్రీకృష్ణుడు కర్మవశాన జన్మించినవాడు కాదు. ఒక నిర్దుష్టమైన కార్యాన్ని నిర్వహించడానికి - దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ - అనే కార్య నిర్వహణకు దిగిరావడం జరిగింది, ఆ పరమాత్మ కాబట్టి అటువంటి అవతారా పురుషుడు చేసినవన్నీ కర్మలు కావు, వాటినే లీలలు అంటారు. దివ్య చైతన్యంతో, పూర్తి ఎరుకతో చేసే కార్యాలను, లీలలు అని అంటారు. ఆ లీలలన్నీ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ దిశగా నిర్వర్తించినవే. 

శ్రీకృష్ణ పరమాత్మ జన్మే ఒక లీల; ఎనిమిదవ సంతానంగా పుట్టడం, ఖైదులో జన్మించడము, దేవకీవసుదేవులకు దర్శనమిచ్చి వారి సంతానంగా జన్మించడం, ఆ తరువాత ఆయన ఆదేశాల ప్రకారం ఖైదులో నుండి కుంభవృష్టి జరుగుతూండగా ఒక బుట్టలో జన్మించిన శిశువును పెట్టుకుని యమునా నది దారివ్వగా, ఆదిశేషుడు పడగ విప్పి స్వామిని కాపాడగా, నందవ్రజ గ్రామంలో ఉన్న నంద-యశోదల ఇంట్లో ఉంచి, ఆమె సంతానాన్ని తిరిగి ఖైదులోకి తీసుకురావడం; ఇదంతా ఒక గొప్ప లీలే. శ్రీకృష్ణ పరమాత్ముడు తన జన్మకు పూర్వం నుండి, మనిషి జీవితంలోని అన్ని దశాల్లోనూ  కూడా సంపూర్ణ ఎరుకతో, దివ్య చేతనతో కార్యాలు నిర్వహించడం ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించడం జరిగింది. ఈ  లీలలన్నీ శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారుడనడానికి తార్కాణాలు. 

జన్మించిన తరువాత శిశువుగా ఉన్నప్పుడు, బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చేసిన లీలలే చాలా ప్రమాదకరమైనవి, అలాగే ఎందరినో ఉద్ధరించిన సందర్భాలు కూడా. అదే దుష్టశిక్షణ, శిష్టరక్షణ. పూతన స్తన్యములకున్న విషాన్ని తాకకుండా పాలు త్రాగుతూ ప్రాణాలు హరించి, ఆమెకు ముక్తిని ప్రసాదిస్తాడు; ఆ తరువాత వాళ్ళమ్మ యశోద రోటికి కట్టేస్తే వాటిని రెండు మానుల మధ్య బలం ఉపయోగించి తీసుకువెదుతూంటే, ఆ మానులకు మోక్షం కలుగుతుంది; మట్టి తిన్నాడాని యశోద తిట్టి నోరు చూపించమంటే మొత్తం బ్రహ్మాండం చూపించి తన మహిమను చాటుతాడు; ఆ తరువాత కాళింది మాడుగులో కాళీయ విషసర్పం మీద నృత్యం చేసి దాన్ని హతమార్చడం; ఇంద్రుడి తాపం నుండి కాపాడుతూ గోవర్ధనగిరిని చిటికెన వ్రేలుతో ఎత్తి స్వజనాన్ని కాపాడటం; గోకులంలోని ఇళ్ళల్లో వెన్నను మాత్రమే దొంగిలించడం, తన వెంట ఉన్న వారందరికీ పెట్టిన తరువాత మాత్రమే భుజించడం;  గోపికలతో రాసలీలలు; (రాసలీలలు అంటే అశ్లీలంగా ఉండేవి కావు మనం అపార్థం చేసుకునే విధంగా; ఆయన సాంగత్యంలో ప్రతి ఒక్కరూ శరీరాన్ని, మనస్సును, తమను తాము పూర్తిగా ఆధ్యాత్మికానందంలో పరవశులై బ్రహ్మానందాన్ని అనుభూతి చెందడం),  ఇలా అనేకానేకం ఉన్నాయి బాలకృష్ణ లీలలు. పరికించి చూస్తే అన్నిటికీ పరమార్థం కనిపిస్తుంది. 

ఇక పెద్దయిన తరువాత చూపించిన లీలలు కోకొల్లలు; అందుకే శ్రీకృష్ణుడిని లీలామానుషవిగ్రహం అంటారు కూడా. సర్వజన సమ్మోహనాకారుడు. రెండు సార్లు తన విరాట రూపాన్ని చూపిస్తాడు; ఒకటి యశోదకు, మరోసారి అర్జునుడికి కురుక్షేత్రంలో, మహాభారత యుద్ధ సమయంలోనూ. తన విశ్వరూపాన్ని చూపించిన ఏకైక అవతారం శ్రీకృష్ణావతారం; అందుకే ఈ  అవతారాన్ని పరిపూర్ణ అవతారం అని అంటారు. చివరికి ఆయన నిర్యాణం కూడా ఒక లీలే. ఈ లీలలను గురించిన పరమార్థాలు ఒక్కొక్క లీలను తెలుసుకోవాలంటే ఎందరో మహానుభావులు వ్రాసిన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా పోతన వ్రాసిన శ్రీమదాంధ్రమహాభాగవతం తప్పక చదవవలసిన గ్రంథం; ఆసక్తిగలవారు చదువుకోవచ్చు, ప్రవచనాల రూపంలో వినవచ్చు లేదా ధ్యానించవచ్చు. 
 






 

2 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా లీల గురించి వివరించారు. రాస లీల గురించి దానిని అర్థం చేసుకోవలసిన విధం విశాదీకరించాఋ.

    రిప్లయితొలగించండి
  2. అతి తక్కువ చోటులో అన్ని బొమ్మలు ఒకే చోట అతి చక్కగా, సుందరంగా అమర్చారు కృష్ణారావు గారు.
    మీ ఈ కృషిని తప్పక కొనసాగించగలరు. మధ్యలో మన ఋషులు, మహాత్ములు గురించి ఏమైనా పాజ్ ఇచ్చారా !

    రిప్లయితొలగించండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...