18, ఆగస్టు 2023, శుక్రవారం

మన మహర్షులు - యాజ్ఞవల్క్య మహర్షి

 


మహర్షి యాజ్ఞవల్క్య 
(కాలం: 3500 సంవత్సరాలకు పూర్వం త్రేతా యుగం)

ఓం యాజ్ఞవల్క్య గురుభ్యో నమః 

యాజ్ఞవల్క్య మహర్షి యజ్ఞవల్క్యుడనే బ్రాహ్మణుడికి జన్మించినవాడు. సృతులను,  స్మృతులను ఔపోసన పట్టినవాడు. వైశంపాయన మహర్షి వద్ద విద్యనభ్యసించినవాడు. యాజ్ఞవల్క్యుడి విద్యాహంకారం వల్ల తన గురువు వైశంపాయనుడిచే శపించబడతాడు. తన వద్ద నేర్చుకున్న యజుర్వేదాన్ని గక్కమంటాడు.  గురువును ఎంతో ప్రాధేయపడతాడు క్షమించమని. కానీ ప్రయోజనం లేక, యాజ్ఞవల్క్యుడు నెత్తురు రూపంలో ఆ విద్యనంతా వెళ్ళగ్రక్కుతాడు. ఆ నెత్తురు రూపంలో ఉన్న విద్యను తిత్తిరి పక్షులు తిన్నప్పుడు వాటి ద్వారా వెలువడినదే తైత్తరీయ ఉపనిషత్తు. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్య భాగవానుడి నుండి బ్రహ్మ విద్యనభ్యసించి బ్రహ్మజ్ఞానిగా మారతాడు. బ్రహ్మను తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు అని ఉద్బోధించిన మహానుభావుడు యాజ్ఞవల్క్య మహర్షి.  

జనకమహారాజు కొలువులో ఎంతో మంది నిష్ణాతులైన ఉద్దండ పండిత గణాన్ని,   ఋషులనూ వాగ్వివాదాల్లో శ్రుతి, స్మృతుల, పురాణాల విద్యకు, బ్రహ్మవిద్యకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయం సాధిస్తూండేవాడు. ఇలా ఒకసారి 1000 గోవులు, ఒక్కొక్క గోవు కొమ్ముకు కట్టిన 10 స్వర్ణ నాణాలు గెలుచుకుని ఐశ్వర్యవంతుడవుతాడు. 

యాజ్ఞవల్క్యుడు యోగులకు ఋషులకు తెలిపిన యోగరహస్యాలే యోగాయాజ్ఞవల్క్యం  అనే శాస్త్రంగా మనకు అందుబాటులో ఉంది. ఇది 12 అధ్యాయాల శాస్త్రం. ఇది గాక యాజ్ఞవల్క్య స్మృతి అని 4 కాండల్లో మరొక గ్రంథం వ్రాయడం జరిగింది. మొదటి కాండంలో 14 విద్యలు, పరిషత్తు, స్నాతకం, పౌరోహితం, వివాహం మొదలైనవి ఉన్నాయి; రెండవ కాండంలో న్యాయస్థానం, శిక్ష, స్త్రీధనం గురించి, మూడు-నాలుగు కాండాల్లో అపరకర్మ, అసౌఖ్య శుద్ధి, యాతి ధర్మాలు, మోక్ష మార్గం, యమనియమాలు ప్రాయశ్చిత్తాలు మొదలైనవి ఉన్నాయి. కేవలం జ్ఞానం వల్ల మోక్షం రాదని, చేసే పనులు, జ్ఞానం, రెంటి వల్లే కలుగుతుంది మోక్షం అని బోధించాడు యాజ్ఞవల్క్యుడు.  

ఈయనకు ఇద్దరు భార్యలు - ఒకరు కాత్యాయిని, మరొకరు మైత్రేయి. మైత్రేయిని బ్రహ్మవాదిని అని కూడా అంటారు. యాజ్ఞవల్క్యుడు వానప్రస్థం తరువాత సన్న్యాస ఆశ్రమం స్వీకరిద్దామనుకుంటాడు. తీసుకునే ముందు ఇద్దరు భార్యలను పిలిచి, తన మనోరథాన్ని వివరిస్తూ, నా సంపదను ఇరువురికీ సమానంగా పంచుతున్నాను అని చెబుతాడు. దానికి మైత్రేయి "సంపద వల్ల మోక్షం వస్తుందా?" అని అడుగుతుంది. దానికి యాజ్ఞవల్క్యుడు, "సంపద వల్ల మోక్షం గాని, అమరత్వం గాని పొందే అవకాశమే లేదని; కేవలం భూమ్మీద ఐశ్వర్యవంతుల జాబితాలో ఒక్కరిగా మిగిలిపోతారంతే"  అని చెప్పడం జరుగుతుంది. అయితే తనకు సరైన మార్గాన్ని ప్రబోధించమని అడుగుతుంది మైత్రేయి. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ  యాజ్ఞవల్క్య-మైత్రేయి సంవాదమే  బృహదారణ్యక ఉపనిషత్తులో భాగంగా ఉంది. చాలా ప్రసిద్ధమైన ఈ  సంవాద సారాంశం ఇలా ఉంది: వస్తువులన్నీ ప్రియంగా ఉండేది వాటి కోసం కాదు, కేవలం ఆత్మ కోసమే. అంతటా ఈ  ఆత్మ ఒక్కటే వ్యాపించి ఉంది. దాన్ని అర్థం చేసుకోవడం గాని, తెలుసుకోవడం గాని సాధ్యపడదు; ఎందుకంటే అర్థం చేసుకునేదీ, తెలుసుకొనేదీ అదే కాబట్టి. దీని స్వభావం ఇదీ అని చెప్పడానికి లేదు. దీన్ని నేతి, నేతి, అంటే - ఇది కాదు, ఇది కాదు, అంటూ  అనేకసార్లు నిరాకరించుకుంటూ సాక్షాత్కరించుకోవలసినదే. ఆత్మ అనేది స్వయంప్రకాశం గలది, అచింత్యం (ఆలోచనకు అందనిది), నాశనము లేనిది. ఆ తరువాత మైత్రేయి కూడా యాజ్ఞవల్క్యుడిని అనుసరిస్తుంది. కాత్యాయనికి ఇటువంటి వాటి  మీద ఆసక్తి లేదని ఆమె సంపదతో సంతృప్తిని చెందుతున్నానని తెలియజేస్తుంది. అలా ఇరువురి భార్యల అభీష్టాలను గౌరవిస్తూ యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరిస్తారు. 






2 కామెంట్‌లు:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...