మహర్షి వాల్మీకి
(కాలం: సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం త్రేతాయుగం నాటివారు)
मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौञ्चमिथुनादेकमवधीः काममोहितम्॥
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ: సమాః |
యటకరోనచ్చమిథునాదేకమవధీః కామమోహితాం ||
(వాల్మీకి మహర్షి నోటి నుండి వెలువడిన మొట్టమొదటి శ్లోకం)
వాల్మీకి మహర్షి మానవ పరివర్తనకు గొప్ప నిదర్శనం - బందిపోటుగా ఉన్న రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందడం, ధ్యానం వల్ల మనిషిలో పరివర్తన కలుగుతుంది అని చెప్పడానికి ఒక గొప్ప కొట్టొచ్చే నిదర్శనం వాల్మీకి.
వీరిని గురించి రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ మనందరికీ బాగా తెలిసిన కథ - వాల్మీకి పూర్వాశ్రమంలో ప్రచేతుడనే బ్రాహ్మణుడి సంతానం అని, ఆయన పేరు రత్నాకరుడని చెప్తారు. తండ్రి వద్దన్నా అరణ్యంలోకి విహారానికి వెళ్ళి అక్కడ దారి తప్పి పోవడం జరుగుతుంది. అందుకు అక్కడే ఉండిపోవలసి వస్తుంది; ఒక బోయవాడు అతనిపై జాలిపడి తన ఇంటికి తీసుకువెళ్ళి తన కొడుకుగా భావించి పెంచి పెద్ద చేసి, పెళ్లి చేస్తాడు. వివాహం అయిన తరువాత కుటుంబం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతాయి; తల్లిదండ్రులను చూసుకోడానికి, భార్యాబిడ్డలను చూసుకోడానికి తాను వేటాడుతూ ఆర్జించేది సరిపోకపోవడం వల్ల దారులు కొడుతూ సంపాదించడం ప్రారంభించి, ఆ ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు.
అలా ఒక రోజున నారద మహర్షి ఆ దారి గుండా పోతూండగా రత్నాకరుడు ఆయనను కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తే, నారద మహర్షి, ఎందుకిలా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, నిన్ను చూస్తే అలాంటివాడిలా కనిపించడం లేదు, అని అంటాడు. దానికి రత్నాకరుడు, "నేను నా కుటుంబాన్ని పోషించడానికి ఈ పని చేస్తున్నాను" అంటాడు. "అయితే మరి మీ వాళ్ళకు తెలుసా ఈ విధంగా సంపాదిస్తున్నావని? తెలిస్తే నువ్వు చేసే పాపంలో భాగం పంచుకుంటారా?" అని అడుగుతాడు నారదుడు. "ఎందుకు పంచుకోరు, వాళ్ళ కోసమే కదా ఇలా చేస్తున్నాను?" అంటాడు రత్నాకరుడు. "ఎందుకైనా మంచిది, వెళ్ళి తెలుసుకో" అని నారదుడు సలహా ఇస్తాడు. మహర్షి మాట కాదనలేక, తన సందేహ నివృత్తి కూడా అవుతుందని భావించి, నారదుడిని చెట్టుకు కట్టేసి, వెళ్ళిపోకుండా, ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని చర్చిస్తాడు. వాళ్ళ మాటలకు విస్తుపోతాడు. "కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత. నువ్వు ఎలా పోషిస్తున్నావన్నదానికి నువ్వే బాధ్యుడివి; మేము అందులో భాగం ఎలా పంచుకుంటాం?" అని అనగానే అతనికి విపరీతమైన దుఃఖం కలిగి, కనువిప్పు కూడా జరుగుతుంది.
తాను చేసిన పాపాలకు నిష్కృతి ఏమిటో అర్థం కాలేదు. అటువంటి స్థితిలో నారద మహర్షిని కర్తవ్య బోధ చేయమని కోరుతాడు. దీనికి ధ్యానం ఒక్కటే పరిష్కారం అని చెప్పి, అతనికి "మరా, మరా " అని మంత్రోపదేశం చేసి అక్కడి నుండి వెడలిపోతాడు. రత్నాకరుడు ఆ మంత్రంతో ధ్యానిస్తూ చుట్టూ వల్మీకాలు (పుట్టలు) కట్టినా కూడా స్పృహలేని విధంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. నారద మహర్షి మరలా కొన్ని సంవత్సరాల తరువాత అదే దారిలో వెడుతూండగా, అక్కడ ఆ వల్మీకంలో నుండి కాంతులు వెదజల్లడం గమనిస్తాడు. ఎవరో పుట్టలు కట్టేంతగా ధ్యానిస్తున్నాడాని గుర్తించి వల్మీకాల చుట్టూ ఉన్న స్థితిలో కనిపించడం వల్ల "వాల్మీకి" అని సంబోధిస్తూ ఆ తపస్విని సాధారణ స్థితికి తీసుకు వస్తాడు నారదుడు. అప్పటి నుండి ఆయనకు వాల్మీకి అని పేరు వచ్చింది. ఆ విధంగా రత్నాకరుడిగా తపస్సుకు కూర్చున్నవాడు అద్భుతమైన బ్రహ్మ తేజస్సుతో వాల్మీకి మహర్షిగా లేచాడు.
ఆ తరువాత మరింత తపస్సు చేసి, పరబ్రహ్మ దివ్యానుగ్రహంతో శ్రీ రామాయణ మహాకావ్యాన్ని రచించడానికి పూనుకున్నాడు. మొట్టమొదటగా ప్రపంచంలో కవిత్వాన్ని వ్రాసినవాడవడం చేత ఆయనను "ఆదికవి" అని కూడా అంటారు. 24000 శ్లోకాలతో, 7 అధ్యాయాలతో కూడిన శ్రీమద్రామాయణ మహాకావ్యం సనాతన ధర్మంలోని ఇతిహాసాల్లో మొదటిది.
అందరూ ఈ కావ్యాన్ని యేదో రకంగా ఆస్వాదించి తరించే ప్రయత్నం చేయడం భారతీయులుగా మన విధి, కర్తవ్యము కూడా.
సంక్షిప్తంగా చక్కగా ధ్యానం యొక్క మహత్యాన్ని వివరించారు.
రిప్లయితొలగించండిGood one Krishna. Pl keep sharing...the wisdom bridges.
రిప్లయితొలగించండి