15, ఆగస్టు 2023, మంగళవారం

మన మహర్షులు - వశిష్ఠ మహర్షి

 


మహర్షి వశిష్ఠ 

(కాలం: త్రేతాయుగం)

సప్తర్షి మహా మునేశ్వరం, సర్వజ్ఞం మిత్రావర్ణాత్మజం 
శ్రీ ఆగస్త్యేశ్వర అనుజం రఘువంశ కులగురుం 
కామధేను ప్రసాదితం అరుంధతినాథం 
శ్రీ వశిష్ఠమహేశ్వర నమామ్యహం. 
 
వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి కవలలు; ఇరువురూ కుంభసంభవులు; సప్తర్షులలో ఒకరు.  వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి కూడా. ఇక్ష్వాకు కుల ఆస్థాన పురోహితుడు, కులగురువు. అంటే  భగవాన్ శ్రీరామచంద్రులవారి గురువు. అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. ఆమె గొప్ప పతివ్రత, మహాపుణ్యవతి. ఈమె పేరున ఆకాశంలో ఒక నక్షత్రం కూడా సప్తర్షి  మండలంలో వశిష్ఠ నక్షత్రం ప్రక్కనే కనిపిస్తుంది. వివాహమైన నూతన దంపతులకు, తమ వైవాహిక జీవితం శుభకరంగా ఉండటానికి, ఈ నక్షత్రాన్ని చూడాలన్న ఆచారం ఒకటి మన సాంప్రదాయంలో కనిపిస్తుంది. 
అంతే కాదు, వశిష్ఠ మహర్షే, విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారడానికి స్ఫూర్తినిచ్చినవాడు. విశ్వామిత్రుడు కూడా సప్తర్షులలో ఒకరు. వశిష్ఠ మహర్షి మహాజ్ఞాని, నీతికోవిదుడు, గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శి. 

వీరి బోధలు తన యోగవాశిష్ఠం అనే గ్రంథం ద్వారా మనందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథం శ్రీరామచంద్రుల వారికి, వశిష్ఠ మహార్షికీ మధ్య జీవిత పరమార్థాన్ని, చైతన్య వికాసాన్ని గురించి జరిగిన అద్భుత సంవాదం. సత్యాన్వేషకులందరూ, యోగసాధకులందరూ తప్పక చదువవలసిన గ్రంథం ఈ యోగవాశిష్ఠం. దీన్నే యోగరామాయణం అని, వశిష్ఠ సంహిత అని కూడా పిలుస్తారు. పతంజలి యోగదర్శనంతో పాటు చదువవలసిన గొప్ప గ్రంథం. పూజ్య దాజీ  కూడా దీన్ని చదవమని సూచించడం జరిగింది. 

శ్రీరామచంద్రులవారు 16 ఏళ్ల ప్రాయంలోనే సకల శాస్త్ర విద్యలను, అభ్యసించి, సకల అస్త్ర-శస్త్ర విద్యలు నేర్చుకున్న తరువాత విపరీతమైన వైరాగ్యధోరణిలో మునిగిపోయి, నిద్రాహారాలు కూడా మానేసి, ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన సమయంలో వశిష్ఠుడు ఈ  సంవాదం ద్వారా శ్రీరామునికి కర్తవ్య బోధ చేసి ఉత్తిష్ఠుడిని చేయడం జరుగుతుంది. ఈ  కారణం చేతనే దశరథ మహారాజు శ్రీరాముడిని విశ్వామిత్రునికి అప్పగించడంలో గడువు అడిగింది; శ్రీరాముని స్థితిని విశ్వామిత్రుడికి చెప్పుకోలేక గడువు అడగడం జరుగుతుంది.  కేవలం పుత్ర వ్యామోహం వల్ల కాదు. 6 ప్రకరణలు, 32000 శ్లోకాలతో కూడిన గ్రంథం ఇది. 

వశిష్ఠుడి మనుమడే పరాశరుడు, వ్యాస భగవానుడి తండ్రి. వశిష్ఠ మహర్షి మరలా మహాభారత సమయంలో కూడా పుట్టాడని మన పురాణాలు చెప్తున్నాయి. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...