అగస్త్య మహాముని
(కాలం: త్రేతా యుగం)
నమో నమో నమస్తే నమస్తే అగస్త్య చరణారవిందం ||
అగస్త్య మహాముని సప్తర్షులలో (అగస్త్య, అత్రి, భరధ్వాజ, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులలో) ఒకరు. చూడటానికి మరుగుజ్జులా కనిపిస్తారు, కానీ వీరు అపార మహిమలు, మానవాళికి అపారమైన సేవలనందించినవారు. 4000 సంవత్సరాలకు పైగా జీవించారని చెప్తారు.
జన్మ: అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి ఇరువురూ కూడా కవలలు, ఇద్దరూ కుండాల్లో నుండి పుట్టినవారే. అందుకే వీరిని కుంభసంభవులని కూడా అంటారు.
వివాహం: వీరి వివాహం లోపాముద్ర అనే స్త్రీతో జరుగుతుంది.
ఆగస్త్యునికి సంబంధించి చాలా స్ఫూర్తిని కలిగించే, అద్భుతమైన, ఆసక్తికరమైన కథలున్నాయి. కైలాస మానసరోవరంలో మహాశివుడు ధ్యాననిమగ్నుడై దర్శనమిచ్చినప్పుడు, వారు కనులు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తూ కొన్ని యుగాలు వేచి ఉన్నవారు ఈ సప్తర్షులు. అలా వేచి ఉన్నప్పుడు మహాశివుడు కన్నులు తెరచి, వీరందరి భక్తికి మెచ్చి, ఒక్కొక్కరికీ 16 రకాల యోగవిద్యలను, 7 మందికీ మొత్తం 112 మహాయాయోగవిద్యలను ఉపదేశించడం జరుగుతుంది. ఈ 112 యోగవిద్యలు భూమ్మీద ఉన్న అన్ని రకాల మనస్తత్వాలకు తగినటువంటి విద్యలు. అందరికీ తలో దిక్కుకు వెళ్ళి వీటినందించమని ఆ ఆదిగురువైనటువంటి మహాశివుడు కోరతాడు. సప్తర్షులందరూ ఎంతో కృతజ్ఞతా భావంతో ఆ విద్యలను గ్రహించి, నిష్ణాతులై, గురువాజ్ఞ ప్రకారం ప్రచారానికి ఉపక్రమించబోతూండగా, శివుడు గురుదక్షిణ కోరతాడు. గురుదక్షిణ కోరింది, ఆయనకు యేదో కావాలని కాదట, కానీ మనిషి మానసిక స్థితి యేదైనా అర్పించే స్థితిలో ఉన్నప్పుడు పరమోత్కృష్టంగా పని చేస్తుందని అడుగుతాడట గురువు. అప్పుడు ఆ మహర్షులకు ఏమి చేయాలో దిక్కు తోచక, తమ వద్ద ఆ మహానుభావునికి అర్పించగలిగేదేమున్నదన్న సంధిగ్ధావస్థలో ఉన్నప్పుడు, అగస్త్య మహాముని ఈశ్వరుడికి ప్రణమిల్లి, "మహాదేవా, నా వద్ద నా ప్రాణం కంటే మిన్నయైనది, అతి అమూల్యమైనది, నీవందించిన మహా యోగవిద్య తప్ప నా వద్ద మరేమీ లేదు, కాబట్టి ఆ విద్యనే నేను నీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాను" అని విన్నవించుకుంటాడు. తక్కిన సప్తర్షులందరూ కూడా అగస్త్య మహామునిని అనుసరించడం జరుగుతుంది. ఆ విధంగా సప్తర్షులందరూ వారు అందుకున్న యోగవిద్యలన్నీ మహాదేవునికి సమర్పించేసుకోవడం వల్ల, అందరూ శూన్యులయిపోయారు. సప్తర్షులందరూ, ఇలా చేయడం వల్ల, ప్రతి ఒక్కరి హృదయమూ ఆ 112 యోగ విద్యలతో నిండిపోవడం జరుగుతుంది; అదీ గురుదక్షిణ మహిమ.
ఇలా మరొక కథ ఉన్నది: గురుదక్షిణ ఇచ్చిన తరువాత అగస్త్య మహాముని దక్షిణ భారత దిశగా ప్రయాణిస్తూండగా, హిమాలయాల కంటే ఎత్తైన పర్వతాలైనటువంటి వింధ్య పర్వతం, "మీరు హిమాలయాలను పర్వతారాజమని ఎలా ప్రకటిస్తారు, నా ఎత్తు అంతకంటే చాలా ఎక్కువగా ఉంది కదా?" అని మాత్సర్యంతో ప్రశ్నించడం జరుగుతుంది. వింధ్యాపర్వతానికి మహర్షి అంటే గౌరవ భావం ఉండటం వల్ల వంగి నమస్కరిస్తాడు. అప్పుడు అగస్త్యుడు, "నేను దక్షిణ దేశానికి పని మీద వెడుతున్నాను; నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకూ ఇలాగే ఉండు" అని ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత అగస్త్యుడు మళ్ళీ ఆ దారిన వచ్చింది లేదు. వింధ్యుడి గర్వాన్ని అణచడానికి అగస్త్య మహాముని అలా చేయడం జరిగింది. ఈరోజుకీ వింధ్య పర్వతాలు వంగే ఉంటాయని చెప్తారు. ఇలా అనేక కథలు ఆగస్త్యుని గురించి ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఈ మహర్షి దక్షిణ భారత దేశానికి చేసిన సేవ ఎనలేనిది. ప్రస్తుత దక్షిణ భారత దేశ సంస్కృతికి మూలపురుషుడు అగస్త్యుడు. ముఖ్యంగా తమిళ భాషకు, తమిళ సంస్కృతికీ నాడీ శాస్త్రాలకూ, జన బాహుళ్యంలో తెలియకుండా ఉత్కృష్ట వైదిక విలువలను ప్రతిష్ఠించినది ఈ మహాపురుషుడే. ఎన్నో అద్భుత దేవాలయాల ప్రాణప్రతిష్ఠ చేసింది కూడా ఈయనే.
త్రేతాయుగంలో శ్రీరాముడిని, సీతామ్మవారిని కలుసుకోవడం కూడా జరిగింది. ఆ అవతారా పురుషుడు, అమ్మవారు అగస్త్య ఆశ్రమంలో బస చేసి ముని ఆశీస్సులు పొందడం జరిగింది.
అగస్త్య మహాముని ప్రస్తావన మన పూజ్య బాబూజీ వ్రాసుకున్న డైరీల్లో కూడా కనిపిస్తుంది. అగస్త్య మహామునితో కూడా బాబూజీ దివ్య సంభాషణ చేసినట్లు, వారి మార్గదర్శనం కూడా పొందినట్లు తెలుస్తోంది.
.
Very nice post. 🙏
రిప్లయితొలగించండిఇపుడు ఇటువంటివి చాలాా అవసరం
రిప్లయితొలగించండిThanks to Krishna Rao garu
రిప్లయితొలగించండి