28, ఆగస్టు 2023, సోమవారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - కృష్ణచైతన్యంతో బాబూజీ

 


శ్రీకృష్ణ చైతన్యంతో బాబూజీ మహారాజ్ దివ్య సంభాషణ
 
పై చిత్రంలో బాబూజీ  మహారాజ్ నిగూఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ చైతన్యంతో జరిగిన కొన్ని దివ్య-సంభాషణలు మనం ఇక్కడ చదువుకుందాం. శ్రీకృష్ణ చైతన్యం లేక శ్రీకృష్ణుని వద్ద నుండి వచ్చే ప్రాణాహుతి నీలివర్ణ ఛాయలో ఉండేదని బాబూజీ తన ఆటోబయాగ్రఫీలో చెప్పడం జరిగింది. పైన చిత్రం కేవలం కాల్పనికం మాత్రమే. బాబూజీ తన ఆధ్యాత్మిక సాధనలో, నిగూఢ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు, తన గురుదేవులైన పూజ్య లాలాజీ మహారాజే గాక ఎందరో విముక్తాత్మలు, మహాత్ములు, మహర్షులు, మహాపురుషులు, అవతార పురుషులు, వీరి సంపర్కంలోకి వచ్చి అనేక రకాల ఆదేశాలనిచ్చి, బాబూజీని ఒక స్పెషల్ పర్సనాలిటీగా (ఒక విశిష్ఠ వ్యక్తిత్వంగా) తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ బాబూజీ తన ఆటోబయాగ్రఫీలో అంటే తన డైరీలో వ్రాసుకోవడం జరిగింది. అందులోని కొన్ని అంశాలు, శ్రీకృష్ణునికి సంబంధించినవి ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది. 

భగవద్గీతను గురించి 
శ్రీ కృష్ణ భగవానుడు బాబూజీతో (ఏప్రిల్ 2, 1946, సా. 7.30 గంటలు): "భగవద్గీత సారాంశం ఈ విధంగా ఉంది: అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి యున్న తనకు దగ్గరవారైన స్వజనులను చూసి విషాదానికి  గురయ్యాడు. వాళ్ళను ఎలా చంపాలి, ఎందుకు చంపాలన్న సంధిగ్ధతలో అవాక్కయ్యాడు. తన స్వంత మనుషులనే నరికేసి, తన బంధుమిత్రుల కుటుంబాలను నాశనం చేసేసి సామ్రాజ్యాన్ని సాధిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఇటువంటి ఆలోచనలన్నీ అతని మనసులో కల్లోలం సృష్టిస్తున్నాయి. పిరికితనం హృదయంలో చోటుచేసుకుంటుంది. అతని ఉత్సాహం అంతా నీరు కారిపోయింది, క్షత్రియ ధర్మమైన తన కర్తవ్య నిర్వహణ నుండి మనసు దూరమవుతూ ఉంది. 
"అతను నిర్వహించవలసిన కర్తవ్యాన్ని, అర్థమయ్యేలా, మాటల్లో బోధించడానికి ప్రయత్నించాను. డానితోపాటుగా నా సంకల్పశక్తినుపయోగించి యౌగిక ప్రాణాహుతి ప్రసరణ ద్వారా అతన్ని వివిధ ఆధ్యాత్మిక దశల ప్రవేశ ద్వారానికి తీసుకువచ్చాను. మాటలతోపాటు ఆలోచనా శక్తి తోడుగా లేకపోతే ఎంత గొప్పగా వివరించినా ఉపయోగం ఉండదు. ఆ విధంగా అన్నీ ఆధ్యాత్మిక బిందువులను ఆతని హృదయంలో ప్రవేశపెట్టి, స్థితప్రజ్ఞ స్థితిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్థితిలో కష్టం సుఖం రెండూ ఒకేలా ఉంటాయి; అలాగే జన్మమృత్యువులు కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కూడా. ఇదీ నేను అర్జునుడికి బోధించిన గీత. 
"నీకు నీ పూజ్య గురుదేవులు అందించిన బోధ కూడా ఇలాగే లేదూ? లోపలున్న అడ్డుతెరలను కేవలం ప్రసంగాల ద్వారా, సంభాషణల ద్వారా ప్రాణాహుతి ప్రసరణ సహాయం లేకుండా తొలగించడం సాధ్యపడుతుందా? ఒక్క విషయం గీతలో కచ్చితంగా బాగా నొక్కి చెప్పడం జరిగింది:  ఏ వ్యక్తి అయినా కూడా, తనకున్న సామాజిక స్థాయిని బట్టి, సామాజికపరమైన లేక పరంపరగా వస్తున్న సాంప్రదాయాన్ని బట్టి తనకు అప్పగించిన బాధ్యతను బద్ధుడై అంకితభావంతో నిర్వర్తించాలి. వాస్తవానికి ఈ అంశాన్ని ఒక గ్రంథ రూపంలో విశదీకరించడం జరిగింది. నేను ఎలా చెప్పానో సరిగ్గా అలాగే ఉంది అందులో."

రాధాకృష్ణుల ప్రేమ తత్త్వాన్ని గురించి 
శ్రీ కృష్ణ భగవానుడు బాబూజీతో (ఏప్రిల్ 3, 1946, ఉ. 9.20 గంటలు):
"నేను చాలా విచిత్రమైన విషయాన్ని వెల్లడిస్తున్నాను. రాధ, నేను యుద్ధభూమిలో కూడా కలిసే ఉన్నాం, రాధ నాతోనే ఉంది. ఎవ్వరికీ కూడా ఆమెను చూసి గుర్తించగలిగేంత శక్తి ప్రసాదింపబడలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా స్థితి? పరిపూర్ణుడైన మాస్టరు చేసే అద్భుతం ఇదే. ఇద్దరున్నా కూడా ఒక్కరే ఉన్నట్లుగా కనిపిస్తారు. రాధ ఎప్పుడూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అలాగే నేను కూడా ఎప్పుడూ రాధ ఆలోచన లేకుండా ఉండలేదు. ఇరువురిదీ ఒకే అస్తిత్వం. అంటే, అంతటా ఆమెతోనే ఉన్నాను, అలాగే ఆమె కూడా అంతటా నాతోనే ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక గమ్యస్థానం, దీన్ని చూడాలంటే కళ్ళు కావాలి, సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే తగిన మెదడు కావాలి. 
"మెదడు అంతా కేవల పుస్తకాలలో చదివినవాటితో మాత్రమే నింపుకున్న వ్యక్తికి ఈ అద్భుత మర్మాన్ని గ్రహించలేడు. ఇదొక విషయం అయితే అది పూర్తిగా భిన్నమైన మరొక విషయం. జ్ఞానులను పండితులని, పండితులను జ్ఞానులని పిలవడం ప్రారంభించారు. నిజమైన తత్త్వం ఇరువురిలో ఎవరూ బోధపడినవారు కాదు. 
"గీతలో నేను కేవలం ఆరు శ్లోకాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఏడవ శ్లోకం చెప్పడానికి అవకాశమే లేకపోయింది. దీన్ని ప్రత్యక్షంగా అనుభవంలోకి తీసుకురావడం జరిగింది. ప్రతీ శ్లోకము ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థితిని ప్రతిబింబిస్తుంది."

(సేకరణ:  విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్, వాల్యూమ్ 3, ఏప్రిల్ 1945 - ఏప్రిల్ 1946
పేజీ 399 నుండి 401 వరకు ఆంగ్ల మూలానికి తెలుగు అనువాదం) 




2 కామెంట్‌లు:

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...