శ్రీ కృష్ణ తత్త్వం
హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే ||
హరే రామ హరే రామ | రామ రామ హరే హరే ||
శ్రీకృష్ణ తత్త్వం గాని, ఆయన మానసం గాని తెలుసుకోవడం దుస్సాధ్యం గాని, కొందరు మహానుభావులు పలికిన పలుకులను మనం స్మరించుకోవచ్చు.
'కృష్' అంటే అతిగొప్పదైన 'ణ' అంటే ఆనందం, అంటే కృష్ణ అంటే అతిగొప్పదైన ఆనందాన్ని కలిగించేవాడు అని ఒక అర్థం చెబుతారు ఇస్కాన్ వ్యవస్థాపకులు అభయ చరణ భక్తి వేదాంత ప్రభుపాదులవారు. అలాగే అతిగొప్పగా ఆకర్షించేవాడిని కూడా కృష్ణ అని చెప్తారు. ఎవరిలోనైనా అద్వితీయ ప్రతిభ ఉంటే, సౌందర్యం ఉంటే, అద్భుతమైన వ్యక్తిత్వం గలవాడైతే, గొప్ప విద్యావంతుడైతే, ప్రసిద్ధ వ్యక్తి అయితే, చక్కగా మాట్లాడగలిగినవాడైతే, మహా శక్తివంతుడయితే, శ్రుతిశాస్త్రపు మర్మములు తెలిసినవాడైతే, మంచి వివేకవంతుడైతే, దైవత్వం ఉట్టిపడేవాడైతే, చక్కటి అంతరంగ సమత్వాన్ని ప్రతిబింబించేవాడైతే, ఇలా యే ఒక్క విషయం ఉన్నా వ్యక్తులు ఆకర్షిస్తారు. కానీ కృష్ణుడిలో ఈ సమస్త లక్షణాలూ ఉండటం వల్ల, ఆయనను మించి ఆకర్షించగలిగినవాడు సృష్టిలోనే ఇప్పటి వరకూ ఉద్భవించలేదు. అంతే కాదు నల్లనివాడు కాబట్టి కృష్ణుడాని కూడా అంటారు. నల్లవాడైనా అంత ఆకర్షణీయంగా ఉండేవాడు కృష్ణుడు.
అనంత తత్త్వం పరిమితం అవడమే అవతారము. ఆనంతత్వం నుండి పరిమితంగా దిగిరావడమే అవతారము యొక్క అర్థం. అవతారాల పరమార్థం దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ అని, అధర్మం పెచ్చు మీరినప్పుడు, ధర్మాన్ని స్థాపించడం కోసము, సాధు జనాన్ని రక్షించడం కోసము భూమమేడ అవతరిస్తారని భగవద్గీతలో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుని జీవితంలో ఇవన్నీ కనిపిస్తాయి. అంతే కాదు, రానున్న ఘోర కలియుగంలోని మానవుల కళ్యాణ నిమిత్తం ఆర్జనుడిని మాధ్యమంగా తీసుకుని ఒక బాహుదీర్ఘ దర్శి అయిన ఆచార్యునిగా మనకు భగవద్గీతను బోధించడం జరిగింది. ఆ గీతచే ఎంతమంది జీవితాలకు మార్గదర్శనం ఈ రోజుకీ లాభిస్తున్నాడో మనందరమూ కొంతవరకూ పరికించగలుగుతున్నాం.
మామూలు మనుషులు ప్రారబ్ధ వశాన లేక కర్మవశాన భూమ్మీద జన్మించడం జరుగుతుంది. అవతారా పురుషులు కోరి మానవ కళ్యాణం కోసం మానవ దేహాన్ని ధరించడము, ఒక ప్రణాళికా బద్ధంగా తమ జీవితాన్ని కొనసాగించడమూ, తమ అవతారాన్ని చాలించడమూ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే శ్రీకృష్ణావతారంగా ఆ ఆనంతత్వం దిగి వచ్చినది. శ్రీకృష్ణుడి జన్మ దగ్గర నుండి ఆయన ప్రణాళిక అమలు అవడం గమనించవచ్చు. యే తల్లి గర్భంలో జన్మించబోతున్నాడో (దేవకీ వాసుదేవులకు) , ఎక్కడ జన్మించబోతున్నాడో, (ఖైదులో), జన్మించిన తరువాత వాసుదేవుడు ఏమి చేయాలో (బుట్టలో పెట్టుకుని యమునా నది అవతలి ఒడ్డుకు వర్షంలో తరలించడం), యే తల్లి వద్ద పెరగాలో (యశోద), వాసుదేవుడు తిరిగి మరల ఖైదుకు తిరిగి రావడం, ఇవన్నీ ఆయన ఆదేశాల మేరకే జరిగిపోయాయి. ఇలాగే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని పుట్టుక ముందు నుండీ, ప్రతీ ఘట్టంలోనూ, మహాభార యుద్ధంలోనూ, చివరికి తన అవతారం చాలించే వరకూ కూడా తన దివ్య ప్రణాళిక అయిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ అనే అంశాలను అమలు పరచే విధంగా, తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఈ దృష్టి కోణంతో గనుక మనం శ్రీకృష్ణ అవతారాన్ని, వారి లీలలను పరికించి చూస్తే ఏ విధంగా శ్రీ కృష్ణుడు తన దివ్యత్వం యొక్క సంపూర్ణమైన ఎరుకతో జీవించాడనేది, ఎందుకు ఆయనది సంపూర్ణావతారం అని అంటారో, ఎందుకు పరిపూర్ణ అవతారం అని చెబుతారో ఎవరికైనా అర్థమవుతుంది; శ్రీకృష్ణ తత్త్వం బోధపడే అవకాశం ఉంది. మనిషిగా అనుభవించేవన్నీ అనుభవిస్తూ, ఎవరికీ దివ్యపురుషుడని తెలియకుండా భూమ్మీదకు వచ్చిన తన ప్రణాళికను నిర్వర్తించి అవతారాన్ని ముగించాడో పరికించి చూసినట్లయితే ఆయన తత్త్వం కొంతవరకైనా ఆవిష్కరింపబడుతుంది.
శ్రీకృష్ణ తత్త్వాన్ని గురించి అర్థం చేసుకోవడం గాని, దాన్ని గురించి ప్రసంగం చేయడం గాని, వ్రాయడం గాని, చేయాలంటే ఎంతటి మహాత్మునికైనా ఒక జీవిత కాలం కూడా సరిపోదు. స్వామి చిన్మయానంద చెప్పినట్లుగా బహుశా సాక్షాత్తు శ్రీకృష్ణుడికి కూడా సాధ్యపడదేమో! ఓషో రజనీష్ కృష్ణ తత్త్వాన్ని తన ప్రసంగాల ద్వారా అద్భుతంగా తెలియజేస్తూ కూడా, కృష్ణుడు భవిష్యత్తుకు సంబంధించిన వ్యక్తిత్వం అని, ఎవరికీ అర్థం కాడని, ఎవ్వరూ అర్థం చేసుకోలేరని అనడం జరిగింది. ఇది కేవలం దుస్సాహసం మాత్రమేనని ముందుగానే చెప్పుకున్నాను.
avunu dussaahasame ! dhanyosmi !!
రిప్లయితొలగించండి