18, నవంబర్ 2021, గురువారం

గీతాహృదయం 1 - పరిచయం

భగవద్గీత పరిచయం

భగవద్గీత  పరిచయం చేసే  గ్రంథం  కాదు.  కాని  ఎన్నిసార్లు  చదివినా  నిత్యనూతనంగా  ఉండేటువంటి,  ఎప్పుడూ  తాజాగా  కొత్తగా  కనిపించే  గ్రంథం. నిత్యం  మరిన్ని  మరిన్ని  సూక్ష్మాలు  తెలుసుకోగలిగేటువంటి  గ్రంథం.  5000 సంవత్సరాలుగా  ఎందరి  జీవితాలకో  దిక్సూచిగా  ఉన్న గ్రంథం;  జీవిత  మార్గదర్శిని; సక్రమమైన  దారిలో  నడిపించిన  గ్రంథం. 

లక్ష శ్లోకాల మాహాభారతంలోని  6వ  పర్వమైన  భీష్మ  పర్వంలో ఉన్న  18  అధ్యాయాలతో  700 శ్లోకాలతో  కూడుకున్న ఉద్గ్రంథం  భగవద్గీత. ఒక  గొప్ప  యోగశాస్త్రం. శ్రీకృష్ణార్జునుల  మధ్య  జరిగిన  సంవాదం. పాండవులు 7 అక్షౌహిణీల సైన్యం; కౌరవులు 11  అక్షౌహిణీల  సైన్యం.

కురుక్షేత్ర  రణరంగంలో యుద్ధానికి  సన్నద్ధమైన ఇరుసైన్యాల  మధ్య నిలబడిన అర్జునుడు  తన  బంధువులను, హితులను  జూచి,  తాను  ధర్మపక్షాన యుద్ధం చెయ్యడానికి  వచ్చానన్న వాస్తవాన్ని  మరచి యుద్ధాన్ని  వ్యక్తిగత  దృష్టితో  చూడటం  వల్ల  కలిగిన మోహం వల్ల  అతనిలో,  ఆ  విజయునిలో, ఆ సవ్యసాచిలో, ఎన్నో  యుద్ధాలు  అంతకు  పూర్వం  గెలిచిన పార్థునిలో, స్వధర్మాన్ని   మరచిన  ఆ  పరాక్రమవంతునిలో విషాదం  అలుముకుంటుంది. దీన్నే  మనం  ఆధునిక  భాషలో  డిప్రెషన్  అంటాం.  ఈ డిప్రెషన్ లోనుండి,  ఈ  విషాదంలో  నుండి  తన స్వధర్మాన్ని  గుర్తు  చేస్తూ వెలికి  తీసిన  క్రమంలో  అర్జునుడికి  అనేక రకాల  బోధలు  చేసిన సన్నివేశం  భగవద్గీత. 

ఈ  గ్రంథంలోని  18  అధ్యాయాల పేర్లలో  చివరి  పదం  యోగంగా  కనిపిస్తుంది. అవి ఇలా  ఉన్నాయి:

1) అర్జున విషాద యోగం - 46 శ్లోకాలు

2) సాంఖ్య  యోగం - 72 శ్లోకాలు

3) కర్మ యోగం  - 43 శ్లోకాలు

4) జ్ఞాన యోగం - 42 శ్లోకాలు

5) కర్మసన్న్యాస యోగం - 29 శ్లోకాలు

6) ధ్యానయోగం - 47 శ్లోకాలు

7) జ్ఞానవిజ్ఞాన యోగం - 30 శ్లోకాలు

8) అక్షరపరబ్రహ్మ యోగం - 28 శ్లోకాలు

9) రాజవిద్య రాజగుహ్య యోగం - 34 శ్లోకాలు

10) విభూతి యోగం - 41 శ్లోకాలు

11) విశ్వరూప సందర్శన యోగం - 55 శ్లోకాలు

12) భక్తి యోగం - 20 శ్లోకాలు

13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - 35 శ్లోకాలు

14) గుణత్రయ విభాగ యోగం - 27 శ్లోకాలు

15) పురుషోత్తమ యోగం - 20 శ్లోకాలు

16) దైవాసుర సంపద్విభాగ యోగం - 24 శ్లోకాలు

17) శ్రద్ధాత్రయ విభాగ యోగం - 28 శ్లోకాలు

18)  మోక్ష సన్న్యాస  యోగం - 78 శ్లోకాలు

ఈ  క్రమంలో  శ్రీకృష్ణార్జునుల  మధ్య  సంవాదాన్ని  ప్రత్యక్షంగా  తిలకించిన సంజయుడు,  వ్యాసుల  వల్ల  మనకు  ఈ  సంవాదం  మనందరికీ   అందుబాటులోకి  వచ్చింది. వ్యాస  మహర్షి  ఈ  సంవాదాన్ని  700  శ్లోకాలుగా  వ్యాఖ్యానించారు.  ప్రతీ శ్లోకమూ  అతి  ముఖ్యమైనదే.  యావత్  భగవద్గీత  అంతా  కూడా  పూర్తిగా, సమగ్రంగా అధ్యయనం చెయ్యవలసిన  గ్రంథమే. ఆధ్యాత్మిక  జిజ్ఞాసువులందరూ  తమ జీవితకాలంలో  ఒక్కసారైనా చదువవలసిన  గ్రంథం. 

కాని పూజ్య  బాబూజీ  ప్రకారం (హార్ట్ఫుల్నెస్ వ్యవస్థాపక  అధ్యక్షులైన మహనీయుడు) ఇరుసైన్యాలు  యుద్ధానికి  సన్నద్ధంగా  ఉన్న తరుణంలో  700  శ్లోకాలు  చెప్పే అవకాశం  లేదని,  శ్రీకృష్ణ భగవానుడు  తాను  చెప్పదలచుకున్నదంతా  కేవలం  7 శ్లోకాల్లోనే  నిక్షిప్తం చేసి చెప్పాడని  వెల్లడించడం  జరిగింది.  భగవద్గీతలోని ఆ   ఏడు  శ్లోకాలు ఏమిటో  మన  గురుదేవులు  పూజ్య  దాజీ  ఈ  మధ్యనే  వెల్లడి  చేయడం  కూడా జరిగింది. . వీటిని  గురించి  తరువాయి  భాగంలో  పరిశీలిద్దాం. (సశేషం) 

2 కామెంట్‌లు:

  1. అమోఘం గా రాసావు కృష్ణ ! ఇది ఆధ్యాత్మిక పథం లో అడుగుపెట్టిన నా లాంటి వారికీ, ఆధ్యాత్మిక జీవనం యొక్క రుచిని ఆకాంక్షించే వారికి ఈ మాధ్యమం ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తూ, ఇంకా ఇలాంటి విషయాలను విరివిగా పంచుకో గలవని కాంక్షిస్తూ .... నీ తో పాటు అంతరంగ ప్రయాణంలో ఉన్న సోదరుడు. రాము

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...