2) సాధన
మనలను మనం నిష్ప క్షపాతంగా, నిజాయితీగా పరికించి చూసుకున్నప్పుడు, ఆత్మావలోకనం ద్వారా ఉన్నదున్నట్లుగా మన ఆలోచనలను, చేతలను, భావాలను, ప్రవర్తనను, మన శీలాన్ని చూసుకున్నప్పుడు ఇవన్నీ మెరుగుపడాలంటే సాధన యొక్క ప్రాముఖ్యతను, అవసరాన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ సాధన మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ సహజమార్గ సాధనా పద్ధతి ఏ విధంగా నిత్యం మనకు తోడ్పాటునందిస్తుందో పరిశీలిద్దాం.
హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిలో నాలుగు ప్రధాన యోగ ప్రక్రియలున్నాయి - హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్, హార్ట్ఫుల్నెస్ ధ్యానం, హార్ట్ఫుల్నెస్ శుద్ధీకరణ/నిర్మలీకరణ, హార్ట్ఫుల్నెస్ ప్రార్థన అనే నాలుగు ప్రధాన యోగప్రక్రియలు. ఈ యోగప్రక్రియలను ప్రతి నిత్యం అనుసరించడానికి రోజులో ఉన్న 24 గంటల్లో కేవలం ఒక గంట/గంటన్నర పడుతుందంతే. ఈ మాత్రం సమయం మన కోసం మనం వెచ్చించినట్లయితే, సాధన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మనలో సమూలమైన మార్పులు కలగడం గమనించవచ్చు. ఈ ప్రక్రియలు మనం అనుకున్న మన ఆలోచనల్లోనూ, భావాల్లోనూ, ఉద్వేగాల్లోనూ, తద్వారా మన చేతల్లోనూ, ప్రవర్తనలోనూ, వెరసి మన శీలంలోనూ సహజమైన రీతిలో మార్పులు సంభవించడం గమనించవచ్చు.
మొదటిది హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్: ధ్యానానికి పూర్వం శరీర వ్యవస్థలోనూ మనసులో పేరుకున్న వత్తిడిని తొలగించౌకోవడం చాలా ప్రధానం. ఇది కేవలం 7-8 నిముషాల యౌక ప్రక్రియ. దీని వల్ల మన శరీరంలో విధ శరీర అవయవాల్లో, వివిధ ప్రధాన ప్రదేశాల్లో పేరుకున్న వత్తిడిని తేలికగా తొలగించుకోవచ్చు. దానితో మనసు కూడా కొంత ప్రశాంతతను సంతరించుకుని ధ్యానానికి సంసిద్ధంగా తయారవుతుంది. ఈ ప్రక్రియ ముగించేసరికి శరీర వ్యవస్థ అంతా కూడా ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది.
రెండవది హార్ట్ఫుల్నెస్ ధ్యానం: ఇప్పుడు ధ్యానానికి ఉపక్రమించినప్పుడు ధ్యానవస్తువుపై దృష్టిని నిలపడం తేలికైపోతుంది. ఈ క్రమంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి - పనికొచ్చేవి, పనికిరానివి, అసలు సంబంధం లేనివి, దివ్యమైనవి, వికారమైనవి, నకారాత్మకమైనవి అన్నీ వస్తూంటాయి. ఇవన్నీ మనలో నుండే వస్తున్నాయి కాబట్టి అవి మన ఆలోచనలే. మన మనసు ఆలోచించే విధానాన్ని మొట్టమొదటగా మనకు నచ్చకపోయినా మనం దగ్గర నుండి మన మనసు పని చేసే తీరును గమనించడం జరుగుతుంది. అంతరంగం అంతా అలజడిగా ఉంటుంది. మన దృష్టి ధ్యానవస్తువైన హృదయంలో అప్పటికే ఉన్న దివ్యజ్యోతి మనలను ఆకర్షిస్తోందన్న భావనపై నిలిపినప్పుడు ఈ ఆలోచనల ప్రభావం అంతగా ఉండదు. కాని ఆలోచనలపై మన దృష్టి ఉన్నప్పుడు అలజడిగా ఉంటుంది. మనకు నచ్చని విధంగా ఉంటుంది. ఆలోచనలు లేకపోతే బాగుండుననిపిస్తుంది. కాని ఆ ఆలోచనల ద్వారా కూడా మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మన ఎంతగా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉందో మనకర్థమవుతుంది. అలాగే మనలో కలిగే భావాలను, ఉద్వేగాలను, కూడా ఇలా మనం ఒక సాక్షిగా చూడగలగడం అలవాటు చేసుకుంటాం. ఆ విధంగా మనం సరిదిద్దుకోగలిగినవి ఏమిటి, సరిదిద్దుకోవలసినవేమిటి, సరిదిద్దుకోలేని భావాలేమిటి అన్న జ్ఞానం మనకు కలిగి దానికి మన గురువులు/మహాత్ములు సూచించిన పరిష్కారాల్ను ప్రయత్నించగలుగుతాం. ఆ విధంగా మనలో మనం పరివర్తన కలగడానికి పూర్తి స్పృహతో ప్రతి నిత్యం సంపూర్ణ ప్రయత్నంలో నిమగ్నమవుతాం. నెమ్మదినెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పట్టడం, నిజమైన ఆలోచనలు లేని మానసిక ప్రశాంతతను అనుభూతి చెందడం, తద్వారా నకారాత్మకతను తొలగించుకోవడం జరుగుతుంది. అందుకే ప్రతీ ధ్యానం తరువాత శాంతిని అనుభూతి చెందడం జరుగుతుంది.
మూడవది హార్ట్ఫుల్నెస్ శుద్ధీకరణ/నిర్మలీకరణ: ఈ ప్రక్రియ ద్వారా మనలో ఏర్పరచుకున్న, మన అంతఃకరణ శుద్ధికి అడ్డుపడే ముద్రలను/సంస్కారాలను తొలగించుకోగలుగుతాం. వీటినే మనం మలినాలనీ, సంక్లిష్టతలని / జటిల తత్త్వాలని సహజమార్గ పరిభాషలో అంటూంటాం. మలినాలంటే మనలో ఉండే కామక్రోధలోభమద మాత్సర్యాలే గాక, భయం, నకారాత్మకత వగైరావి. వీటి వల్ల మన ఆలోచన విధానంలో ఏర్పడే జటిల ఆలోచనా విధానాలే సంక్లిష్టతలఁటే. ఈ సంక్లిష్ట మనస్తత్త్వాల వల్ల మనం అనేక బలహీనతలకు గురవుతూ ఉంటాం, అనేక విధాలుగా పొరపాటులు చేస్తూ మన దుఃఖానికి కారణం మనమే అవుతున్నాం. వీటిని ప్రతి నిత్యమూ తొలగించుకోవడం వల్ల హృదయంలో చాలా తేలికదనాన్ని, ఆలోచనల్లో స్పష్టతను, ఉద్వేగాల భారం తొలగడం, ధ్యానలోలోతుల్లోకి వెళ్ళగలగడం వంటి పెనుమార్పులు సంభవించడం మనం గమనించవచ్చు. మన జీవితం రోజురోజుకూ ఈ హృడయభారం తగ్గడం వల్ల మరింత మరింత సరళంగా, స్వచ్ఛంగా తయారవుతూ ఉండటం మనం అనుభూతి చెందుతాం.
నాల్గవది ప్రార్థన: ఈ ప్రార్థన వల్ల, మనలో ఉండే అహంకారం తగ్గడం, స్వార్థం తగ్గుముఖం పట్టడం, అణకువగా ఉండటం, గతంలో చేసిన పొరపాట్లకు పశ్చాత్తాప పడటం, మరల ఆ పొరపాట్లు చెయ్యకుండా ఉందాలని తీర్మానించుకోవడం, అత్యున్నత శక్తియైన భగవంతునిపై ఆధారపడటం, ఆత్మసమర్పణా భావాన్ని పెంపొందించుకోవడం మనలో ఉన్న అంతర్యామితో అనుసంధానమవడం, ఇత్యాదివన్నీ మన చేతుల్లో లేనివాటిని సరిదిద్దుకొనే అవకాశాన్ని ఈ ప్రార్థన మనకు కలిగిస్తుంది. దీని వల్ల, మనలోనే గాక, మనకున్న సంబంధాల్లో కూడా గణనీయమైన మార్పును గమనించడం జరుగుతుంది.
అంతఃకరణ శుద్ధి: మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే ఈ నాలుగు ప్రధాన సూక్ష్మ శరీరాలను కలిపి అంతఃకరణ అని అంటారు. ఈ హార్ట్ఫుల్నెస్ రాజయోగ ప్రక్రియలను నిత్యం అవలంబించడం వల్ల ఈ అంతఃకరణ శుద్ధి జరిగి మన హృదయం సరైన సమయంలో సరైన సూచనలిస్తూ మన జీవన గమనాన్ని సరైన బాటలో నడిపిస్తుంది. మన హృదయాన్ని వింటూ ఆచరణలో పెట్టగలిగే స్థైర్యాన్ని కూడా మనకు సహజంగా కలుగుతుంది. (సశేషం)
Thanking you brother for your clear support 🙏
రిప్లయితొలగించండి